తెలంగాణ

ముందుకు సాగని సభా సంఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: కొత్త రాష్ట్రం, కొత్త అసెంబ్లీ...పాత అక్రమాలను తోడి వెలికి తీసి చర్యలు తీసుకోవాల్సిన సమయం. అందుకే ప్రతిపక్షాల డిమాండ్లతో, ఆందోళనలతో మూడు వేర్వేరు అంశాలపై పరిశీలనకు సభా సంఘాలు ఏర్పాటైనా, వీసమెతె్తైనా ముందుకు సాగడం లేదు. భూ ఆక్రమణలు, వక్ఫ్ భూముల అన్యాక్రాంతం, హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు వంటి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు గొంతు చించుకుని ఆందోళనలకు దిగడం, చివరకు ప్రభుత్వం స్పందించి సభా సంఘాల ఏర్పాటుకు సమ్మతించడం చూస్తు న్నాం. దీంతో స్పీకర్ సభా సంఘాలను నియమించి, మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినా, ఆరు నెలలైనా, ఏడాది దాటినా, రెండేళ్ళు పూర్తయి మూడో సంవత్సరంలోకి అడుగిడినా కదలడం లేదు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సభా సంఘాన్ని నియమించి విచారణ చేపట్టాలన్న మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం అసెంబ్లీ సభా సంఘాన్ని నియమించేందుకు అడుగు ముందుకేసింది. దీంతో అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి సభా సంఘాన్ని నియమించారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ సారథ్యంలో ఏర్పాటైన సభా సంఘంలో 12 మందిని సభ్యులుగా నియమించారు. 2015 జనవరిలో ఏర్పాటైన ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉండగా, నేటికీ నివేదిక సమర్పించ లేదు. వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై ఈ కమిటీ పలు వక్ఫ్ భూములపై విచారణ చేపట్టింది. పలు దఫాలు సమావేశమైనా, నివేదిక సమర్పించేందుకు సమయం తీసుకుంటున్నది. రంగారెడ్డి జిల్లాలోని హకీంపేట తదితర ప్రాంతాలను సందర్శించింది. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను వెనక్కి తీసుకోవడం, భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి ఆక్రమణలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి సభా సంఘం తన నివేదికలో ప్రభుత్వానికి సూచనలు చేయాల్సి ఉంది. అదేవిధంగా హౌసింగ్ సొసైటీల అక్రమాలపై ఎమ్మెల్యే ఎ. రమేశ్ నేతృత్వంలో సభా సంఘం, ప్రభుత్వ భూములపై ఎమ్మెల్యే ఎం. సుధీర్ రెడ్డి నేతృత్వంలో సభా సంఘం ఏర్పాటైన సంగతి తెలిసిందే. సుధీర్ రెడ్డి నేతృత్వంలోని సభా సంఘం వరంగల్ జిల్లాలోని రాంపూర్‌ను ఒకసారి సందర్శించింది. పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూములపై విచారణకు వెళ్ళింది. ఇలా వివిధ సమస్యలపై ప్రతిపక్షాల ఒత్తిడితో ప్రభుత్వం సభా సంఘాలను నియమిస్తున్నా సకాలంలో నివేదికలు సమర్పించలేకపోతున్నాయి.
సాధ్యమైనంత త్వరలో..
ఇలాఉండగా వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో స్పీకర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు. విచారణ దాదాపు పూర్తయ్యిందని, నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నామని ఆయన తెలిపారు. అయితే తన తల్లి ఆకస్మిక మృతి కారణంగా నివేదికను సమర్పించడంలో కొంత జాప్యం జరిగిందని అన్నారు. ఇక ఏ మాత్రం జాప్యం లేకుండా ఒకటి, రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తామని బాజిరెడ్డి తెలిపారు.