తెలంగాణ

గొర్రెల పంపిణీలో కుంభకోణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకం వృత్తిదారుల అభివృద్ధిని కాంక్షిస్తూ అమలు చేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం బ్రోకర్ల జేబులు నింపే పథకంగా మారింది. తాజాగా గురువారం రాత్రి ఒకేరోజున ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు ఎనిమిది వాహనాల్లో అక్రమంగా తరలిపోతున్న 483 సబ్సిడీ గొర్రెలు సరిహద్దు చెక్‌పోస్టుల్లో పట్టుబడడం సబ్సిడీ గొర్రెల పథకం వెనుక సాగుతున్న భారీ కుంభకోణానికి అద్దం పట్టింది. సూర్యాపేట జిల్లా మోతే మండలం విభవాపురం గ్రామం, నల్లగొండ జిల్లా పరిధిలోని మాడ్గులపల్లి మండలం చెరుపల్లి గ్రామం, దామరచర్ల మండలం ఇర్కిగూడెం, శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామాల లబ్ధిదారుల నుండి, నాగర్ కర్నూల్ జిల్లా లబ్ధిదారుల నుండి కొనుగోలు చేసిన 23 యూనిట్లకు చెందిన 483 సబ్సిడీ గొర్రెలను బ్రోకర్లు గుంటూరుకు తరలిస్తున్నారు. సబ్సిడీ గొర్రెల అక్రమ విక్రయం, తరలింపు సమాచారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు చేరడంతో ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు సమాచారం అందించారు. కలెక్టర్ పోలీసులను అప్రమత్తం చేయగా వారు ఆంధ్ర సరిహద్దుల్లోని వాడపల్లి, నాగార్జునసాగర్ చెక్‌పోస్టుల వద్ద గుంటూరుకు తరలిస్తున్న సబ్సిడీ గొర్రెలను పట్టుకున్నారు. వెంటనే జిల్లా రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల అధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి గొర్రెలు అమ్మిన లబ్ధిదారులపై శాలిగౌరారం, మోతే, దామరచర్ల, మాడ్గులపల్లి పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ స్వయంగా శుక్రవారం మాడ్గులపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సబ్సిడీ గొర్రెలను పరిశీలించి అక్రమ విక్రయం, కొనుగోలుకు, తరలింపు చేస్తున్న వాహనాల డ్రైవర్లు, యాజమానులపై 420 కేసు నమోదుకు ఆదేశించారు. డ్రైవర్ల లైసెన్స్ రద్దు చేసి, వాహనాలను వేలం వేసి సదరు డబ్బును లబ్ధిదారులకు అందించాలన్నారు. లబ్ధిదారులపై పోలీస్ కేసుతో పాటు రెవెన్యూ యాక్ట్‌పరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల జాబితా నుండి గొర్రెలు విక్రయించిన లబ్ధిదారులను తొలగించాలని ఆదేశించారు.
సబ్సిడీ గొర్రెల పథకంలో భాగంగా లబ్ధిదారుడి 25 శాతం వాట 31,250 రూపాయలు పోను, ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ వాటా 93,750 రూపాయలు వెచ్చించి ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక విత్తన పొట్టేలును లబ్ధిదారులకు అందిస్తుంది. ఇందుకోసం గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి గొర్రెలు కొనుగోలు చేసి వాటి చెవులకు జియో ట్యాగింగ్ చేసి మరీ లబ్ధిదారులకు అందిస్తున్నారు. అయితే లబ్ధిదారులకు అందించాల్సిన గొర్రెలు సరిపడా లభించకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న బ్రోకర్లు జిల్లాకు వచ్చి లబ్ధిదారుల వద్ధ గొర్రెలను కొనుగోలు చేసి మళ్లీ ఆంధ్రకు తరలించి అవే గొర్రెలను మళ్లీ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అధికారులకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో గొర్రెలు చేతులు మారుతుండగా ప్రభుత్వ సబ్సిడీ సొమ్ము కాస్తా దళారుల, లబ్ధిదారుల జేబుల్లోకి, చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారుల పాలవుతోంది. ఈ రకంగా వాడపల్లి, సాగర్ సరిహద్దు చెక్‌పోస్టుల నుండి నిత్యం 40 నుండి 50 వాహనాల్లో సబ్సిడీ గొర్రెలు తరలిపోతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మొత్తంగా సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులే గొర్రెల అక్రమ విక్రయాలు, కొనుగోలుకు సాధనాలుగా మారుతుండగా ఈ పథకం కుంభకోణంగా తయారైంది. సబ్సిడీ గొర్రెల పథకం అక్రమాలపై నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ స్పందిస్తూ బ్రోకర్లు జిల్లాలో పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెలనే కొనుగోలు చేసి తిరిగి వాటిని ఇదే జిల్లా అధికారులకే విక్రయించే అక్రమ దందాకు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు.
చిత్రాలు..నాగార్జునసాగర్ చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన సబ్సిడీ గొర్రెలు
*పట్టుబడిన గొర్రెల వివరాలను సేకరిస్తున్న రెవెన్యూ,
పోలీస్, పశుసంవర్ధక శాఖల అధికారులు