తెలంగాణ

పాలమూరును ముంచుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 14: పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి కెసిఆర్ నట్టేట ముంచుతున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం బిజెపి జిల్లా కార్యాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం చేస్తున్న నష్టాన్ని ముందుగా ఆయన తమ పార్టీ నేతలతో పాటు జిల్లా పత్రికా విలేఖరులకు, మీడియా ప్రతినిధులకు ప్రాజెక్టుల ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుండి నార్లపూర్ రిజర్వాయర్ నుండి డిండికి కృష్ణాజలాల తరలింపు అదేవిధంగా ఎస్‌ఎల్‌బిసి నుండి నక్కలగండి, నక్కలగండి నుండి తిరిగి డిండికి నీటి తరలించే విషయాన్ని కూడా నాగం తన ప్రజంటేషన్‌లో వివరించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాగం మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు పాపం చేస్తున్నారని, రైతుల ఉసురు ఆయనకు తప్పక తగులుతుందని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుండి చుక్కనీరు కూడా డిండికి తరలించవద్దని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దుర్మర్గంగా ఆలోచిస్తున్నారని ఇదివరకే మంత్రులు, ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి నీటిని తరలించొద్దని ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చారని ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ నాయకులు ఉమ్మడి పాలమూరు జిల్లాను నాశనం చేయడానికి దిగారని, రైతులు వారికి సెగ చూపిస్తారని హెచ్చరించారు. డిండికి ఎస్‌ఎల్‌బిసి నుండి తరలించడానికి ఇప్పటికే 60 శాతం టన్నల్ పనులు పూర్తయ్యాయని, ఎస్‌ఎల్‌బిసి నుండి నక్కలగండి రిజర్వాయర్‌కు శ్రీశైలం జలాశయం నుండి నీటిని తరలించడానికి పనులు సాగుతున్నాయన్నారు. నక్కలగండి నుండి డిండికి నీటిని తరలించనున్నారన్నారు. ఓపక్క పాలమూరు ప్రాజెక్టు నుండి మరోపక్క ఎస్‌ఎల్‌బిసి నుండి డిండికి నీటిని తరలించడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బిసి నుండే డిండికి నీటిని తరలిస్తే దేవరకొండ, మునుగోడుకు సులభతరంగా నీరు వెళ్తాయని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు జూపల్లి కృష్ణారావు పుణ్యాన ప్రమాదం పొంచి ఉందని, ఆయన స్వార్థబుద్ధితో ఇదివరకే కల్వకుర్తి ప్రాజెక్టు మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని అప్పట్లోనే జూపల్లి కృష్ణారావు 9 మీటర్ల నుండి 6 మీటర్ల వరకు తగ్గించి ద్రోహం చేశారని నాగం మండిపడ్డారు. ఆ పాపం జూపల్లి కృష్ణారావుకు తగులుతుందని దుయ్యబట్టారు. కల్వకుర్తి లిప్టులో రెండు మోటర్లు ఆన్‌చేస్తేనే మెయిన్ కెనాల్ నిండి నీరు బయటికి పోతుందని, ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన జూపల్లి కృష్ణారావుకు రైతులే తగిన శిక్ష విధిస్తారని హెచ్చరించారు. ఎస్‌ఎల్‌బిసి నుండే నక్కలబండ రిజర్వాయర్ మీదగా డిండికి నీటిని తరలిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని, ఎస్‌ఎల్‌బిసి నిర్మాణమే డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకే డిజైన్లు రూపొందించి పనులు ప్రారంభించారని నాగం వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు టెండర్లను ఎందుకు పిలవడం లేదని, ఇందులో దాగి ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి పాలమూరు జిల్లాపై వివక్ష చూపుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.5700 కోట్లు ఖర్చు చేసి డిసెంబర్ నాటికి నీటిని విడుదల చేయాలని లేకుంటే అధికారుల భరతం పడుతామని హెచ్చరిస్తున్నారన్నారు. అదే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల నిర్మాణానికి ఈ ఏడాది కేవలం రూ.370 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. 30 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తానని కెసిఆర్ చెబితే తాను అప్పట్లోనే 30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తే తాను గుండు గీయించుకుంటానని సవాల్ చేశానని తెలిపారు. జిల్లా మంత్రులు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ముందుకు వెళ్లి ముక్కు నేలకు రాయాలని, పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నాగం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 18వ తేదిన వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, జిల్లాల బిజెపి ముఖ్యనేతల సమావేశం నిర్వహించబోతున్నామని ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాపాడుకునేందుకు కార్యచరణ ప్రకటిస్తానని నాగం వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో 2500 కోట్ల అవినీతి జరిగిందని, ఈ విషయాన్ని పక్కా ఆధారాలతో 18న జరిగే సమావేశంలో నాయకుల ఎదుట వెల్లడిస్తానని, అనంతరం టిఆర్‌ఎస్ మెడకు ఉచ్చు బిగిస్తానని స్పష్టం చేశారు.
విలేఖరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర ఉపాద్యక్షుడు నాగురావు నామాజీ, రాష్ట్ర నాయకుడు కాశన్న, పట్టణ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, నాయకులు అర్థం రవి, అంజయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.