కృష్ణ

కమలదళంలో ‘అమితా’నందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మహా సమ్మేళనం విజయవంతం
* కార్యకర్తల సంబరం
* మార్మోగిన ‘జై మోదీ’ నినాదాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 25: భారతీయ జనతాపార్టీ రథసారధి అమిత్‌షా ఒకరోజు పర్యటన విజయవంతం కావటంతో కమలదళంలో అమితానందం కనిపించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను, అన్నింటికీ మించి ప్రధాని నరేంద్ర మోదీ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పోలింగ్ కేంద్రం స్థాయికి తీసుకెళ్లే ఆలోచనతో తొలిసారిగా రాష్ట్రంలో గురువారం విజయవాడలో జరిగిన పోలింగ్ బూత్ స్థాయ కార్యకర్తల మహా సమ్మేళనం విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 30వేల మంది వరకు కార్యకర్తలు తరలివచ్చారు. ఇరుగు పొరుగు జిల్లాల నుంచి వందల సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాల్లో కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా వచ్చారు. మధ్యాహ్నం నుంచే నగర వీధులన్నీ కళకళలాడుతూ కన్పించాయి. ఈసందర్భంగా భారత మాతాకీ జై.. నరేంద్ర మోదీ నాయకత్వం వర్థిల్లాలి.. అనే నినాదాలు వీధుల్లో మార్మోగాయి. ఇక అమిత్‌షా తన ప్రసంగంలో 2019లో దక్షిణాది రాష్ట్రాల్లో జరుగబోయే ఎన్నికల్లో విజయవాడ నుంచే విజయయాత్ర సాగించబోతున్నామంటూ తన అనర్గళ ప్రసంగం ద్వారా కార్యకర్తల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. అసలు ఈ సమ్మేళనం పార్టీ చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోగలదన్నారు. మండుటెండలో కూడా కార్యకర్తలు తరలిరావటం చూసి అమిత్‌షా ఉబ్బితబ్బిబ్బయిపోయారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలుగా పాటుబడుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపికి చెందిన ఇద్దరు మంత్రులుగా వ్యవహరిస్తున్నాని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అయితే తన పనితీరుతో ప్రశంసలు పొందుతున్నారంటూ అభినందించారు. మొత్తంపై అమిత్‌షా ప్రసంగం పార్టీ శ్రేణులను రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసినట్లయింది.

కోచ్‌ల నియామకాల్లో అక్రమాలపై
రంగంలోకి విజిలెన్స్!
* శాప్ కార్యాలయంలో విస్తృత తనిఖీలు
* కూపీ లాగుతున్న అధికారులు
* శాప్ ఎండీ వివరణపై అసంతృప్తి?
* నేటి నుండి పూర్తిస్థాయి విచారణ
* విజిలెన్స్ ఎస్పీ రవీంద్రనాథ్ వెల్లడి
విజయవాడ (స్పోర్ట్స్), మే 25: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్)లో అవుట్ సోర్సింగ్ కోచ్ పోస్టుల నియామకాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. విజిలెన్స్ ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు డిఎస్పీ విజయ్‌పాల్ ఆధ్వర్యంలో అధికారుల బృందం గురువారం శాప్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగారురాజు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఒఎస్‌డి) రామకృష్ణ, కోచ్‌ల రిక్రూట్‌మెంట్ కమిటీ కన్వీనర్ దుర్గాప్రసాద్‌ను కలిసి వివరాలు సేకరించారు. అవుట్ సోర్సింగ్ కోచ్ పోస్టుల నియామక ప్రక్రియ, ఇంటర్వ్యూలు జరిగిన తీరు, ఓ హోటల్‌లో అధికారులు చేపట్టిన దరఖాస్తుల పరిశీలనపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై శాప్ ఎండి బంగారురాజు సరైన వివరణ ఇవ్వకపోగా హోటల్‌లో ఏమీ జరగలేదంటూ ఖండించారు. ఈ వ్యవహారాలన్నింటినీ సుమోటోగా స్వీకరించిన విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. గురువారం శాప్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విషయాలు రాబట్టే ప్రయత్నంలో విజిలెన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. విజిలెన్స్ రంగంలోకి దిగటంతో శాప్ కార్యాలయ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అవుట్ సోర్సింగ్ విధానంలో కోచ్ పోస్టుల నియామకాలపై శాప్ వెబ్‌సైట్‌లో ఉంచిన నోటిఫికేషన్ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం వచ్చిన 1700 దరఖాస్తులు, శాప్ నియమించిన రిక్రూట్‌మెంట్ కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరైన వారి దరఖాస్తులు, సమర్పించిన పత్రాలను కూడా విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఈసందర్భంగా అవుట్ సోర్సింగ్ కోచ్ పోస్టుల నియామకాలపై అధికారికంగా ప్రకటన ఏదైనా ఉందా, లేదా? అని డిఎస్పీ విజయ్‌పాల్ ఆరాతీశారు. జిల్లాస్థాయిలో చేపట్టాల్సిన అవుట్ సోర్సింగ్ కోచ్‌ల నియామకాలను శాప్ నిర్వహించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై బంగారురాజు ఇచ్చిన సమాధానంపై విజిలెన్స్ అధికారులు సంతృప్తి చెందలేదు. కోచ్‌ల నియామకానికి సంబంధించిన ఫైల్‌ను తమకు అప్పగించాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇది తన పరిధిలో లేదని, యువజన సర్వీసులు, క్రీడల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం అనుమతి తీసుకుని రికార్డులను అప్పగిస్తామని ఎండి చెప్పినట్లు తెలిసింది. ఇదిలావుండగా అవుట్ సోర్సింగ్ విధానంలో శాప్ కోచ్‌ల నియామకానికి నిర్వహించిన ఇంటర్వ్యూలు అసలు కోచ్‌ల నియామక ప్రక్రియలో భాగం కాదని బంగారురాజు విజిలెన్స్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించిన ఫైల్‌పై మాత్రం కోచ్‌ల రిక్రూట్‌మెంట్ అని ఉండటంతో దానిపై విజిలెన్స్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కోచ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిర్వహించిన ఇంటర్వ్యూల్లో క్రీడలకు సంబంధం లేని ప్రశ్నలు వేయటాన్ని విజిలెన్స్ అధికారులు గుచ్చిగుచ్చి అడిగినట్లు తెలిసింది. అయితే పత్రికల్లో వచ్చినట్లుగా అక్రమాలు జరగలేదని, అసలు కోచ్‌ల నియామకాలే నిర్వహించడం లేదని, జిల్లాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో కోచ్‌ల పోస్టులకు వీరిని నియమించుకోవచ్చని మాత్రమే పరిశీలన జరిపామనే శాప్ ఎండి వివరణపై విజిలెన్స్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోచ్ పోస్టులకు ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత దరఖాస్తులను హోటల్‌లో ఎందుకు పరిశీలించారని, అసలు ఆ వెసులుబాటు ఉందా? అనే ప్రశ్నకు సమాధానం రాలేదని తెలిసింది. హోటల్ రూమ్ కోసం సుమారు రూ.25వేలు బిల్లు పెట్టినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
సెలక్షన్ కమిటీపైనా నిఘా!
అవుట్ సోర్సింగ్ కోచ్‌ల ఎంపిక కోసం శాప్ నియమించిన సెలక్షన్ కమిటీపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సెలక్షన్ కమిటీ చైర్మన్, సభ్యులతో పాటు కన్వీనర్‌గా వ్యవహరించిన దుర్గాప్రసాద్ గురించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సెలక్షన్ కమిటీ ఉండగా కన్వీనర్ అభ్యర్థులకు వేసిన ప్రశ్నలపైనా విజిలెన్స్ అధికారులు కూపీ లాగుతున్నారు. కోచ్‌ల నియామకాలపై నెలరోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలను పరిగణనలోకి తీసుకుని విజిలెన్స్ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.
సమగ్రంగా విచారిస్తాం
కోచ్‌ల నియామక ప్రక్రియపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించనున్నట్లు విజిలెన్స్ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పారు. కోచ్ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులు, ఇంటర్వ్యూల నిర్వహణకు సంబంధించిన రికార్డులను అప్పగించాలని శాప్‌ను కోరామన్నారు. అయితే ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం అనుమతి తీసుకుని అప్పగిస్తామని అధికారులు చెప్పారన్నారు. శాప్ కోచ్‌ల ఎంపిక విధానంపై శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభిస్తామని రవీంద్రనాథ్ వివరించారు.