తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన వైస్ అడ్మిరల్ బిస్త్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: భారత నావికా దళం వైస్ అడ్మిరల్ హరీష్ బిస్త్ బుధవారం ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. భారత సైనిక, నావికాదళ, వైమానిక దళాలకు చెందిన ఉన్నతాధికారులు తరచూ హైదరాబాద్ వస్తుంటారు. ఇక్కడి కంటోనె్మంట్‌లో జరిగే వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే విధంగా హైదరాబాద్‌కు అధికారిక పర్యటనలో భాగంగా వచ్చిన హరీష్ బిస్త్ రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించారు. భారత దేశం తూర్పుతీరంలో మరీప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ను అనుకుని ఉన్న బంగాళాఖాతం తీరంలో నావికాదళం చేపట్టిన రక్షక చర్యలపై బిస్త్ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు.

అసెంబ్లీ ఎదుట
యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఓ యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సదరు యువకుడు మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉందని సైఫాబాద్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు వివరించారు.

సచివాలయం తరలింపు తగదు

హైదరాబాద్/ ఖైరతాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ సచివాలయ తరలింపును నగరంలోని మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు ఆధ్వర్యంలో సచివాలయ తరలింపుపై నగరంలోని 20 ముఖ్య ప్రాంతాల్లో ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించారు. సదరు బ్యాలెట్ పత్రాలను బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో లెక్కించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 18,460 ఓట్లు పోల్ కాగా అందులో 17,892 మంది తరలింపు వద్దంటూ ఓటు వేయగా, 39 మంది ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సందేశాలతో కూడిన ఓట్లు వేశారు. సచివాలయం తరలింపును సమర్దిస్తూ 387 (2.09శాతం) మంది ఓట్లు వేశారు. కాగా చెల్లకుండా పోయిన ఓట్లు 142. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికైనా ప్రజాధనాన్ని వృథా చేసే ఆలోచనలను మార్చుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. తెలంగాణను ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పిన కెసిఆర్ అనంతరం మాట మార్చారని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారం దక్కించుకున్న కెసిఆర్.. ఉద్యమ ఆకాంక్షలకు, ఎన్నికల హామీలకు వ్యతిరేకంగా పాలిస్తున్నారని వాపోయారు. ఉస్మానియా ఆసుపత్రి తరలింపు, చెస్ట్ ఆసుపత్రి స్థలంలో సచివాలయ నిర్మాణం అంటూ ప్రకటించి, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారని అన్నారు. అనంతరం వాస్తు బాగోలేదని వైఎస్ హయాంలో నిర్మించిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని కాదని, కోట్లు ఖర్చు చేసి ప్రగతిభవన్‌ను నిర్మించారని అన్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్తగా సచివాలయాన్ని నిర్మిస్తాననడం సరికాదని అన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజలపై పెనుభారం పడుతుందని విచారం వ్యక్తం చేశారు. సచివాలయ తరలింపు అంశంపై అవసరమైతే అన్ని జిల్లా కేంద్రాల్లో సైతం పోలింగ్ నిర్వహించి ప్రభుత్వం ముందు ఉంచుతామని చెప్పారు.

క్రీమీలేయర్ వివాదం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఉద్యోగ నియామకాల్లో బిసి నాన్ క్రీమీలేయర్ సర్ట్ఫికేట్ల సమర్పణ విషయంలో వివాదం రాజుకోవడంతో పబ్లిక్ సర్వీసు కమిషన్ వాటి దాఖలకు అక్టోబర్ 5వ తేదీ వరకూ గడువు విధించింది. ఇటీవల ఫలితాలు వెల్లడించిన పిజిటి - ఉర్దూ పోస్టులకు, పిజిటి తెలుగు పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు తమ నాన్ క్రీమీలేయర్ సర్ట్ఫికేట్లను సమర్పించే గడువు ముగియడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కార్యదర్శి ఎ వాణి ప్రసాద్ చెప్పారు. క్రీమీలేయర్ సర్ట్ఫికేట్ల జారీకి కొత్త ఫార్మెట్‌ను పబ్లిక్ సర్వీసు కమిషన్ రూపొందించిందనే వార్త నిజం కాదని, ప్రభుత్వం 2015 డిసెంబర్ 18వ తేదీన జారీ చేసిన మెమో ఆధారంగానే కమిషన్ అదే నమూనాలో సర్ట్ఫికేట్లను కోరుతోందని వాణి ప్రసాద్ వివరించారు.

రాష్ట్ర పండుగగా
గాంధీ, వాల్మీకి జయంతి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: మహర్షి వాల్మీకి జయంతి, మహాత్మాగాంధీ జయంతిలను రాష్ట్ర పండుగలుగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్ పేరుతో బుధవారం జీఓలు జారీ అయ్యాయి. ఇద్దరి జయంతిలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి సూచించారు.

మెట్రో ఘనత కాంగ్రెస్‌దే

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు జాప్యానికి టిఆర్‌ఎస్ పార్టీయే కారణమని, ఈ జాప్యం కారణంగా పడిన రూ. 3500 కోట్ల అదనపు ఆర్థిక భారాన్ని ఎవరు భరించాలని తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టు ఆలస్యమయ్యేందుకు తామే కారణమన్న విషయాన్ని మరిచిన సిఎం కెసిఆర్ తమ వల్లే ప్రాజెక్టు వచ్చిందన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. బుధవారం కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి దానం నాగేందర్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు విహెచ్, అంజన్‌కుమార్ యాదవ్‌లు నగరంలో ‘పని మాది- పేరు మీది’ కార్యక్రమంలో భాగంగా మెట్రోరైలు పనులను పరిశీలించారు. ఇందులో భాగంగా వారు సుల్తాన్‌బజార్, మలక్‌పేట, లక్డీకాపూల్ ప్రాంతాల్లోని మెట్రోరైలు పనులను పరిశీలించారు. పలు చోట్ల వారిని పోలీసులు అడ్డుకోవటంతో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణ మీ జాగీరా..అంటూ నేతలు పోలీసులపై మండి పడ్డారు. పరిస్థితి ఏ మాత్రం అదుపుతప్పే పరిస్థితి ఉన్నా, నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు కూడా చేశారు. అనంతరం లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ వద్ద నేతలు పలువురు వ్యాపారులను కలిసి చర్చించారు. మెట్రో పనుల కారణంగా తమ వ్యాపారాలు సక్రమంగా సాగటం లేదని వారు నేతలకు మొరబెట్టుకున్నారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో అసెంబ్లీలో సుల్తాన్‌బజార్ అలైన్‌మెంట్ మార్చాలని టిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమించిందని, అదే మెట్రో జాప్యానికి కారణమైందని వివరించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుల్తాన్‌బజార్ అలైన్‌మెంట్‌ను మార్చకుండా పాత అలైన్‌మెంట్ ప్రకారమే మెట్రోరైలు లైన్‌ను ఎందుకు నిర్మిస్తున్నారని నిలదీశారు. ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా కెసిఆర్ మెట్రో అలైన్‌మెంట్ మార్చాలన్న పట్టుదలే ప్రాజెక్టు జాప్యానికి ప్రధాన కారణమైందన్నారు. ఇందుకు గాను రూ. 3500 కోట్ల మేరకు అదనపు ఆర్థిక భారం పడిందని, మెట్రోరైలు నిర్మాణంలో టిఆర్‌ఎస్ పాత్ర శూన్యమన్నారు. మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్ రెడ్డి, కొందరు పోలీసులు సిఎం కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి సంగతి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చెబుతామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యనించారు. నిర్మాణ పనులు పరిశీలించేందుకు వస్తే పోలీసులకు అభ్యంతరమేంటీ? అని ఆయన ప్రశ్నించారు.
శాసన మండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించటం వస్తుందా? అన్ని ప్రశ్నించారు. ఔటర్ రింగురోడ్డు, మెట్రోరైలు, పివి ఎక్స్‌ప్రెస్ కారిడార్‌లతో పాటు నగరానికి గోదావరి, కృష్ణా నదీ జలాల తరలింపు వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమయ్యాయని వివరించారు.

పండుగ రద్దీతో ప్రత్యేక రైళ్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అధిక రద్దీని నివారించేందుకు గాను కొన్ని గమ్యస్ధానాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 2న నర్సాపూర్ నుంచి నెం.07255 రైలు సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో నెం.07256 అక్టోబర్ 3న సికింద్రాబాద్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 5.30కి నర్సాపూర్ చేరుకుంటుందని తెలిపింది.
సంబల్‌పూర్, బనాస్‌వాడి మధ్య 26 ప్రత్యేక రైళ్లు
సంబల్‌పూర్-బనాస్‌వాడి మధ్య నెం.08301 రైలు అక్టోబర్ 4 డిసెంబర్ 27 వరకు ప్రతి బుధవారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే తిరుగు ప్రయాణంలో బనాస్‌వాడి నుంచి సంబల్‌పూర్ మధ్య నెం.08302 రైలు అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు నడుస్తుందని ద.మ.రైల్వే తెలిపింది.

అనారోగ్యం పేరుతో కుంభకోణం

ఖతప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పన్ను వెనక్కి
తీసుకున్న 200 మంది ఐటీ ఉద్యోగులు
ఖఐటీ శాఖకు రూ. 1.36 కోట్ల నష్టం
ఖసిసిఎస్‌లో ఫిర్యాదు
ఖదర్యాప్తు జరుపుతున్న పోలీసులు
ఖఇద్దరు ఐటీ ప్రాక్టీషనర్లపై చార్జ్‌షీట్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను రిఫండ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యం పేరుతో 200 మంది భారీ స్కాంకు పాల్పడ్డారు. కొందరు సాంకేతిక నిపుణులు తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించి తాము కట్టిన ఆదాయపు పన్నును వెనక్కి తీసుకున్నారు. ఒకరిద్దరు కాదు..దాదాపు 200 మంది ఐటీ ఉద్యోగులు ఈ మోసానికి పాల్పడినట్టు సమాచారం. హైదరాబాద్‌లో తాజా వెలుగుచూసిన ఈ భారీ స్కాం వివరాల్లోకి వెళితే... ఆదాయపు పన్ను రిఫండ్‌లో అవకతవకలు చోటుచేసుకోవడంతో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోహన్ బాబు హైదరాబాద్ సెంట్రల్ కైం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఈ భారీ కుంభకోణంలో ఇద్దరు ఐటీ అధికారుల హస్తం కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఐటీ ప్రాక్టిషనర్స్ ఎన్ శ్రీకాంత్‌గౌడ్, మహమ్మద్ ఖలీల్‌లపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఐటీ ప్రాక్టిషనర్స్ ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పరిచయం ఏర్పరచుకుని వారికి ఐటీ రిఫండ్ తీసుకునేందుకు తోడ్పడినట్టు విచారణలో తేలిందని సెంట్రల్ క్రైం స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాంకుమార్ తెలిపారు. ఐటీ చట్టాల ప్రకారం..వైద్య ఖర్చులను ఆదాయపు పన్నుశాఖ రిఫండ్ చేస్తుంది. కాగా, ఈ ఇద్దరు అధికారులు ఐటీ ఉద్యోగులను కలిసి వారు పన్ను రిఫండ్ చేసుకునే విధానాన్ని వివరించారు. కుటుంబ సభఉయలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని బిల్లులు సృష్టించి పన్నులు రిఫండ్ చేయించారు. అలా ఒక్కో ఉద్యోగి రూ. 50వేల నుంచి రూ. లక్ష వరకు లబ్ది పొందారు. ఇందు కోసం సదరు ఉద్యోగుల వద్ద నుంచి నిందితులు 10శాతం కమీషన్ తీసుకున్నారు. దీని వల్ల ఐటీ శాఖకు రూ. 1.36 కోట్ల నష్టం వాటిల్లిందని అసిస్టెంట్ కమిషనర్ రాంకుమార్ తెలిపారు. అయితే..ఇలా వీరు మాత్రమే కాదని, నగరంలో చాలా మంది ఇలా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 200 మంది ఐటీ ఉద్యోగులు తమ ఐటీ రిఫండ్ చేసుకోగా, మరో 50 మంది పోలారీస్ కంపెనీలకు చెందిన వారని ఆయన వెల్లడించారు.

3న ‘రైతు సత్యాగ్రహం’

ఖజీవో 39 ఉపసంహరణ డిమాండ్‌తో నిరసన
ఖగ్రామగ్రామాన నిరసన..మండలాల్లో ధర్నాలు
ఖవిజయవంతం చేయాలని తెలంగాణ జెఏసి పిలుపు
ఖమద్దతు పలికిన టిడిపి, సిపిఐ, బిజెపిలు

చార్మినార్/హైదరాబాద్, సెప్టెంబర్ 27: జివో 39ని ఉపసంహరణ చేయాలన్న డిమాండ్‌తో వచ్చే నెల 3వ తేదీన రాష్టవ్య్రాప్తంగా రైతు సత్యాగ్రహాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ జేఏసి చైర్మన్ ప్రొ.కోదండరాం, తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బిజెపి నాయకుడు సుగుణాకర్, సిపిఐ మాజీ ఎమ్మెల్యే పల్లావెంకట్‌రెడ్డి వెల్లడించారు. గ్రామగ్రామన నిరసనలు, మండలాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు, రైతులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జివో 39ప్రకారం రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేశారని, కానీ సమగ్ర భూ సర్వే చేయాల్సిన బాధ్యతలు రెవెన్యూ అధికారులకు కాకుండా టిఆర్‌ఎస్ కార్యకర్తలకు అప్పగించటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. లక్షా 60వేల మంది టిఆర్‌ఎస్ కార్యకర్తలతో సమగ్ర భూ సర్వే నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు.ప్రభుత్వం రికార్డులు ప్రైవేటు వ్యక్తులు పాలు కాకుండా చూడాలని వారు సూచించారు. గ్రామగ్రామ పంచాయతీలు బలపడ్డాలంటే రైతు సమన్వయ సమితులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగ విరుద్దంగా నడుస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని వారు సూచించారు. గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉందని వారు గుర్తుచేశారు. పట్టెడన్నం పెట్టే రైతును ఎంత చులకనగా చూడటం ప్రభుత్వానికి తగదని, దీన్ని వెంటనే సరిదిద్దుకోవాలని లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు వ్యాఖ్యానించారు. జివో 39లో 12 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెబుతున్నా, ఇది ఓ ప్రభుత్వ నామినేటెడ్ అనే పదాన్ని వాడటం చట్టవిరుద్దమని వాపోయారు. గ్రామరైతులను ఏకం చేసి సమావేశాలు ఏర్పాటు చేయకుండా టిఆర్‌ఎస్ కార్యకర్తలతో రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయటం చట్టవిరుద్దమని వారు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకుడు రవిచంద్ర, లోక్‌సత్తా నేత పాండురంగారావు, కిసాన్ మోర్చా నేత రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

‘టెలిమెట్రీ’ ట్యాంపరింగ్!

ఖఏపిపై తెలంగాణ ఆరోపణ
ఖకృష్ణాబోర్డుకు ఫిర్యాదు
ఖనిరసన తెలిపిన హరీశ్‌రావు
ఖవివాదంలో పోతిరెడ్డిపాడు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: శ్రీశైలం నీటి విడుదలపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాడుకు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడదల చేసేందుకు కృష్ణాబోర్డు ఏర్పాటు చేసిన టెలిమెట్రీ వ్యవస్థను ఆంధ్రప్రభుత్వం ట్యాంపరింగ్ చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కృష్టాబోర్డు కార్యదర్శికి తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు. పోతిరెడ్డి పాడు వద్ద కృష్ణాబోర్డు ఏర్పాటు చేసిన టెలిమెట్రీ స్టేషన్ రికార్డు చేస్తున్న ప్రవాహ సమాచారాన్ని మొత్తంగా ట్యాంపర్ చేసినట్లుగా తమ ఇంజనీర్లు సమాచారం ఇచ్చారన్నారు. వాటిని ధ్రువీకరించి తర్వాత నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
ఈ నివేదికపై ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌జె జోషి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌తో జల సౌధలో సమీక్షించారు. టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేస్తున్న ఏజెన్సీ మెకట్రానిక్స్ వారు ఈ మొత్తం సమాచారాన్ని మార్పు చేసి పోతిరెడ్డిపాడు ప్రవాహాలను తక్కువ చేసి చూపించడం పట్ల మంత్రి హరీష్‌రావు విస్మయం వ్యక్తం చేశారు. బోర్డు చైర్మన్ శ్రీ వాస్తవతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ట్యాంపర్ చేసిన రీడింగ్స్‌ను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. ఈ అంశంపై వెంటనే తెలంగాణ ప్రతినిధులు ఎస్‌జె జోషి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ చైర్మన్ వద్దకు వెళ్లి ప్రభుత్వం తరఫున నిరసన లేఖను అందించారు.
శ్రీశైలం వద్ద నీటి నిల్వ 171 టిఎంసి
కాగా శ్రీశైలం డ్యాంలో 215.81 టిఎంసికి 171.69 టిఎంసి నీటి నిల్వలు చేరాయి. ఎగువ నుంచి 1.12 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు 55వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యాంలో నీటి మట్టం 514 అడుగులకుచేరింది.

సద్దుల బతుకమ్మకు
రెండు రికార్డులు?

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ ప్రభుత్వం గురువారం నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రెండు ప్రపంచ రికార్డులు నమోదు కాబోతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఇక్కడి ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దాదాపు మూడువేల మంది మహిళలు తంగేడు పూవు ఆకారంలో నిలబడి చూపరులను ఆకర్షించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా గుర్తించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఇదొక రికార్డుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కాబోతోంది. ఇలా ఉండగా, పెద్ద ఎత్తున మహిళలు ఎల్‌బి స్టేడియంలో బతుకమ్మను పూలతో అత్యంత వేగంగా పేర్చే కార్యక్రమం జరగబోతోంది. ఇది కూడా ఒక ప్రపంచ రికార్డుగా నమోదు కాబోతోంది.

9లోగా పంటల బీమా చెల్లింపు

ఖ2016-17 సంవత్సరానికి
క్లెయిముల పరిష్కారం
ఖకంపెనీలతో ప్రభుత్వ చర్చలు సఫలం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: రైతులకు 2016-17 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా క్లెయిములను 2017 అక్టోబర్ తొమ్మిదిలోగా చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. 2016 ఖరీఫ్, 2016-17 రబీ సీజన్లకు సంబంధించి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా చెల్లింపులపై బుధవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో పార్థసారథి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాల వారీగా బీమా చెల్లింపునకు సంబంధించిన రైతుల సంఖ్య తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. 2016 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.95 లక్షల మంది రైతులకు పంటల బీమాకు ఫసల్‌బీమా కింద 95.25 కోట్లు, వాతావరణ ఆధారిత బీమా కింద 63.33 కోట్ల రూపాయలు చెల్లంచాల్సి ఉంది. బీమా కంపెనీలు రైతులకు చెల్లించాల్సిన పంటలబీమాను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సాంకేతికపరమైన అంశాలు ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఆర్థిక, గణాంక శాఖ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ, ఇన్సూరెన్స్ అధికారులతో ఈ నెల 29 న సమావేశం కావాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.ఇలా ఉండగా పంటల బీమాపై అక్టోబర్ ఐదున జరిగే రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో కూడా అజండాగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని పార్థసారథి తెలిపారు. జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకుని బీమా డబ్బు బ్యాంకుల్లో రైతుల పేరుతో జమ అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.