తెలంగాణ

అవే తప్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ప్రతి ఏటా ఎంత ప్రచారం చేస్తున్నా ఈ ఏడాది కూడా అభ్యర్థులు అవే తప్పులు చేయడంతో దాదాపు వంద మంది వరకూ ఎమ్సెట్ పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. గత పదేళ్లుగా ఎమ్సెట్ కమిటీ సామాజిక మాధ్యమాలు, ఎస్‌ఎంఎస్‌లు, ఇమెయిల్ ద్వారా ముందు రోజే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలని, పరీక్ష రోజు గంట ముందు కేంద్రానికి చేరుకోవాలని ఎంతగా చెప్పినా అభ్యర్థుల తీరు మారకపోవడంతో ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్న వారు వెక్కివెక్కి ఏడుస్తూ వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. పది గంటలకు చాలా పరీక్ష కేంద్రాల ప్రధాన ద్వారాలకు తాళాలు వేశారు. దాంతో పరీక్ష కేంద్రాల వద్దకు ఉరుకులు పరుగులతో వచ్చినా సమయం మించిపోవడంతో వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. దాంతో విద్యార్థులు ఏడుపు లంఖించినా ఫలితం లేకపోయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోయామని ఎంతగా విన్నవించినా అధికారులు మాత్రం వారిని అనుమతించలేదు.
బురఖాల తొలగింపు
బురఖాలు, తలపాగాలు, టోపీలు, ఫ్యాషన్ కళ్లద్దాలతో పరీక్ష కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులకు అధికారులు చుక్కలు చూపించారు. పలువురు అభ్యర్థినులు తమ బురఖాలను తీసి కుటుంబ సభ్యులకు అందజేసిన తర్వాతనే వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వారిని లోపలికి అనుమతించారు. కాగా ఇంజనీరింగ్ పరీక్షకు 1,41,190 మందికి గానూ 1,31,910 మంది అంటే 93.43 శాతం మంది హాజరుకాగా, మెడికల్ పరీక్షకు 79,061 మందికి గానూ 92.97 శాతం మంది అంటే 73,501 మంది హాజరయ్యారు. ఉదయం జెఎన్‌టియులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంజనీరింగ్, మెడికల్ పరీక్షల టెస్టు బుక్‌లెట్‌లను డ్రా ద్వారా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి తీశారు. సెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య, కో కన్వీనర్ ప్రొఫెసర్ ఎం మంజూర్ హుస్సేన్, చీఫ్ రీజనల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ బి సుధీర్ ప్రేం కుమార్ హాజరయ్యారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 నుండి ఒంటి గంట వరకూ జరగ్గా, అగ్రికల్చర్ స్ట్రీం పరీక్ష మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకూ జరిగింది. ఇందుకోసం 27 ప్రాంతీయ కేంద్రాలు, 400 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇంజనీరింగ్ స్ట్రీం, అగ్రికల్చర్ స్ట్రీంలకు కలిపి 2,20,248 మంది దరఖాస్తు చేయగా 2,05,411 మంది పరీక్షకు హాజరయ్యారు.
హాజరైన అభ్యర్థుల వివరాలు
ఆదిలాబాద్ రీజనల్ సెంటర్‌లో 665 (ఇ-ఇంజనీరింగ్), 845 మంది (ఎఎం- అగ్రికల్చర్) అభ్యర్థులు పరీక్ష రాశారు. భువనగిరిలో 1827(ఇ) , 874 (ఎఎం), కరీంనగర్‌లో 9430(ఇ), 5151(ఎఎం) అభ్యర్థులు, ఖమ్మంలో 7476 (ఇ), 3467(ఎఎం), మహబూబ్‌నగర్‌లో 4136(ఇ), 4341(ఎఎం) అభ్యర్థులు పరీక్ష రాశారు. మెదక్‌లో 589 (ఇ), 254(ఎఎం), నల్గొండలో 5307(ఇ) , 3438(ఎఎం), నిర్మల్‌లో 1321(ఇ), 1414(ఎఎం), నిజామాబాద్‌లో 6443(ఇ), 3887(ఎఎం), పెద్దపల్లిలో 2134(ఇ), 1341(ఎఎం), సంగారెడ్డిలో 2677(ఇ), 1738(ఎఎం), శంషాబాద్‌లో 3100(ఇ), 415 (ఎఎం), సిద్దిపేటలో 2502(ఇ), 1425 (ఎఎం), సూర్యాపేటలో 2922(ఇ), 1426(ఎఎం), వికారాబాద్‌లో 1255(ఇ), 1077 (ఎఎం), వనపర్తిలో 1863(ఇ), 1867(ఎఎం), వరంగల్‌లో 11759(ఇ), 8985( ఎఎం), హైదరాబాద్ -1లో 9859(ఇ), 4094(ఎఎం), హైదరాబాద్-2లో 7589(ఇ), 1047(ఎఎం), హైదరాబాద్-3లో 9689(ఇ), 5525(ఎఎం), హైదరాబాద్-4లో 11888(ఇ), 6848(ఎఎం), హైదరాబాద్-5లో 7742(ఇ), 1696(ఎఎం), హైదరాబాద్-6లో 5897(ఇ), 2554(ఎఎం) అభ్యర్థులు హాజరయ్యారు. ఇక ఆంధ్రాలో ఏర్పాటు చేసిన తిరుపతిలో 1989(ఇ), 2248(ఎఎం), విజయవాడలో 6582(ఇ) 4304(ఎఎం), విశాఖపట్టణంలో 3029(ఇ), 2039 (ఎఎం) అభ్యర్థులు హాజరయ్యారు.
అచ్చు తప్పులు.. బహుళ సమాధానాలు
ఎమ్సెట్‌లో ఈసారి ఇంజనీరింగ్ స్ట్రీంలో ఐదు పొరపాట్లు జరిగినట్టు విద్యార్థులు వాపోతున్నారు. అగ్రికల్చర్ స్ట్రీంలోనూ నాలుగు తప్పులు దొర్లాయని అంటున్నారు. ఇంజనీరింగ్ స్ట్రీం కోడ్ -ఎ పేపర్‌లో మాథ్స్‌లో 72వ ప్రశ్న, ఫిజిక్స్‌లో 83,97,98వ ప్రశ్నలకు సమాధానాలు సరిగా లేవని, ఫిజిక్స్‌లో 112వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. ఇంజనీరింగ్ స్ట్రీంకు ఐదు మార్కులు, మెడికల్ స్ట్రీంకు నాలుగు మార్కులు కలపాలని, లేదా ఆ మేరకు ప్రశ్నలను తొలగించి మిగిలిన మార్కుల మేరకు ర్యాంకులు ఇవ్వాలని వారు కోరారు.

చిత్రం..ఎమ్సెట్ పరీక్ష రాసేందుకు పరీక్షాకేంద్రంలోకి తరలివస్తున్న విద్యార్థులు