తెలంగాణ

రైతాంగ సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: రైతాంగ సమస్యల పరిష్కారానికి కేంద్రం అనేక పథకాలను అమలుచేయడమేగాక, పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.పంటకు మద్దతు ధరను పెంచిందని, నష్టపోయిన పంటకు బీమా దక్కేలా చర్యలు చేపట్టిందని, కేంద్ర పథకాలతో రైతాంగం దిశ, దశ మారిందని ఆయన చెప్పారు. ఇఎస్‌ఐఎ రీజనల్ కార్యాలయంలో రైతాంగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ రంగానికి భారీగా నిధులు ఖర్చు చేస్తోందని, కేంద్రం కూడా వివిధ పథకాలకు ఉదారంగా నిధులు కేటాయించాలని అన్నారు. కనీస మద్దతు ధర అంశంలో స్వామినాధన్ సిఫార్సులను దశల వారీ అమలు చేయాలని కోరారు. రాబడితో చూసుకుంటే పెట్టుబడులు భారీగా పెరిగాయని కనుక మద్దతు ధరను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అదే విధంగా సేద్యంలో ఖర్చులు తగ్గించడానికి రాష్ట్రప్రభుత్వం యాంత్రీకరణను భారీగా ప్రోత్సహిస్తోందని అన్నారు.
ఉన్నత విద్యావంతులు పాలీహౌస్‌ల రంగంలోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతున్నారని, పరంపరాగత కృషి వికాస్ యోజన స్కీం ద్వారా వారికి మరిన్ని ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. నకిలీ విత్తనాలను నిరోధించడానికి సీడ్ యాక్ట్ తీసుకురావాలని అన్నారు. ఈ బిల్లు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉండటంతో నకిలీ విత్తనాల కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నామని అన్నారు. పంటల సాగుకు అత్యంత ముఖ్యమైన భూసార పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 650 ల్యాబ్‌లకు నిధులు విడుదల అయ్యాయని, మిగతా 1450 ల్యాబ్‌లకు నిధులు మంజూరు చేయాలని అన్నారు. వ్యవసాయ మంత్రి ప్రతిపాదనలు, నివేదికపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సంతృప్తి వ్యక్తం చేశారు. జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్ధసారధి, కమిషనర్ జగన్మోహన్, ఉద్యాన శాఖ కమిషనర్ ఐ వెంకటరామిరెడ్డి, నాబార్డు సిజిఎం , మార్కుఫెడ్ , నాఫెడ్, ఎఫ్‌సిఐ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..శనివారం హైదరాబాద్‌లో రైతాంగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాసరెడ్డి