తెలంగాణ

వారసత్వ నగరంగా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: హైదరాబాద్‌ను వారసత్వ నగరంగా గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. అంతేగాక, ఇందుకు యునెస్కోకు పంపాల్సిన ప్రతిపాదనలను వెంటనే సిద్దం చేయాలని కూడా ఆయన జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డిని ఆదేశించారు. షేక్‌పేట సమీపంలోని కులీకుతుబ్‌షాహీ టూంబ్స్ వద్ద సుమారు ఇరవై ఎకరాల్లో ఏర్పాటు చేసిన దక్కన్ పార్కును మంత్రి, డిప్యూటీ సిఎం మహమూదీ అలీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయలతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ సుమారు 400 పై చిలుకు సంవత్సరాల చరిత్ర కల్గిన హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించేందుకు అన్ని రకాల అర్హతలున్నాయని వివరించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ గుర్తింపు నగరాన్ని దక్కేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తరపున తగిన సహాయసహకారాలు అందించాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయను కోరారు. తెలంగాణ గ్రీన్ కవరేజీ పెంపొందించేందుకు చేపట్టిన హరితహారం మూడో దశ కార్యక్రమానికి ముందే దక్కన్ పార్కును ప్రారంభించటం సంతోషకరం అన్నారు. దక్కన్ పార్కు పరిసర ప్రాంతాల్లో ఉన్న 108 ఎకరాల స్థలాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గోల్కొండ, చార్మినార్, మక్కామసీదు, హైకోర్టు, కులీకుతుబ్‌షాహీ సమాధులు లాంటి ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక స్థలాలు నగరంలో ఉన్నందున నగరాన్ని ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని సురక్షిత, స్వచ్చ, స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అనేక చర్యలు చేపట్టామని, ఈ నేపథ్యం హైదరాబాద్ నగరానికి రెండు సంవత్సరాలుగా పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని గుర్తుచేశారు. కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని పటిష్టం చేసేందుకు తగినన్నీ నిధులు కేటాయిస్తామన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ మహాబూబ్‌నగర్, అదిలాబాద్, వరంగల్ ప్రాంతాలను ప్రత్యేక టూరిస్టు సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి అభివృద్ధి పరిచేందుకు రూ. 500 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించనున్నట్లు వివరించారు. కులీకుతుబ్‌షాహీ సమాధుల పునరుద్దరణ ఇతర సౌకర్యాల అభివృద్ధికి రూ. 99 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. అహ్మదాబాద్ నగరం మాదిరిగా హైదరాబాద్ నగరాన్ని కూడా ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించేందుకు కేంద్రం సహాయం చేస్తుందని వెల్లడించారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మాట్లాడుతూ నిజాం హయాంలోనే నగరం ప్రపంచ ప్రఖ్యాతి గాచిందని, తిరిగి తెలంగాణ ప్రభుత్వ హయాంలో మళ్లీ వైభవాన్ని సంతరించుకుంటుందన్నారు. హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసీ మాట్లాడుతూ నగరంలో గ్రీన్ కవరేజీని 12 శాతానికి పెంచాలని సూచించారు. గోల్కొండ కోటలో ఓ ప్రత్యేకతను కల్గిన కటోరా హౌజ్‌ను పునరుద్దరించాలని కోరారు. దక్కన్ పార్కులో స్విమ్మింగ్‌పూల్‌ను పునరుద్దరించటంతో పాటు పార్కుల్లో పరిసర ప్రాంతాలు, కాలనీల వారిని మార్నింగ్ వాకింగ్‌కు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, ఎమ్మెల్యే గోపీనాధ్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

చిత్రం.. దక్కన్ పార్కును ప్రారంభించి ప్రసంగిస్తున్న మంత్రి కెటిఆర్