తెలంగాణ

ఎవరి అండతో పోలీసులు రెచ్చిపోయారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: పోలీసులు ఎవరి అండ చూసుకుని సిరిసిల్లలో రెచ్చిపోయి దళితులపై అమానుషంగా దాడి చేశారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసులు అమాయకులైన దళితులను, బిసిలను ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించి చిత్ర హింసలు పెట్టారని ఆయన విమర్శించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగేళ్ళపల్లి మండలంలోని నేరేళ్ళ గ్రామంలో ఇటీవల దళితులను, బిసిలను పోలీసులు అరెస్టు చేసిన ఘటనపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్ కుమార్, డిసిసి అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించారు.
సమావేశానంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల ఘటనను నిరసిస్తూ ఈ నెల 26న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 31న చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తనయుడు, రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అండతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదని ఆయన విమర్శించారు. గతంలో ఖమ్మం జిల్లాలో మద్దతు ధరలు అడిగిన గిరిజన రైతులను చితకబాది, అక్రమ కేసులు పెట్టి, నిర్భంధించి జైళ్ళలో పెడుతున్నారని, బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్ళారని ఆయన ఆందోళన వ్యక్తం చేవారు. పోలీసులు వేధించినట్లు చెబితే మీ ఇంట్లోని మహిళలపై వ్యభిచార కేసులు పెడతామని బెదిరించారని, దళితలను పడుకోబెట్టి మెడలపై కాళ్ళ బూట్లతో తొక్కి హింసించారని, దీంతో వారి ఎముకలు విరిగాయని, కిడ్నీలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ఇంత అమానుష సంఘటనలు జరుగుతున్నా మంత్రి కెటిఆర్ తన నియోజకవర్గంలో జరిగే అంశాలపై ఎందుకు స్పందించడం లేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయాలపై తాము ఇదివరకే పార్టీ తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని, రాష్ట్ర డిజిపిని కలిసి వినతి పత్రం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని డిజిపి హామీ ఇచ్చినా ఇంత వరకు ఆచరణలో కనిపించలేదన్నారు. దళితులు, బిసిల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.