తెలంగాణ

‘గుర్తింపు’ పోరులో గెలిచేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 2: సింగరేణి గుర్తింపు ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తోంది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెర పడనుండగా, గురువారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ దగ్గర పడుతున్నా కొద్దీ గుర్తింపు ఎన్నికల్లో ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులతో ఇరువర్గాలు ప్రచారాన్ని హోరెత్తించి, నల్ల సూరీళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన రెండ్రోజులు కార్మికులను ఆకర్షించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేయనున్నారు. అయినా.. ఫలితాలు ఇరువర్గాల్లో ఉత్కంఠ రేపుతుండగా, నల్ల సూరీళ్లు మాత్రం ఎవరిని గద్దెనెక్కిస్తారోనన్నది అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నిర్వహించిన నేతల ప్రచార హోరుతో కోల్‌బెల్ట్ వేడెక్కింది. యూనియన్ల నేతలే కాకుండా వాటి అనుబంధ రాజకీయ పార్టీల అగ్రనేతలు కోల్ బెల్ట్‌లోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తూ కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎఐటియుసి కూటమి, అధికార టిబిజికెఎస్ యూనియన్ల మధ్యనే ప్రధాన పోరు కేంద్రీకృతమైంది. ఎఐటియుసి కూటమిలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ పొత్తులు పెట్టుకొని బరిలో కొనసాగుతుండగా, ఎలాగైనా అధికార టిఆర్‌ఎస్ అనుబంధ యూనియన్ టిబిజికెఎస్‌ను ఓడించాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలన్నీ జత కట్టాయి. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో ఎన్నికలు జరుగుతుండగా, సింగరేణి పరిధిలో సుమారు 20 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాలు ఉండగా, రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పెద్దఎత్తున ప్రచారానికి నడుంబిగించారు. ఇప్పటికే అధికార టిఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కార్మికులకు హామీలిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ అగ్రనేతలు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతోపాటు ప్రముఖ నేతలంతా ప్రచారం కొనసాగించగా, టిడిపి నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సిపిఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిలతోపాటు ఆయా పార్టీల ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించారు. అయితే, వారసత్వ ఉద్యోగాల విషయంలో అధికార టిబిజికెఎస్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం ప్రత్యర్థి పార్టీలు, యూనియన్ల నాయకులు చేయగా, సిఎం కెసిఆర్ దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా ఇటీవలే సిఎం కెసిఆర్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి సింగరేణి కార్మికులను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపించారు. వారసత్వం కాకుండా కారుణ్యం కింద నియామకాలు చేపడతామంటూ హామీ ఇచ్చారు. సిఎం కెసిఆర్ కార్మికుల ఓట్లు దండుకునేందుకు అన్ని అబద్ధాలే మాట్లాడారని, కార్మికులు వాటిని నమ్మి మోసపోవద్దంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు, యూనియన్ల నేతలు కెసిఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇరువర్గాల సభలకు కార్మికులు హాజరవుతుండడంతో ఎవరికి ఓట్లు వేస్తారనేది అంతుచిక్కని విధంగా మారడం గమనార్హం. ఎన్నికల బరిలో ఉన్న హెచ్‌ఎంఎస్ యూనియన్ నుంచి సోమవారం ఎంపి కవిత సమక్షంలో భారీగా కార్మికులు టిబిజికెఎస్‌లో చేరారు. కాగా, సింగరేణి ఎన్నికలు ఈ నెల 5న జరగనుండగా, నిబంధనల ప్రకారం మంగళవారం సాయంత్రం 5గంటలకల్లా ప్రచార పర్వం ముగియనుంది. మొత్తానికి ఆయా పార్టీల అగ్రనేతలు, యూనియన్ల అగ్రనేతలు వ్యూహ, ప్రతివ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులతో నల్ల సూరీళ్లను ఆకర్షించే ప్రయత్నం చేయగా, గుర్తింపు పోరులో నల్ల సూరీళ్లు ఎవరిని గద్దెనెక్కిస్తారన్నది మాత్రం అంతుచిక్కని విధంగా మారడం కొసమెరుపు.