తెలంగాణ

అసెంబ్లీ సీట్ల పెంపుదలపై కదలిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ, ఆంధ్రలో అసెంబ్లీ సీట్ల పెంపుదలపై కదలిక వచ్చినట్లు తెలిసింది. ఈ దిశగా అవసరమైన రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఏపి పునర్విభజన చట్టం 2014కు రాజ్యాంగపరమైన సవరణలు తెచ్చేందుకు న్యాయ శాఖకు నోడల్ ఏజన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖ అవసరమైన ముసాయిదాను తయారుచేయాలని సూచించినట్లు సమాచారం. పునర్విభజన చట్టం ప్రకారం ఏపిలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలని ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రు లు కేంద్ర హోంశాఖను, ఎన్నికల సంఘాన్ని కలిసిన విషయం విదితమే. ఒకసారి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ తెచ్చిన తర్వాతనే ఎన్నికల సం ఘం తెరపైకి వస్తుందని, అంతవరకు తమ ప్రమే యం ఉండదని ఇప్పటికే ఎన్నికల సంఘం పేర్కొం ది. ఇదిలా ఉండగా అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ పార్టీలు ప్రతిపాదనలు పంపుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాలు వాటి జనాభాను, ఇప్పటికే అమలులో ఉన్న శాసనసభ, లోక్‌సభ నైసర్గికస్వరూపంను ప్రాతిపదికగా తీసుకుని అసెంబ్లీలను రాజ్యాంగ సవరణ తర్వాత ఎన్నికల సంఘం పెంచే ప్రక్రియను చేపడుతుంది.
ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ సీట్లను పెంచాలనుకున్నా సాధ్యం కాదు. రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. మొత్తం 31 జిల్లాలకు ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు విస్తరించి ఉన్నాయి. లోక్‌సభ ప్రాతిపదికన వెళితే, 2026 తర్వాత మళ్లీ అసెంబ్లీలను మార్చాల్సి ఉంటుంది. పైగా లోక్‌సభ సీట్లుపెంచాల్సి వస్తే సమస్య అవుతుంది. అందుకే మొత్తం 31 జిల్లాలు, వాటి పరిధిలో ఉన్న అసెంబ్లీలను, జనాభాను పరిగణనలోకి తీసుకుని కొత్త అసెంబ్లీలను జిల్లాలకే సర్దే విధంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. కాని ఈ విషయంలో ఎన్నికల సంఘందే తుది నిర్ణయం. ఒక సారి రాజ్యాంగ సవరణ పూర్తయిన తర్వా త, కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ నియోజకవర్గాల పెంపుదలపై నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తుంది. అనంతరం ఏవైనా మార్పులు ఉంటే చేసి నోటిఫికేషన్ విడుదల చేసి పార్లమెంటుకు పంపిస్తారు.
చట్టంలో లోపం వల్లనే సవరణ
ఏపి పునర్విభజన చట్టం సెక్షన్ 26(1) ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలి. రాజ్యాంగంలో 170వ అధికరణ రాష్ట్ర శాసనసభ సీట్ల సంఖ్యకు సంబంధించినది. ఏపి పునర్విభజన చట్టంలో 170 అధికరణకు లోబడి సెక్షన్ 26(1)ని అమలు చేయాలని పేర్కొన్నారు. హడావుడిగా ఈ చట్టాన్ని 2014 ఫిబ్రవరిలో ఆమోదించడం వల్ల రాజ్యాంగ సవరణ సమస్య ఉత్పన్నమవుతోంది. 170వ అధికరణ 15వ సెక్షన్‌కు లోబడి అంటే 2026 తర్వాత వరకు ఆగాల్సి ఉంటుంది. ఏపి పునర్విభజన చట్టం 26(1)కు 170వ అధికరణతో నిమిత్తం లేకుండా అనే పదాన్ని చేర్చితే సరిపోతుందని రాజ్యాంగ నిపుణులు కేంద్ర హోంశాఖకు సూచించినట్లు తెలిసింది. ఏపి పునర్విభజన చట్టంను అమ లు చేయకపోతే రాజ్యాంగమే ప్రశ్నార్థకంగా మారుతుందని రాజ్యాంగ నిపుణులు కేంద్ర హోంశాఖకు సూచించినట్లు తెలిసింది. ఈ విషయమై ఎంపి వినో ద్ కుమార్ మాట్లాడుతూ కేంద్రం అనుకుంటే రాజ్యాంగ సవరణకు ఒక రోజు సమయం చాలని చెప్పారు. విభజన చట్టంలోని హామీ మేరకు కచ్చితంగా అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంటుందన్నారు.
హైదరాబాద్‌లో 17 అసెంబ్లీ సీట్లు
తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ సంఖ్యను 153కు పెంచాలని ప్రతిపాదించారు. ఈ పెంపుదలకు జనాభాను ప్రాతిపదికగా తీసుకుని కొత్త అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేస్తే హైదరాబాద్ జిల్లాలో గరిష్టంగా 17 అసెంబ్లీ స్థానాలు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 11 అసెంబ్లీ సీట్ల చొప్పున, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఏడు చొప్పున, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో ఆరు చొప్పున, వరంగల్ అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్లో ఐదు సీట్ల చొప్పున, మిగతా జిల్లాల్లో మూడు నుంచి నాలుగు అసెంబ్లీ సీట్ల చొప్పున పెంచాలనే యోచన ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఇప్పుడున్న అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను కొనసాగిస్తారు. వాటిల్లో మార్పులు ఉండవు. కాని ఇప్పుడు పక్కపక్కన ఉన్న అసెంబ్లీల్లో కొన్ని మండలాలను విడదీసి జనాభా ప్రాతిపదికన కొత్త అసెంబ్లీలను ఏర్పాటు చేస్తారని సమాచారం. అసెంబ్లీ పరిధి జిల్లా హద్దులకే పరిమితం చేయనున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనలు కేంద్రానికి పెద్ద సంఖ్యలో వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.