తెలంగాణ

సర్కార్ మెడకు ‘డబుల్’ ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో ప్రధానమైన హామీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం. ఎన్నికల ప్రచారంలో ఈ నినాదం చాలా ప్రభావం చూపింది. అయితే అమలు మాత్రం ఆశలు కల్పించిన స్థాయిలో కనిపించడం లేదు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. ఇంకా రెండేళ్ల కాలం మిగిలి ఉంది. 2.6లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులైతే మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకూ 1629 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. అంటే 5శాతం నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి, మిగిలిన రెండేళ్లలో 95శాతం నిర్మాణాలు జరగాలి. ఇదే తరహాలో పనులు సాగిస్తే లక్ష్యానికి చేరుకోవటం గగనమే అవుతుంది. ఒకవేళ అదే జరిగితే అధికారంలోకి రావడానికి పార్టీకి ఉపయోగపడిన ఈ నినాదం వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించటం ఖాయం. మొదటి రెండేళ్లపాటు ఇంటి నిర్మాణ వ్యయం ఎలా ఉండాలి అనే దానిపైనే తర్జనభర్జనలు జరిగాయి. కొంత భాగం లబ్ధిదారులు భరిస్తే ఐదులక్షల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఒక్క పైసా కూడా లబ్ధిదారుల నుంచి వసూలు చేయకుండా పూర్తిగా ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పడంతో దాదాపు ఏడున్నర లక్షల రూపాయల వరకు ఒక్కో యూనిట్‌కు వ్యయం చేయాలని నిర్ణయం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఎనిమిదిన్నర లక్షల రూపాయల వరకు వ్యయం అవుతోంది. 2.6లక్షల ఇళ్లలో లక్ష ఇండ్లు హైదరాబాద్ నగరంలో, మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో నిర్మించాలనేది సంకల్పం. హైదరాబాద్‌లోని లక్ష ఇళ్లలో 40వేల ఇళ్లకు టెండర్లు పిలిచారు. ఇక పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 83,087 ఇండ్లకు టెండర్లు పిలువగా, వాటిలో 41,925 ఇండ్లకు టెండర్లు ఖరారు అయ్యాయి. వీటిలో 20,986 ఇళ్ల నిర్మాణం సాగుతోందని, 1629 ఇండ్ల నిర్మాణం పూర్తయినట్టు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొదటి విడత 50,959 ఇండ్లను మంజూరు చేసింది. కేంద్రం మంజూరు చేసిన స్థాయిలో కూడా ఇండ్ల నిర్మాణం పూర్తి కాక పోవడం గమనార్హం.
రాష్ట్రాలు కోరినన్ని ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అనేకసార్లు ప్రకటించారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు కేంద్రం ప్రతిపాదనలు కోరితే ఏ రాష్ట్రం కూడా ప్రతిపాదనలు పంపలేదు. మిషన్ భగీరథ కింద మంచినీటి పంపిణీ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం వల్ల తెలంగాణ ఒక్క రాష్టమ్రే ప్రతిపాదనలు పంపితే ఏడువందల కోట్ల రూపాయల వరకు కేంద్రం మంజూరు చేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పథకంలో సైతం ఇదే విధంగా వేగంగా పనులు సాగించి కేంద్రం నుంచి సహాయం పొందే అవకాశం ఉంది కానీ ఆ దిశగా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
ఇంటింటికి మంచినీటిని ఇవ్వలేక పోతే 2019లో టిఆర్‌ఎస్ ఓటు అడగదంటూ మిషన్ భగీరథ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్న ప్రభుత్వం ఆ వేగాన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో చూపించటం లేదు. 2.6లక్షల ఇళ్ల నిర్మాణం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని సిఎం స్వయంగా శాసనసభలో ప్రకటించారు. ఆ తరువాత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో కొంత స్పీడ్ కనిపించింది. కానీ ఇప్పటివరకు జరిగిన పనులను చూస్తే రెండేళ్లలో రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావటమనేది అనుమానం కలిగిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయానికి ఆసరా పథకంతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం కీలక పాత్ర వహించింది. టిఆర్‌ఎస్‌కు ఓటు బ్యాంకుగా మారిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని సీరియస్‌గా తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం అమలుపై మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ దృష్టిసారించారు.