తెలంగాణ

అన్నదాతల ఆత్మహత్యలు రాష్ట్రానికి అరిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 30: అన్నదాతల ఆత్మహత్యలు రాష్ట్రానికి అరిష్టమని, అవగాహన లేని ప్రాజెక్టుల నిర్మాణంతో పేద రైతులు బుక్కెడు బువ్వ కోల్పోతారని రాజకీయ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన అమరుల స్ఫూర్తియాత్రలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఎలాంటి సర్వేలు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం పేరిట పేదలను బజారున వేయడం తగదని, అయితే భూమికి భూమి ఇచ్చి ముంపు బాధితులను ఆదుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజలు క్షమించరని, ఒక ఉద్యమకారుడికి బడుగు జీవుల ఇబ్బందులు దృష్టికి తెచ్చేందుకు స్ఫూర్తి యాత్ర నిర్వహించడం సిగ్గుచేటని నిలదీశారు. రాష్ట్రంలో లక్షా 57వేల ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉండగా, కేవలం మూడేండ్లలో 20 వేల పోస్టులు భర్తీ చేసి చేతులు దులుపుకోవడం తగదని తెలిపారు. నోటిఫికేషన్‌లపై నోటిఫికేషన్‌లు వేస్తూ నిరుద్యోగులతో చెలగాటమాడడం తగదని, ఎస్‌ఐ పోస్టులు భర్తీ చేయడంలో జాప్యమెందుకని అన్నారు. పెద్దల భూములు కాపాడేందుకు మల్లన్నసాగర్ రిజర్వాయర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల కట్టలు రింగ్ రోడ్డు మాదిరిగా వంకలు తిప్పుతుండడం దురదృష్టకరమని, పేద రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ పెద్దల కొమ్ము కాస్తుండడాన్ని ప్రతిఒక్కరు గమనిస్తున్నారన్నారు. కాగా స్ఫూర్తియాత్రకు అనుమతి కోరితే ఎన్నో ఇబ్బందులకు గురిచేయగా, చివరకు బుక్కెడు బువ్వ తినడానికి కూడా వెళ్లనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము జగదేవ్‌పూర్‌లో భోజనం చేయడానికి ఏర్పాట్లు చేసుకోగా, సిఎం ఫాంహౌస్‌కు వెళ్తారనే భయంతో సమస్యలు సృష్టించగా, ఫాంహౌస్ ఏమైనా పుణ్యక్షేత్రమా అని ఆయన నిలదీశారు. వనరులు, నిధులు గతంలో లాగానే ఆంధ్రావారి దోపిడీకి గురవుతుండగా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా న్యాయం జరగడంలేదనే ఆవేదనలో ప్రజలున్నట్లు చెప్పారు. కొండపోచమ్మ రిజర్వాయర్ బాదితులకు రూ. 12లక్షల పరిహారంతోపాటు డబల్‌బెడ్‌రూం ఇల్లు, బర్లు, కోళ్ళు ఇస్తామని చెప్పి ఖాళీ కాగితాలపై అన్నీ ముట్టినట్లుగా సంతకాలు చేయించుకోవడం తగదని అన్నారు. తీన్మార్ మల్లన్న, ఏపూరి సోమన్నల కళాబృందాలు ప్రజలను చైతన్యం చేయగా, ఈ కార్యక్రమంలో నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం, బీరయ్య యాదవ్, గురజాల రవీందర్, డిబిఎఫ్ శంకర్, అశోక్‌కుమార్, కప్పర ప్రసాద్‌రావు, బైరి రమేశ్, రామగిరి ప్రకాశ్, ప్రభాకర్‌రెడ్డి, ఏగొండ స్వామి, సర్దార్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. గజ్వేల్‌లో ఆదివారం జరిగిన అమరుల స్ఫూర్తి యాత్రలో ప్రసంగిస్తున్న జెఏసి చైర్మన్ కోదండరాం