తెలంగాణ

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి.. రెండు లాజిస్టిక్ పార్క్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ హయత్‌నగర్, అక్టోబర్ 6: హైదరాబాద్‌లో నిత్యం పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రెండు భారీ లాజిస్టిక్ ట్రక్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం పిగ్లిపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 10లోని 40 ఎకరాల భూమిలో రూ.35 కోట్లతో ఏర్పాటు చేయనున్న భారీ లాజిస్టిక్ పార్క్ పనులను శుక్రవారం మంత్రి కెటిఆర్, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపి బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధునిక పద్ధతిలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఔటర్ రింగ్‌రోడ్డులో మిగిలిపోయిన 159కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఔటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రోడ్లు, రీజనల్ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. నగరంలోకి వస్తువులను సునాయాసంగా చేరవేసేందుకు లాజిస్టిక్ ట్రక్ పార్క్‌లు దోహదం చేస్తాయని అన్నారు. నగరంలోకి నిత్యం మాంసాన్ని తరలించే వాహనాలే 600వరకు వస్తున్నాయని గుర్తుచేశారు. బాటసింగారం, మంగళ్‌పల్లిలో ఏర్పాటు చేస్తున్న లాజిస్టిక్ పార్కులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కూడ వస్తాయని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఇంజాపూర్ నుండి హయత్‌నగర్ వరకు రెండు కిలోమీటర్ల వరకు ఉన్న రోడ్డును, బాటసింగారంలోని నాలుగు గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రోడ్లను కూడా పూర్తి స్థాయిలో మెరుగు పరిచేందుకు హెచ్‌ఎండిఎ నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. మైనింగ్ జోన్‌లో భూములు కోల్పోయిన బండరావిరాల గ్రామ రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతీ కుంట్లూర్‌లోని మూసీని సుందరీకరించేందుకు రూ.1600కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. తుర్కయంజాల్‌ను నగర పంచాయతీ చేయాలన్న ఎమ్మెల్యే కోరిక మేరకు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సిఇఓ కిషోర్, ఎంపిపి గుండ్లపల్లి హరిత, నగర పంచాయతి చైర్మన్ ధనలక్ష్మీ బలరాం, గ్రామ సర్పంచ్ నోముల జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగల్‌పల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్ పార్కుకు కూడా శుక్రవారం మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 166లోని 22 ఎకరాల్లో సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..హయత్‌నగర్‌లో లాజిస్టిక్ పనులను ప్రారంభించి
ఆనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి కెటిఆర్