తెలంగాణ

కోటా 62 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లింలకు 12 శాతం , ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు

కోటా 62 శాతం

రాష్ట్రంలో పెరగనున్న రిజర్వేషన్ల మొత్తం
పెంపును ఆమోదించిన కేబినెట్
జిఎస్టీ, హెరిటేజ్ బిల్లులకూ ఓకే
ఎస్‌ఆర్‌ఎస్‌పి ఎత్తిపోతలకు అనుమతి
ప్రభుత్వోద్యోగులకు 3.66 శాతం డిఎ
ఆదిలాబాద్‌లో కెవివికి 10 ఎకరాల స్థలం
పోలీస్ బెటాలియన్‌కు 111 ఎకరాలు
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్, ఏప్రిల్ 15: ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కేబినెట్ ఆమోదం లభించిన నేపథ్యంలో తెలంగాణ రిజర్వేషన్ల యాక్ట్‌ను ఆదివారం శాసనసభలో ప్రవేశపెడతారు. ప్రగతిభవన్‌లో సిఎం కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రిజర్వేషన్ల యాక్ట్ ఆమోదం కోసం ఆదివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తుండటంతో, కేబినెట్ నిర్ణయాలను అధికారికంగా వెల్లడించలేదు. కేబినెట్‌లో రిజర్వేషన్ల అంశంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వోద్యోగులకు 3.66 శాతం డిఎ చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదించింది. కాళేశ్వరం నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పికి నీటిని తరలించే ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్‌డిఎస్ ఆయకట్టు స్థిరీకరణ కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపారు. వాల్మీకి బోయలు, కాయిత లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆదిలాబాద్‌లో కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది. ఆదిలాబాద్‌లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకు 111 ఎకరాల భూమి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వీటిని పది శాతానికి పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక ముస్లింలకు బిసి ‘ఈ’ కేటగిరి కింద ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం, బీసీ ‘సి’ క్యాటగిరీకింద వున్న ఒక శాతం కలిపి మొత్తం ఐదు శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. రిజర్వేషన్ల లెక్కలపై కేబినెట్ ఆమోదం లభించటంతో, అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఆమోదిస్తే 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించటం వరకే రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధి. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. ప్రస్తుతం రాష్ట్రంలో 50 శాతం వరకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో మొత్తం రిజర్వేషన్ల కోటా 62 శాతానికి పెరుగనుంది. తెలంగాణలో 90శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఉన్నాయని, దేశమంతా ఒకేరీతిలో లేదని కేబినెట్‌లో సిఎం ప్రస్తావించినట్టు తెలిసింది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నందున, అదే రీతిని తెలంగాణకు అవకాశం కల్పించాలని సిఎం కెసిఆర్ కేంద్రాన్ని కోరుతోన్న విషయం తెలిసిందే. ఒకవైపు తెలంగాణ మంత్రివర్గం రిజర్వేషన్లపై చర్చ జరుపుతుండగానే కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ నాయకులు మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని ప్రకటించటం గమనార్హం.
ఇదిలావుంటే, కేబినెట్ మూడు బిల్లులపై నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల బిల్లు, తెలంగాణ హెరిటేజ్ బిల్లు, జిఎస్టీ బిల్లులకు ఆమోదం తెలిపింది. గతంలో హైదరాబాద్ నగరంలో హెరిటేజ్ భవనాల పరిరక్షణకు మాత్రమే చట్టం చేశారు. కేవలం హైదరబాద్‌లో మాత్రమే కాకుండా వరంగల్, కరీంనగర్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చారిత్రక, పురాతన కట్టడాలు ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని సిఎం కెసిఆర్ కేబినెట్‌లో చర్చించినట్టు సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ హెరిటేజ్ చట్టాన్ని రూపొందించారు. ప్రభుత్వోద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు 3.66 శాతం డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వందమంది సీనియర్ పోలీసు అధికారుల పనోన్నతులకు ఆమోదం తెలిపారు. ప్రమాదాల్లో మత్స్యకారులు మరణిస్తే గతంలో చెల్లంచే నాలుగు లక్షల పరిహారాన్ని ఆరు లక్షలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 13 వందల ఉద్యోగాల భర్తీకి కేబినేట్ ఆమోదం తెలిపింది.
తుమ్మిళ్లకు ఆమోదం
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని కేబినెట్ ఆమోదించినట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. దశాబ్దాలుగా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌కు చుక్క నీరు రాక రైతాంగం ఇబ్బందుల పాలైందని, ఈ నిర్ణయం వల్ల ఆలంపూర్‌లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. నిజాం కాలంలోనే ఆర్‌డిఎస్ ద్వారా 87 వేల ఎకరాలకు సాగునీరు అందేదని, సమైక్య పాలనలో చుక్క నీరు లేకుండా పోయిందన్నారు. ఉద్యమ నేతగా కెసిఆర్ పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు స్వయంగా సమస్యను కెసిఆర్‌కు వివరించారని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. ప్రాజెక్టు కోసం మొదటి విడతగా 397 కోట్లు, రెండో విడతగా 386 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. 2018 చివరినాటికి 87.5వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు.