తెలంగాణ

తెరపైకి మళ్లీ హన్మకొండ జిల్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 30: వరంగల్ నగరాన్ని రెండు ముక్కలుగా చేసే ప్రయత్నానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నగరాన్ని రెండు ముక్కలుగా చేసి సమీప మండలాలను కలిపి వరగంల్, హన్మకొండ జిల్లాలుగా మార్చే ఆలోచనకు ప్రభుత్వం మళ్లీ పదును పెడుతోంది. ఫలితంగా నగరంలోని ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి నాన్‌లోకల్ అయ్యే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఏర్పడుతోంది. జిల్లాల పునర్విభజన సందర్భంలోనే ఎవరు ఇచ్చిన సలహానోగానీ వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఈ ప్రతిపాదనను జిల్లాకు చెందిన, ముఖ్యంగా వరంగల్ నగరానికి చెందిన మెజారిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఘనచరిత్ర ఉన్న నగరాన్ని రెండు ముక్కలుగా చేయడం ద్వారా వరంగల్ నగర ఆస్తిత్వాన్ని దెబ్బతింటుందని అందరూ ఆందోళన వ్యక్తం చేసారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని ముట్టుకోని ప్రభుత్వం వరంగల్ నగరాన్ని రెండుగా విభజించే ప్రయతాన్ని అప్పట్లోనే తీవ్రంగా వ్యతిరేకించారు. అధికార పార్టీకి చెందిన మెజారిటీ నాయకులు కూడా నగరాన్ని రెండుగా విభజించడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఫలితంగా వరంగల్, హన్మకొండ జిల్లాల స్థానంలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు ఏర్పాటు చేసారు.
ఇంతవరకు బాగానే ఉన్నా రూరల్ కలెక్టరేట్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నుంచి చొరవ కొరవడటంతో గత కొన్ని నెలలుగా కలెక్టరేట్ ఎక్కడ ఏర్పాటుచేస్తారనే అనుమానాలు అటు రాజకీయ పక్షాల్లో, ఇటు ప్రజల్లో ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనల సందర్భంగా అయితే వరంగల్ జిల్లానో, లేకుంటే రూరల్ జిల్లానో ఏర్పడితే దీని కలెక్టరేట్ ఆజంజాహి మిల్లు గ్రౌండ్‌లో, లేక పాత బీటుబజారులో ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ తొమ్మిది నెలలపాటు ఈ వ్యవహారాన్ని నానుస్తూ రావడం ద్వారా ప్రభుత్వం సమస్యను జటిలం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత మొదట కలెక్టరేట్‌ను వరంగల్-నర్సంపేట జాతీయ రహదారిపై గీసుకొండ మండల కేంద్రానికి చేరువలో ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అక్కడ చూపించిన స్థలం కలెక్టరేట్ నిర్మాణానికి అనుకూలంగా లేదని అధికారులు తేల్చారు. ఈ సందర్భంలో మామునూరు వద్దగానీ, ఆజంజాహి మిల్లు వద్దగానీ రూరల్ కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరుతూ వచ్చారు. కానీ నగర శివారులోని మొగిలిచర్ల వద్ద ప్రభుత్వానికి చెందిన 25 ఎకరాల స్థలం ఉండడం, పక్కనే ఉన్న 18 ఎకరాల భూమిని కలెక్టరేట్ నిర్మాణం కోసం ఉచితంగా ఇచ్చేందుకు వాటి యజమానులు ముందుకు రావడంతో అక్కడ కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ మొగిలిచర్ల వద్ద కలెక్టరేట్ నిర్మాణం ప్రజలకు అనుకూలం కాదని, రవాణా సౌకర్యాలు సరిగాలేని ప్రాంతంలో కలెక్టరేట్ నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని అన్ని పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేసాయి. ఇదే సమయంలో గత వారం రోజులుగా పరకాల, నర్సంపేట ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో రూరల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశమైన సందర్భంలో మళ్లీ మరోసారి వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. రూరల్ కలెక్టరేట్ భవనాన్ని ఆజంజాహి మిల్లు గ్రౌండ్‌లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెబుతూనే గతంలో తాను ప్రతిపాదించిన మేరకు వరంగల్, రూరల్ జిల్లాల ఏర్పాటుకు అమోదిస్తే కలెక్టరేట్ ఏర్పాటు ఎక్కడనే సమస్య వచ్చేది కాదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దాంతో జిల్లా నాయకులు కూడా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. జిల్లా కేంద్రం విషయంలో ప్రతిపక్షాలు, అఖిలపక్షాలు చేస్తున్న ఆందోళనలు, కలెక్టరేట్ ఏర్పాటు విషయంలో అధికార పక్షంలో సఖ్యత లేని నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ అర్బన్, రూరల్ జిల్లాలను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా మార్చే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రాంత నాయకులు ఆందోళనలు కొనసాగిస్తుండగా ఉన్న జిల్లాల మార్పులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో మళ్లీ ములుగు జిల్లా కోసం ఆందోళనలు తీవ్రమయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామం అధికార పార్టీ నాయకుల గొంతులో వెలక్కాయలా మారుతుండగా, ప్రతిపక్షాలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.