తెలంగాణ

కల్తీ శనగపిండి ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: గ్రేటర్ హైదరాబాద్ శివారులో కల్తీ ఉత్పత్తులు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. కల్తీ నూనె, నెయ్యి, గరం మసాలాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారం రోజులు గడవక ముందే తాజాగా మరో కల్తీ వ్యాపారం బయటపడింది. నగరశివారులోని పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోగల శ్రీరామ కాలనీ పారిశ్రామిక వాడలో కల్తీ శనగ పిండి తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటి) పోలీసులు మిల్లుపై దాడులు నిర్వహించారు. అక్రమంగా కల్తీ శనగపిండి తయారు చేస్తున్న రాందేవ్ బ్రాండ్ లేబుళ్లతో సుమారు రూ. 6లక్షలు విలువ చేసే 110 పిండి బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా నిల్వవుంచిన 276 శనగ పప్పు, 62 బస్తాల బఠాణి బస్తాలు, 96 బస్తాలు మొక్కజొన్న, 64 బస్తాల పెసర పప్పు, 9వేల ఖాళీ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఓటి పోలీసులు మిల్లును సీజ్ చేశారు. కాగా ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న సూరజ్ ముల్, దుర్గయ్య, చౌహాన్ రాహుల్‌ను అరెస్టు చేసి పహాడిషరీఫ్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

ఉద్యానవన వర్శిటీ ఉద్యోగుల
కేటాయింపులపై కోర్టులో విచారణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం 33 మంది ఉద్యోగులను రిలీవ్ చేసి డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైదరాబాద్ కామన్ హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. గత నెల 26వ తేదీన 33 మంది ఉద్యోగులను ఆంధ్రరాష్ట్రంలోని ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ వర్శిటీ నిర్ణయం తీసుకుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రప్రభుత్వాలు ఆస్తులు, అప్పులు, సిబ్బందిపై ఒప్పందానికి ఒక ఏడాదిలోపు రావాలని, లేని పక్షంలో కేంద్రం ఈ విభజన చేపట్టాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఇంతవరకు వర్శిటీ ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన జరగలేదన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హార్టికల్చర్ వర్శిటీకి తమను ఆంధ్రాకు కేటాయించే అధికారంలేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. అనంతరం తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. అనంతరం కోర్టు విచారణను 17వ తేదీకి వాయిదావేసింది.
ద్విభాషా నిఘంటువును
ఆవిష్కరించనున్న డిప్యూటీ సిఎం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: హైదరాబాద్‌లో జరగబోయే 19వ అఖిల భారత ఉర్దూ పుస్తక ప్రదర్శనలో ఇంగ్లీష్-ఇంగ్లీష్-ఉర్దూతో కూడిన ద్విభాషా నిఘంటువును తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ ఆవిష్కరించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ (ఓయుపి) ఈ నిఘంటువును రూపొందించింది. ఇంగ్లీషు నేర్చుకునే వారికి, ఉపాధ్యాయులు, అనువాదకులు, సాధారణ పాఠకుల కోసం ఈ నిఘంటువును రూపొందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
నారాయణపేట ఎమ్మెల్యే
ఇంటిపై ఐటి దాడులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇళ్లలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రాయచూర్, హైదరాబాద్‌లలోని ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిపి దాదాపు 18కోట్లకు పైగా ఆస్తులపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉందని లెక్క తేల్చినట్టు సమాచారం. కర్నాటకలోని రాయచూర్‌లోని ఆయన వైద్య కళాశాలతోపాటు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనూ రాత్రి పొద్దుపోయేవరకూ సోదాలు జరిగినట్టు తెలిసింది. గుల్బర్గా, బెంగుళూరు నుంచి 30మంది ఐటి శాఖ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు.
ఇద్దరు ఐపిఎస్‌ల బదిలీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణలో ఇద్దరు ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన ఎఎస్సై మోహన్‌రెడ్డి వడ్డీవ్యాపారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసిపి సాయిమనోహర్‌ను హైదరాబాద్ పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. అదేవిధంగా సైబరాబాద్ సిసిఎస్, ఎసిపిగా పనిచేస్తున్న రాములు కూడా హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ అయ్యారు.

సిమి కార్యకర్తల
ప్రాసిక్యూషన్‌కు అనుమతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలో చేరేందుకు యత్నించి పట్టుబడి జైల్లో వున్న ఇద్దరు సిమి కార్యకర్తలను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహారాష్టక్రు చెందిన షాముదస్సిర్, షోయబ్ అహ్మద్ ఖాన్‌లను గత సంవత్సరం అక్టోబర్‌లో స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం (సిట్) పోలీసులు సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. ముథాసిమ్ బిల్లా అనే సానుభూతిపరుడు వీరిని ఉగ్రవాద భావజాలంతో ప్రేరేపించి అఫ్ఘానిస్తాన్‌ను పంపేందుకు పథకం వేశాడు.
కాగా వీరిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సిట్ పోలీసులు విచారించగా వీరు సిమి కార్యకర్తలని తేలింది. అయితే వీరితో పాటు మరో ముగ్గురు తప్పించుకుతిరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిలో అబ్దుల్ మాలిక్ మహరాష్టల్రో జరిగిన పోలీసు కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు. అబ్దుల్ మాలిక్, ముదస్సిర్, షోయబ్‌లతో తరచూ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులతో సంబంధాలు నెరపేవారని తెలిసింది. ముథసిమ్ బిల్లాతోపాటు పాకిస్తాన్‌కు చెందిన కమ్రాన్ షా, జాహిద్-ఆల్ హింద్ పరారీలో ఉన్నారు.
కాగా ముథసిమ్ బిల్లా మలక్‌పేటకు చెందిన ఎంటెక్ విద్యార్థిగా సిట్ పోలీసులు గుర్తించారు. మిగతా ముగ్గురిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నట్టు ఓ పోలీసు సీనియర్ అధికారి తెలిపారు. ఇద్దరిని ప్రాసిక్యూట్ చేస్తే తప్పించుకు తిరుగుతున్న వారితోపాటు మరికొంత సమాచారం దొరికే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ప్రాసిక్యూట్‌కు అనుమతించిందని పోలీసులు తెలిపారు. దీంతో ఇద్దరు సిమి కార్యకర్తలను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వీరిద్దరిని ప్రాసిక్యూట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది.

డిఏ సాధనకు త్వరలో
కార్యాచరణ ప్రణాళిక
యుటిఎఫ్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ విషయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి గాలి మాటలు చెబుతున్నారని ఏపి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 6న ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన జెఏసి నేతలతో జనవరి డిఏపై రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని అన్నారు. ఉత్తర్వులు ఇవ్వకుండా మంత్రి గాలిమాటలు చెబుతున్నారని విమర్శించారు. ఇకమీదట మంత్రిని కలిసినా ఉపయోగం లేదని భావించిన తాము త్వరలో జరిగే జెఏసి కార్యవర్గ సమావేశంలో పోరాట కార్యక్రమాన్ని ప్రకటిస్తామని అన్నారు.

ఉర్దూఘర్, షాదీఖానాకు
రూ. ఒక కోటి మంజూరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 16: వరంగల్ జిల్లా నెక్కొండలో మోడల్ ఉర్దూఘర్, షాదీఖానా నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై బుధవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతకం చేశారు. నెక్కొండ ప్రాంతంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారని, ముస్లింల విద్య, సాంస్కృతిక, సామాజికాభివృద్ధికి దోహదపడేవిధంగా మోడల్ ఉర్దూఘర్‌తోపాటు షాదీఖానా నిర్మించాలంటూ నెక్కొండ ఎంపిపి గటిక అజయ్‌కుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్వాతి పైలట్ శిక్షణకు 25లక్షలు
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంటా స్వాతి పైలట్ శిక్షణ కోసం అవసరమయ్యే రూ. 25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు.