తెలంగాణ

172 కోట్లతో మేడారం జాతర పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 16: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా జరుగుతున్న మేడారం జాతర ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క - సారలమ్మ జాతర ఏర్పాట్ల పనులను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈసారి జరిగే మేడారం జాతర పనులకు రూ.172 కోట్లు కేటాయించి పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మేడారం జాతర ఉత్సవాలకు దేశ నలుమూలల నుండి భక్తులు హాజరుకానున్నందున అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాల స్ఫూర్తితో మేడారం జాతరను కూడా విజయవంతం చేసి తీరుతామని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా రానున్న భక్తుల సౌకర్యం కోసం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడ కూడా ట్రాఫిక్ జాం తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో మేడారం జాతరకు తాత్కాళిక పనులు మాత్రమే జరిగేవని, ఈ సారి శాశ్వత పనులు మేడారం జాతరలో చేపట్టినట్లు తెలిపారు. జాతరకు వెళ్లే రోడ్లను విస్తరణ చేస్తున్నామని తెలిపారు. జంపన్నవాగులో స్నాన ఘట్టాల నిర్మాణానికి రూ.19.50 కోట్లు కేటాయించి పనులు చేపట్టామని, అదే విధంగా నార్లాపూర్ నుండి కాల్వపల్లి రోడ్డుకు రూ.4.55 కోట్లతో భూసాపూర్ నుండి లక్నవరం రోడ్డుకు రూ.4 కోట్లతో, బయ్యపేట నుండి దూదేకులపల్లి రూ.6.10కోట్ల రూపాయలతో రోడ్డు మరమ్మతుల పనులు చేపడుతున్నామని తెలిపారు. మేడారం షాపింగ్ కాంప్లెక్స్‌కు రూ.30లక్షలు కేటాయించామని, జాతర డార్మెటర్ కోసం మరో రూ.50లక్షలు కేటాయించామని, ఈ మేరకు శంకుస్థాపనలు కూడా చేసినట్లు తెలిపారు. మేడారం జాతర పనులన్నింటిని జనవరి 31 లోపు పూర్తిచేస్తామని తెలిపారు. పనులలో నాణ్యత కొరవడినట్లయితే అధికారులపై చర్యలు తప్పవన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరాచందూలాల్ మాట్లాడుతూ మొన్నటి వరకు వరంగల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున జాతర పనులపై దృష్టిపెట్టలేదని, ఇప్పుడు కోడ్ ముగియగానే జాతర పనులు ముమ్మరంగా జరిపిస్తున్నామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల ఏర్పాట్లు చేస్తున్నామని, గతంలో జాతర సందర్భంగా లక్నవరానికి రోడ్డు ఇరుకుగా ఉన్న కారణంగా సందర్శకులను అనుమతించేవారు కారని, ఈసారి మేడారం జాతరతో పాటు లక్నవరానికి కూడా అనుమతిస్తున్నామని, అందులో భాగంగా లక్నవరానికి వెళ్లే రోడ్డును విస్తరణ పరుస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిపెట్టారని, జాతర విజయవంతానికి అధికారులందరు సమిష్టి కృషి చేయాలని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పి చైర్‌పర్సన్ గద్దల పద్మ తదితరులు పాల్గొన్నారు.

మేడారంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్