తెలంగాణ

కాంగ్రెస్ ‘ఇళ్లస్థలాల కబ్జా’ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, జూలై 3: గత ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు చూపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన స్థలాల కబ్జా కార్యక్రమాన్ని పోలీసులు నీరుగార్చారు. తన హయాంలో 5500 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తే అధికార టిఆర్‌ఎస్ పార్టీ అధికారులను, పోలీసులను ప్రేరేపించి అడ్డుకుంటోందని, వెంటనే పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేస్తూ లబ్ధిదారులతో స్థలాల కబ్జాకు బయలుదేరుతుండగా పోలీసులు వెనువెంటనే అరెస్టు చేసారు. నాటకీయ పరిణామాల మధ్య కొనసాగిన ఈ హైడ్రామాకు ఐదు నిమిషాల్లోనే పోలీసులు తెరదించారు.
ఆదివారం రాత్రి సదాశివపేటలోనే మకాం వేసిన జగ్గారెడ్డి సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై రోడ్లు, భవనాల శాఖ అతిధి గృహానికి చేరుకున్నారు. జగ్గారెడ్డి కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులు కనిపెట్టుకుంటూ వచ్చారు. జగ్గారెడ్డి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సదాశివపేటలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతంలో ఉంటే నగర పొలిమేరల్లోనే రాకుండా అరెస్టు చేయాలని పోలీసులు భావించగా వారి ఎత్తులను చిత్తు చేస్తూ రాత్రంతా సదాశివపేటలోనే ఆయన ఉండిపోయారు. సుమారు 200 మంది లబ్ధిదారులు తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకోగా పార్టీ కార్యకర్తలు పోగవుతున్న తరుణంలోనే పోలీసులు అరెస్టులు చేయడంతో కబ్జా కార్యక్రమం విఫలమైంది. అరెస్టు చేసిన జగ్గారెడ్డిని, కాంగ్రెస్ నాయకులను కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి స్వంత పూచీకత్తుపై విడుదల చేసారు. సంగారెడ్డి, జహీరాబాద్ డిఎస్పీలు తిరుపతన్న, నల్లమల రవి నేతృత్వంలో పలువురు సిఐలు, ఎస్‌ఐలు, ఎఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన ఇళ్ల్ల స్థలాల పట్టా కాగితాలతో తరలివచ్చిన పలువురు మహిళలు అధికార టిఆర్‌ఎస్ పార్టీ నాయకులపై శాపనార్థాలు పెట్టడం గమనార్హం. ఏళ్ల తరబడి ఇరుకైన ఇళ్లలో అద్దెకుంటూ అవస్థలు పడడంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నామనే విషయాన్ని అధికార పార్టీ నాయకులు గుర్తించకపోవడం సిగ్గుచేటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులతో ఇళ్ల స్థలాల కబ్జాను అడ్డుకోవడానికి అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమాత్రం నిలదొక్కుకోవని, పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు తమ పోరాటం ఆగదని అరెస్టు అనంతరం జగ్గారెడ్డి మరోమారు తేల్చిచెప్పారు. సదాశివపేట, సంగారెడ్డి పట్టణాలకు చెందిన పేదలందరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. లాఠీచార్జీలు, అరెస్టులకు భయపడేది లేదని, కలెక్టర్‌ను ఘెరావ్ చేసి తీరుతామని పేర్కొన్నారు. దీంతో సంగారెడ్డిలో మంగళవారం మరో హైడ్రామా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

చిత్రం.. సదాశివపేట రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేసి వాహనంలో తరలిస్తున్న పోలీసులు