తెలంగాణ

గొంతెండుతోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 25: నల్లగొండ జిల్లాలో కరవు, ఎండల తీవ్రత, భూగర్భ జలమట్టం గణనీయ స్థాయిలో పడిపోవడం వంటి సమస్యల నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. రెండురోజులకు ఒకసారి చేసే నీటి విడుదల కాస్తా నాలుగైదు రోజులకు విడుదల చేస్తుండడంతో మున్సిపాల్టీలు, గ్రామాల్లో జనం తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నారు. నిన్నటిదాకా నీరందించిన బోర్లు అకస్మాత్తుగా వట్టిపోతుండడంతో ప్రజల తాగునీటి కష్టాలు మరింత జటిలమవుతున్నాయి. జిల్లాలో కృష్ణా, మూసీ నదులతో పాటు హలియా, పాలేరు, డిండి, కనగగల్ వంటి వాగులు, 4,762 చెరువులున్నా ప్రజలకు మంచినీటి కటకట తప్పడం లేదు. భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతూ 19 వేల చేతి పంపులు, 4,700 బోర్ మోటార్లతో నీటి సరఫరా జరుగుతుండగా ఫ్లోరైడ్ నీటినే జనం తాగుతూ ఫ్లోరోసిస్ రక్కసి బారిన పడుతున్నారు. 1178 గ్రామ పంచాయతీలు, ఏడు మున్సిపాల్టీల్లో తాగునీటికి జనం పడుతున్న తంటాలు వేసవి ఎండల స్థాయిలోనే పెరిగిపోతున్నాయి. జిల్లాలో 34 లక్షల 84 వేల జనాభాకు 3,409 జనావాసాలుండగా వాటిలో ప్రస్తుతం 1457 ఆవాసాల్లో మంచినీటి ఎద్దడి నెలకొన్నట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇందులో 750 గ్రామాల్లో అద్దె బోర్లు, ట్యాంకర్లతో మంచినీటి సరఫరా సాగిస్తున్నారు. మంచినీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కలెక్టర్‌కు 2.22 కోట్ల నిధులిచ్చినా అవి ఎందుకూ సరిపోని దుస్థితి. కొత్త బోర్లు వేయాల్సి ఉండడం, ఉన్న బోర్లలో పైపులను పెంచడం, ట్యాంకర్లతో నీటి సరఫరా వంటి వాటికి మరిన్ని నిధులు అవసరముంది.
పథకాల లోపాలతో సరఫరాకు ఆటంకాలు!
జిల్లాలో 1270 కోట్లతో చేపట్టిన 59 కృష్ణా మంచినీటి పథకాల్లో ఇప్పటికే 389 కోట్లతో 22 పథకాల ద్వారా 1416 ఆవాసాలకు మంచినీటి సరఫరా జరుగుతున్నా పథకాల అస్తవ్యస్త నిర్వహణ, మరమ్మతులు తాగునీటి సరఫరా వ్యవస్థను ఆటంకపరుస్తుండటంతో మంచినీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. పథకాల నిర్మాణ లోపాలతో 145 గ్రామాలకు తాగునీరందడం లేదు. పజ్జూరు సిపిడబ్ల్యు స్కీమ్ పైప్‌లైన్ మరమ్మతులతో నల్లగొండ, తిప్పర్తి మండలాలకు మంచినీటి సరఫరాకు ఆటంకాలు నెలకొన్నాయి. జి.ఎడవెల్లి పథకం కింద గుర్రంపోడు, కనగల్ మండలాలకు నాలుగు రోజులకొకసారి నీటి విడుదల సాగుతోంది. నసర్లపల్లి, గోడకండ్ల, కొదండపురం పథకాలు సాగర్ నీరందక వారానికొసారి నీరందిస్తున్నాయి. చర్లగౌరారం, నిడమనూర్, చౌటుప్పల్, మునుగోడు, వలిగొండ, చండూర్, నాంపల్లి మంచినీటి పథకాల నిర్వహణ లోపాలతో తరుచూ మంచినీటి సరఫరా ఆగుతోంది. నాంపల్లి, మర్రిగూడ, మునుగోడులలో వారానికి ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండగా పైప్‌లైన్ల లోపాలతో 22 గ్రామాలకు నీరందడం లేదు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ పట్టణాల్లో మంచినీటి కొరత నెలకొంది. భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడిన భువనగిరి డివిజన్ పరిధిలో మిషన్ కాకతీయతో చెరువులు ఎండబెట్టడంతో భూగర్భ జలాలు అడుగంటి ఒక్కో మండలంలో వందల సంఖ్యలో బోర్లు, బావులు ఎండిపోతూ మంచినీటి సమస్యలు అధికమవుతున్నాయి. చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట మండలాలకు కృష్ణా మంచినీరు నాలుగు రోజులకొకసారి అన్నట్లుగా సరఫరా చేస్తున్నారు.
6.5 టిఎంసిల విడుదలపై ఆశలు!
కృష్ణా మంచినీటి ప్రాజెక్టులకు సంబంధించి ఉదయసమ ద్రం, మైల సముద్రం, జి.ఎడవల్లి, అయిటిపాముల, పెండ్లిపాకల, చేపూర్ రిజర్వాయర్లుకు ఎఎమ్మార్పీ ఎత్తిపోతల నుండి నీటి విడుదల జరిగినా జనం తాగునీటి అవసరాలకు సరిపోవడం లేదు. 3.04 టిఎంసిల నీరు చేరితేనే ఆయా రిజర్వాయర్లు నిండి ప్రజలకు కనీసం రెండు నెలల పాటు తాగునీటిని అందిస్తాయి. సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల చేస్తేనే చేపూర్, వాయిలసింగారం, పాలేరు, ముప్పారం చెరువులు నిండి మంచినీటి సరఫరా సాధ్యంకానుంది. కృష్ణా బోర్డు ఇటీవల ఆంధ్రకు 4.5 టిఎంసిలు, తెలంగాణకు 6.5 టిఎంసిలు కేటాయించగా ఆంధ్రకు నీటి విడుదల ప్రారంభమైనా తెలంగాణ ప్రభుత్వం ఇంకా తనవంతు నీటిని విడుదల చేయకుండా ముందస్తు అప్రమత్తతో తాత్సారం చేస్తోంది. సాగర్ ఎడమకాలువ, ఎఎమ్మార్పీల ద్వారా సదరు నీటి విడుదల జరిగితే రైతులు సాగుకు వినియోగించుకునే ప్రమాదముందని భావించి ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్ర వాట నీటిని విడుదల చేయాలని నిర్ణయించుకుంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్, వామపక్షాలు మాత్రం తక్షణమే నీటి విడుదల చేయాలని లేదంటే తమ ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నాయి. సోమవారం సాగర్ స్పిల్‌వే ముట్టడికి సిపిఎం, ఏప్రిల్ 1న కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునివ్వగా సాగర్ నీటి విడుదలపైనే ప్రస్తుతం జిల్లాతో పాటు జంటనగరాల మంచినీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి.