తెలంగాణ

వాడివేడిగా టిఎస్‌ఈఆర్‌సి విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చేపట్టిన బహిరంగ విచారణ వాడివేడిగా జరిగింది. బుధవారం లక్డీకపూల్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో టిఎస్‌ఈఆర్‌సి చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ అధ్యక్షతన బహిరంగ విచారణ నిర్వహించారు. మొదట టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి జి.రఘుమారెడ్డి 2016-17 సంవత్సరాలకు విద్యుత్ చార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ, అదనపు సర్‌చార్జీ ప్రతిపాదనలను తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చులు 2015-16లో రూ. 16,427 కోట్లు కాగా, 2016-17లో రూ. 16,906 కోట్లకు పెరగనుందని, వీటితో పాటు నిర్వహణ వ్యయం దృష్ట్యా చార్జీలు పెంచే ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. రూ. 1958 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. ఈ నేపథ్యంలో గృహవినియోగదారులకు 0-50 యూనిట్ల వరకు ఎలాంటి పెంపుదల ఉండదని స్పష్టం చేశారు. స్లాబుల వారీగా పెంపుదల చేయాల్సిందిగా తాము ప్రతిపాదిస్తున్నట్టు వివరించారు. సిఎండి ప్రతిపాదనల ప్రసంగం ముగిసిన అనంతరం ప్రజాసంఘాల ప్రతినిధులు మాట్లాడారు.
సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ (సిపిఎస్) అధ్యక్షుడు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ వ్యవసాయదారులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చే క్రమంలో కొనుగోళ్లు చేయాల్సి వస్తుందని చెబుతూ ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. కొనుగోళ్లలో అవకతవకలను, అవినీతిని అరికట్టి ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. సమైక్య రాష్ట్రంలో పిపిఏల ద్వారా రాష్ట్రానికి తక్కువ ధరకు విద్యుత్ వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వేణుగోపాల్ రావు ఏపి విద్యుత్ కొనుగోళ్లపై మాట్లాడుతుండగా చైర్మన్ అడ్డుపడ్డారు. దీంతో ఆగ్రహించిన కొంతమంది ఇది సరికాదని వాదించారు. వాదనలు తెలిపేందుకు వచ్చిన వారిని మాట్లాడనివ్వరా అంటూ మండిపడ్డారు. ఈ సమయంలో ఆప్ నేత ప్రొఫెసర్ విశే్వశ్వరరావు కల్పించుకొని నిర్బంధాల మధ్య బహిరంగ విచారణ ఎలా నిర్వహిస్తారని చైర్మన్‌ను నిలదీశారు. ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన విచారణను నాలుగు గోడలకు పరిమితం చేసి లోనికి వచ్చే వారిని భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోలీస్ బలగాలను మోహరించారని విమర్శించారు. ప్రజల పక్షాన మాట్లాడేందుకు వచ్చిన వారిని గేలిచేసేలా ఈఆర్‌సి మాట్లాడటం తగునా అని నిలదీశారు.
మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎంతో చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది సక్రమంగా అమలు కావడం లేదన్నారు. వ్యవస్థలోని లోపాలను సవరించుకుంటే ప్రజలపై అదనపు భారం వేయాల్సిన అవసరం ఉండదని స్వామి జగన్మయానంద అన్నారు. విద్యుత్‌శాఖలో లైన్‌మైన్ నుంచి ఎస్‌ఇ స్థాయి అధికారి వరకు లంచాలు తీసుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఏ శాఖలో లేని అవినీతి విద్యుత్ శాఖలో కొనసాగుతుందని, రైతులను చంపి వారి శవాల మీద డబ్బులు తీసుకునే విధంగా విద్యుత్ శాఖ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈఆర్‌సి సమావేశాలకు ఆంక్షలు విధించడం సరికాదని పీపుల్స్ మానిటరింగ్ గ్రూప్ ప్రతినిధి నర్సింహారెడ్డి అన్నారు. ఎక్కువ మంది సమావేశాలకు హాజరయ్యే విధంగా కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశాలకు ఉద్యోగులు రాకుండా నిషేధించడం సరికాదని, ఉద్యోగులు ప్రజల్లో భాగం కాదా అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ అధికారి రఘుపై నిషేధం కొనసాగడం విడ్డూరంగా ఉందని తెలంగాణ జెఎసి నేత వెంకట్‌రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో పనికి వచ్చిన అధికారి రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం చేదు ఎలా అయ్యారని నిలదీశారు. నిర్బంధాలను వీడి ప్రజాస్వామ్యబద్దంగా సమావేశాలు కొనసాగిస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. విద్యుత్‌శాఖలో అవినీతి చివరకు ఆశాఖ మనుగడనే ప్రమాదంలోకి నెట్టేలా వెళ్తోందని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు శ్రీ్ధర్ రెడ్డి అన్నారు.

నింథితుడు విసిగా ఉండొద్దా?
నిరోధించే అంశం చట్టంలో ఉందా?
హెచ్‌సియు కేసులో పిటిషనర్‌ను
అడిగిన హైకోర్టు
తదుపరి విచారణ 11కు వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ విసిని ఆ పదవిని చేపట్టకుండా నిరోధించే విషయం చట్టంలో ఉందా అని హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. విసిని తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి వి హనుమంతరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ పి నవీన్ రావుతో కూడిన ధర్మాసనం విచారించింది. వర్శిటీ విసి అప్పారావును బదిలీ చేయాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని ఒక క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న విసిని ఆ బాధ్యతలు నిర్వహించకుండా నిరోధించేలా చట్టంలో ఎక్కడైనా ఉందా? ఏ ప్రాతిపదికన బాధ్యతలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవచ్చో తెలియచేయాలని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

అట్టుడికిన హెచ్‌సియు

ఉద్రిక్తతల నడుమ సాగిన చలో హెచ్‌సియు మెయిన్ గేటు బయటే విద్యార్థుల అరెస్టు

హైదరాబాద్, ఏప్రిల్ 6: రాజకీయ పార్టీలు దళిత ప్రజాసంఘాలు బుధవారం తలపెట్టిన చలో హెచ్‌సియు- నిరసనలు అరెస్టులతో సాగింది. నిరసనకారులు వర్సిటీలోకి వెళ్లడానికి యత్నించగా పోలీసులు అరెస్టు చేసారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐడిఎస్‌ఓ, పిడిఎస్‌యు, ఎఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు వైస్‌చాన్సలర్ అప్పారావుని తొలగించాలని, రోహిత్ చట్టం తేవాలని చలో హెచ్‌సియుకి పిలుపునిచ్చాయి. ఉదయం పది గంటలకు నిరసనకారులు వర్సిటీకి చేరుకోగా అప్పటికే పోలీసులు వర్సిటీ లోపల మోహరించారు. వర్సిటీలోకి ఎవరినీ అనుమతించవద్దని అధికారులు ఆదేశాలు జారీచేసి తనిఖీ బాధ్యత సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. వర్సిటీ ప్రధాన గేటువద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసి ఉద్యోగులను, విద్యార్థులను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేసి లోపలికి పంపించారు. ప్రజాసంఘాల సహాయంతో విద్యార్థులు విసి అతిథి గృహంలో నిర్వహిస్తున్న అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు.
భారీగా పోలీసు, సెక్యూరిటీ బలగాలు వుండడంతో నిరసనకారులు అతిథి గృహానికి వెళ్లడం సాధ్యం కాలేదు. చాలాసేపు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించి గేటు వద్ద నిరసన వ్యక్తం చేసారు. చివరికి గేటు ఎక్కి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొందరు ఓయు జెఎసి నేతలతోపాటు హెచ్‌సియు జెఎసి నేతలు పోలీసులకు చర్చించి గేటుపక్కన సమావేశం నిర్వహించుకుని వెళతామని అనుమతి కోరగా, శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్పడంతో విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశంలో వర్సిటీ ప్రొఫెసర్లు, అధ్యాపకులు ఇతర నేతలు మాట్లాడుతూ, రోహిత్ కేసులో ప్రధాన ముద్దాయి విసిగా అప్పారావుని కొనసాగించడం హేయమైన చర్య అని అన్నారు. కుల వివక్ష లేని సమాజం కోసం విద్యాలయాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేసారు. అంతకుముందు అకడమిక్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా కమిటీ సభ్యుడు ప్రొ.కృష్ణ, వర్సిటీలో జరిగే పరిణామాలు తనని కలిచివేసాయని, తాను కౌన్సిల్ సభ్యునిగా కొనసాగలేనని సమావేశాన్ని బహిష్కరించి, బయటకు వచ్చి ప్రజాసంఘాల నిరసనలో పాల్గొన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు. వర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులు తమ సంఘీభావం ప్రకటించారు.

హెచ్‌సియులోకి చొచ్చుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్న ఉద్యమకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు