ఆంధ్రప్రదేశ్‌

2 వరకు ముద్రగడ గృహ నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 27: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధాన్ని ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గురువారం విడుదల చేసిన గృహ నిర్బంధ నోటీసులను పోలీసులు ముద్రగడకు అందజేశారు. బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడిలోని స్వగృహం నుండి నిరవధిక పాదయాత్రకు సిద్ధమైన ముద్రగడను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. 24 గంటల పాటు ముద్రగడను గృహ నిర్బంధంలో ఉంచుతునట్టు ప్రకటించారు. గురువారం ఉదయం తిరిగి పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన ముద్రగడను మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఆగస్టు 2వ తేదీ వరకు గృహ నిర్బంధాన్ని పొడిగిస్తూ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను పోలీసులు ముద్రగడకు అందజేశారు. ఉదయం 9 గంటలకు పాదయాత్రగా కాపు జెఎసి నేతలతో కలసి ఇంటి బయటకు వచ్చిన ముద్రగడను సాయుధ బలగాలతో సిద్ధంగా ఉన్న పోలీసు అధికారులు అడ్డుకున్నారు. ఆగస్టు 2వ తేదీ వరకు కలెక్టర్ గృహ నిర్బంధాన్ని పొడిగించినట్టు ముద్రగడకు చెప్పారు. శాంతియుత మార్గంలో పాదయాత్రకు సిద్ధమయిన తనను అడ్డుకోవడం సమంజసంగా లేదని పోలీసుల వద్ద ముద్రగడ వ్యాఖ్యానించారు. పోలీసు అధికారుల బృందంలో ఒకరు మాట్లాడుతూ ‘మీరు కావాలంటే దీనిపై కోర్టుకు వెళ్ళవచ్చు’ అని సూచించారు. దీనిపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా తనకు కోర్టులకెళ్ళే అలవాటు లేదన్నారు. తప్పులు చేసేది చంద్రబాబని అందుకే ఆయన కోర్టులకు వెళ్తుంటారని విమర్శించారు. ప్రతి విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతుందని చంద్రబాబు చెబుతుంటారని, అదే కనుక నిజమైతే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఏనాడో జైలుకు వెళ్ళేవారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ సమస్యలపై అనుమతులు అడిగి ఉద్యమాలు చేయరని పేర్కొన్నారు. ఇందుకు చరిత్రలో అనేక ఉదాహరణలున్నాయని చెప్పారు. ఇలాగైతే మహాత్మా గాంధీ బ్రిటీష్ ప్రభుత్వాన్ని అనుమతులు అడిగి ఉద్యమాలు చేయాల్సి వచ్చేదని ముద్రగడ వ్యాఖ్యానించారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కావాలనే కాపులను ఫుట్‌బాల్ ఆడుతున్నారని, 2019లో కాపులు తిరిగి చంద్రబాబును ఫుట్‌బాల్ ఆడతారని ముద్రగడ ఎద్దేవా చేశారు. కాగా ప్రత్తిపాడు, కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. కిర్లంపూడిలో సుమారు 2వేల మంది పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నారు.

చిత్రం.. కాపు జెఎసి నేతలతో కలిసి తన ఇంటి నుండి పాదయాత్రగా బయలుదేరిన ముద్రగడకు గృహనిర్బంధం పొడిగింపు విషయాన్ని తెలుపుతున్న పోలీసు అధికారులు