తెలంగాణ

అబద్ధాల అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోపణలు రుజువుచేస్తే సిఎం పదవికి రాజీనామా

తెలంగాణను హేళన చేసినందుకు క్షమాపణ చెప్పాలి కేంద్రం ఇచ్చిన దానికంటే మేమిచ్చిందే ఎక్కువ
నేను చెబుతున్న లెక్కలను మీరు కాదనగలరా? మోదీ మెచ్చుకుంటే, షా సోయితప్పి మాట్లాడాడు
అమిత్ షా, గిమిత్ షాలకు కెసిఆర్ భయపడడు ఆయనలాంటి వాళ్లను ఎంతమందిని చూళ్లేదు?
తెలంగాణను ఒక్క మాటన్నా సహించేది లేదు అమిత్ షాపై నిప్పులు చెరిగిన సిఎం కెసిఆర్

హైదరాబాద్, మే 24: ‘రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. షా ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అని సిఎం కె చంద్రశేఖర్ రావు సవాల్ విసిరారు. అమిత్ షా తెలివిలో ఉండి మాట్లాడారో, మతి తప్పి మాట్లాడారో తెలీదుకానీ, తెలంగాణపై ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులకంటే, కేంద్రానికి తెలంగాణ నుంచి వెళ్లిన నిధులే ఎక్కువని సిఎం లెక్కలతో వివరించారు. ‘వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా పట్టించుకునే వాడినికాదు. కానీ తెలంగాణను, ఇక్కడి ప్రజలను హేళన చేసి మాట్లాడితే సహించేది లేదు’ అని కెసిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘పొరుగు రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంతో పోటి పడుతున్న సంపన్న రాష్ట్రం తెలంగాణ. అలాంటి రాష్ట్రంపై అవాకులు, చెవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇలాంటి అమిత్ షా, బిమిత్ షాలను ఎంతమందిని చూళ్లేదు’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా, తెలంగాణకు కేంద్రం లక్ష కోట్లు ఇచ్చిందని చేసిన వ్యాఖ్యలను కెసిఆర్ ఖండించారు. ప్రగతిభవన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశాన్ని పెంచి పోషిస్తున్న నాలుగైదు రాష్ట్రాలో తెలంగాణ ఒకటి. ప్రధాని మోదీ సహా తొమ్మిది రాష్ట్రాల మంత్రులు, అధికారులు తెలంగాణను సందర్శించి ప్రపంచంతో పోటీ పడుతున్న రాష్ట్రంలో ప్రశంసలు గుప్పించారు. అలాంటి రాష్ట్రంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా అమిత్‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. దీనిపై స్పందించకుంటే ఆయన చెప్పిందే నిజమని ప్రజలు భ్రమపడే ప్రమాదం ఉంది. ఆయన వ్యాఖ్యలకు సమాధానం చెప్పేందుకే మీడియాకు వాస్తవాలు వెల్లడిస్తున్నాం’ అన్నారు. గతంలోనూ అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఇలాగే ఎన్ని అవాస్తవాలు చెప్పినా గరీబుగాళ్లు ఏదో మాట్లాడారని పట్టించుకోలేదన్నారు. అయితే తెలంగాణను, తెలంగాణ ప్రజలను అవహేళన చేస్తూ మాట్లాడటం వల్లే వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. అమిత్ షాను ప్రజలముందు దోషిగా నిలబెట్టడమే తమ ప్రయత్నమన్నారు. 2016-17లో కేంద్రానికి తెలంగాణ వాటాగా ఆదాయ పన్నుల కింద రూ.32,186 కోట్లు, సర్వీసు టాక్స్‌ల కింద రూ.7,671 కోట్లు, కస్టమ్స్ కింద రూ.3,328 కోట్లు, సెంట్రల్ ఎక్సైజు టాక్స్ కింద రూ.6,828 కోట్లు మొత్తంగా రూ.50వేల 130 కోట్లు చెల్లిస్తే, కేంద్రం నుంచి ఇదే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ఇచ్చింది రూ.24,561 కోట్లు మాత్రమేనని సిఎం వివరించారు. కేంద్రానికి తెలంగాణ చెల్లించిన దాంట్లో కనీసం 50 శాతం నిధులను కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ కేంద్రం ఇచ్చింది బిచ్చంకాదని, అది తమ హక్కని వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణకూ నిధులిస్తుంది తప్ప, మెహర్బానిగా ఇచ్చిందేమీ లేదన్నారు. ‘ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణకు అదనంగా 20 వేల కోట్లు ఇచ్చినట్టు అమిత్ షా చెప్పడం మరీ దారుణం. 20 వేల కోట్లు కాదు కదా అదనంగా 200 కోట్లు అయినా ఇచ్చారా?’ అని సిఎం కెసిఆర్ నిలదీశారు. రాష్ట్ర విభజన చట్టం కింద తెలంగాణలో మూడు వర్శిటీలు ఏర్పాటు చేయాల్సిఉండగా, 3 వర్సిటీలు ఇచ్చినట్టు చెప్పడం మరో పచ్చి అబద్దమన్నారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చినట్టు అమిత్ షా చెప్పారని, అదెక్కడుందో చూపెట్టగలరా? అని ప్రశ్నించారు. యూనివర్శిటీల ఏర్పాటుకు రూ.40,800 కోట్లు ఇచ్చినట్టు అమిత్ షా చెబుతున్నారని, ఎక్కడైనా వర్సిటీల ఏర్పాటుకు అంత పెద్ద మొత్తంలో నిధులిస్తారా? అని కెసిఆర్ నిలదీశారు. అలవోకగా ఏదంటే అది మాట్లాడటం అమిత్ షాకు అలవాటేనని ఎద్దేవా చేశారు. బిజెపి అధికారంలోకి వస్తే విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లడ బ్బు తెస్తామన్నారు కదా, తెచ్చారా? అని ఢిల్లీలో ఒక విలేకరి షాను అడిగితే, ఎన్నికల్లో నూట తొంభై చెబుతుంటామని సమాధానమిచ్చిన మహానుభావుడు ఆయన అని కెసిఆర్ దుయ్యబట్టారు.

చిత్రం... బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆరోపణలను మంత్రులతో కలిసి ఖండిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్