తెలంగాణ

కుంటలో పడి నలుగురు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, జూలై 2: పండంటి కొడుకు పుడితే నీ సన్నిధిలోనే వెంట్రుకలు తీస్తాం.. మైసమ్మతల్లీ.. మమ్మల్నీ కరుణించు అని మొక్కుకున్నారు..అమ్మవారు కరుణించింది..కొడుకు పుట్టాడు.. తమ మొక్కును చెల్లించేందుకు అమ్మవారి గుడికి వచ్చారు. అంతా సవ్యంగా సాగిపోతోన్న తరుణంలో విధి వారిని వెక్కిరించింది. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం బురాన్‌పూర్ గ్రామంలో ఆదివారం నలుగురు చిన్నారులు నీట మునిగి మృతి చెందారు. సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే...తాండూర్ నియోజకవర్గం పరిధిలోని బషీరాబాద్‌కు చెందిన ప్రభు తన ఇద్దరు భార్యలు, పిల్లలతోకలిసి బొంరాస్‌పేట మండలం బురాన్‌పూర్ గ్రామంలో మైసమ్మ దేవతకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చాడు. అదే గ్రామంలోని తన బంధువులతో కలిసి పొలేపల్లి గోపాల్‌కు చెందిన పొలంలోని మైసమ్మ దేవతకు మొక్కులు తీర్చుకున్నారు. ఆతర్వాత పిల్లలు భోజనం చేసి అక్కడే ఆడుకుంటున్నారు. కాగా అదే సమయంలో పెద్దలంతా కలిసి భోజనాలకు ఉపక్రమించారు. పిల్లలు ఆడుకుంటున్నారని వారిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో నలుగురు శివనీలా(6), కార్తీక(4), మేరి(6), యాకోబు(9)లు కలిసి తాటికుంట వైపు వెళ్లారు. బహిర్భూమికి వెళ్లి కుంట దగ్గరకు వచ్చిన చిన్నారులు కుంట లోతును గమనించక ఒకరి తరువాత మరొకరు తమను కాపాడుకునే ప్రయత్నంలో నలుగురు నీట మునిగి ప్రాణాలు వదిలారు. చనిపోయిన చిన్నారులంతా పదేళ్లలోపు వయస్సువారే కావడంతో ఎవరు ప్రాణాలతో బయటపడలేక పోయారు.
ఉన్న ఇద్దరు చనిపోయారు..
అప్పటిదాక తమతో ముద్దుముద్దుగా మాట్లాడి.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయిన పసికూనలను చూసిన వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటా యి. బషీరాబాద్‌కు చెందిన ప్రభుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మికి కుమారుడు యాకోబు, కుమార్తె మేరి ఉన్నారు. రెండవ భార్య తుల్చమ్మకు ఇటివలే కొడుకు పుట్టడంతో వెంట్రుకలు తీసేందుకు ఇక్కడికి వచ్చారు. మొదటి భార్య తల్లిగారి గ్రామం బురాన్‌పూర్. నీట మునిగి చనిపోయిన సంఘటనలో మొదటి భార్యకు చెందిన ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. తనకున్న ఇద్దరు పిల్లలు చనిపోవడంతో చిన్నారుల మృతదేహాలపై పడి రోదిస్తున్న ఆ తల్లిని చూసి అక్కడికి వచ్చిన జనం చలించి పోయారు. అయ్యో పాపం దేవుడెంత పనిచేశాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక బురాన్‌పూర్ గ్రామానికి చెందిన అంజిలప్ప, వెంకటమ్మల కుమార్తె శివనీల, శ్యామలప్ప, వెంకటమ్మ దంపతుల కుమార్తె కార్తీకలు కూడా నీట మునిగి చనిపోయారు. అంజిలప్ప, శ్యామలప్పలు ఇద్దరు స్వంత అన్నదమ్ములు. ఒకే కుటుంబంలోని చిన్నారులు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి.
గతంలోనూ నలుగురు...
బురాన్‌పూర్ గ్రామానికి సమీపంలోనే తాటికుంట ఉంది. గతంలో ఒకే ఏడాదిలో కొద్దినెలల వ్యవధిలోనే ఇద్దరు చోప్పున మొత్తం నలుగురు ఈ కుంటలో పడి ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం చనిపోయిన చిన్నారులతో కలిపి మొత్తం ఎనమిది మంది కుంటలో పడి మృత్యువు పాలయ్యారు. నెల రోజుల క్రితం తాటికుంటలో చుక్కనీరులేదు.
ఇటివల కురిసిన వర్షానికి మొరం కోసం తవ్విన గుంతల్లోకి వర్షపునీరు చేరింది. గుంతల నిండా నీరుండడంతో అభం శుభం తెలియని ఆ చిన్నారులు లోతును కనిపెట్టలేక బలైపోయారు. సంఘటన స్థలాన్ని కొడంగల్ సిఐ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

చిత్రం..చిన్నారుల మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు