తెలంగాణ

15న విద్యాసంస్థల్లో గ్రీన్‌డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మూడోదశ హరితహారంలో భాగంగా 15వ తేదీన విద్యాసంస్థల్లో గ్రీన్‌డే నిర్వహిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణలోని దాదాపు 30వేల విద్యాసంస్థల్లో 50లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. విద్యాసంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యాశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమానికి పాఠశాలలు, కాలేజీల్లో మొక్కలు నాటేందుకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. హరిత పాఠశాల- హరిత తెలంగాణ నినాదంతో మూడో దశ హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణను హరిత తెలంగాణగా మార్చేందుకు 2.30 కోట్ల మొక్కలు నాటేందుకు అతి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారని అందులో భాగంగానే విద్యాసంస్థల్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. వాటిని పరిరక్షించేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్టు కడియం శ్రీహరి చెప్పారు. ఇందుకోసం ఈ నెల 15వ తేదీన గ్రీన్‌డే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రీన్‌డే రోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకూ హరితహారం మీద చైతన్యం తీసుకువచ్చే విధంగా ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకూ విద్యాసంస్థల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని అన్నారు. 11 నుండి 12 గంటల వరకూ హరితహారంపై వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తామని, ఈ పోటీల్లో విజేతలకు ఆగస్టు 15న బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. మొక్కలు నటి వాటిని బాగా పరిరక్షించే విద్యాసంస్థలకు ఉత్తమ హరిత విద్యాసంస్థగా గుర్తించి బహుమతులు ఇస్తామని ఆయన వెల్లడించారు. మొక్కలను నాటే దశలోనే ఒక్కో విద్యార్థికీ వాటిని సంరక్షించే బాధ్యత ఇస్తామని పేర్కొన్నారు. మంచిగా మొక్కలను పరిరక్షించే విద్యార్థికి కూడా బహుమతులు ఇస్తామని , దీంతో పాటు విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచే విధంగా హరితహారాన్ని పాఠ్యాంశంగా రూపొందించే ఆలోచన ఉందని అన్నారు. గత ఏడాది విద్యాసంస్థల్లో 42 లక్షల మొక్కలు నాటామని చెప్పారు. ఇందులో 40 శాతం మొక్కలు పరిరక్షించామని అన్నారు. రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 50లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
వర్శిటీల్లోనూ మొక్కలు పెంపకం: పాపిరెడ్డి
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో 15వ తేదీన పెద్ద ఎత్తున మొక్కల పెంపకం కార్యక్రమం జరుగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి తెలిపారు. ఇందుకు వర్శిటీల సిబ్బంది, విద్యార్థులు సహకరించాలని సూచించారు.