తెలంగాణ

ఓల్టా ఖాజీ నిఖాలు చెల్లవు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: హైదరాబాద్ పాతబస్తీలో కాంట్రాక్టు పెళ్లిళ్లు కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏదో ఓ ప్రాంతంలో కాంట్రాక్టు పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే కాంట్రాక్టు పెళ్ళిల్లు చేసుకున్న కొందరు అరబ్బు షేకులు, బ్రోకర్లు, ఖాజీలు జుడిషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు జరిగిన పెళ్లిళ్లపై ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముంబయికి చెందిన ఓల్టా ఖాజీ చేసిన నిఖాలు చెల్లవని ప్రచారం జరుగుతుండడం..వక్ఫ్‌బోర్డు ధ్రువీకరించని పెళ్లిళ్లన్నీ అక్రమమేనని పోలీసులు, కొందరు మతపెద్దలు చెబుతుండడంతో పాతబస్తీలో ఆందోళన చెలరేగుతోంది. ఈమేరకు పోలీసులు షరియత్, వక్ఫ్‌బోర్డు నిబంధనలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇటీవల అరబ్ షేకులకు నిఖాలు జరిపించిన ఖాజీ అలీ అబ్దుల్లా రిఫాయ్ అలియాస్ ఓల్టా ఖాజీ పెళ్లిళ్లు చెల్లవని, మూడేళ్లుగా అతడు చేయించిన పెళ్ళిళ్లకు అనుమతి లేదని వక్ఫ్‌బోర్డు అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా పెళ్లి సందర్భంగా వధూవరులకు ఇచ్చిన షియా నామాలు తమ రికార్డుల్లో లేవని కూడా తెలిపినట్టు తెలుస్తోంది. షరియత్ ప్రకారం నిఖా అయ్యాక దానికి చట్టబద్దత కల్పించేందుకు ఖాజీలు నిఖా ధ్రువీకరణ పత్రంతో పాటు వధూవరులకు నీలం, ఎరుపు రంగున్న బుక్‌లెట్‌లు ఇస్తారు. కాగా ఓల్టాఖాజీ ధ్రవీకరణ పత్రాలు, బుక్‌లెట్‌లు ఇచ్చినా వక్ఫ్‌బోర్డు అతడిని ఖాజీగా గుర్తించకపోవడంతో చట్టం దృష్టిలో అతడు ఇప్పటి వరకు చేసిన పెళ్లిళ్లు చెల్లనట్టేనని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండా ఓల్టా ఖాజీ గత మూడేళ్లలో ఎన్ని నిఖాలు చేశావని ప్రశ్నించగా..కేవలం 40 మాత్రమే నిర్వహించానంటూ ఓల్టా ఖాజీ చెప్పినట్టు పోలీసులు చెబుతున్నారు. అతడి కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డుల ఆధారంగా 650 నిఖాలు జరిపాడని పోలీసులు కనుగొన్నారు. కాంట్రాక్టు పెళ్లిళ్లపై కొనసాగుతున్న దుమారంపై స్పష్టత రావల్సి ఉందని పోలీసులు తెలిపారు.

వ్యవసాయ , సహకార శాఖలో
851 గ్రేడ్ -2
ఎఇఓ పోస్టుల భర్తీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ తీపి కబురు అందింది. వ్యవసాయ విస్తరణ అధికారి ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన జారీ చేసింది.సహకార శాఖలో 851 గ్రేడ్-2 ఎఇఓ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 13వ తేదీ నుండి 31 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. నవంబర్ 21న రాతపరీక్ష నిర్వహిస్తారు.

వ్యవసాయ వర్శిటీకి రూ.30 కోట్లు విడుదల
జీవో జారీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం 29.92 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం జీఓ జారీ అయింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. వేర్వేరు పథకాల కోసం ఈ నిధులు విడుదల చేశామని జీఓలో వివరించారు.

అరబ్‌షేక్‌లతో బాలికల
పెళ్లిళ్లపై మీ వైఖరి ఏమిటి?

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: అరబ్ దేశాలకు చెందిన షేక్‌లు పేద ముస్లిం బాలికలను వివాహం చేసుకునే అంశంపై తమ వైఖరిని తెలియచేయాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్రప్రభుత్వాలకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రకాశం జిల్లాకుచెందిన షేక్ చాంద్ భాషా అనే వ్యక్తి 2016లో జారీ చేసిన జీవో, దర్శి, సింగరాయకొండ పట్టణాలకు ఖాజీలను నియమించిన తీరును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అరబ్‌షేక్‌లు, పేద ముస్లిం బాలికలను వివాహం చేసుకుంటున్న ఉదంతాలపై వార్తా క్లిప్పింగ్‌లను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. అరబ్‌షేక్‌లతో పేద ముస్లిం యువతులు వివాహం జరుగుతున్న తీరు అమానుషమైందని, ఈ అమానుషాన్ని రూపుమాపాల్సి ఉందని, ఖాజీలు ఈ వివాహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని హైకోర్టు పేర్కొంది. సరైన చట్టాలను అమలు చేయడం ద్వారా ఖాజీల అక్రమాలను అరికట్టాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఖాజీల చట్టం 1880 సెక్షన్ 2ను సవరించాలని హైకోర్టు ధర్మాసనం 2006లో ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పును జస్టిస్ బిలాల్ నజ్కీ 2006లో ఇచ్చారని, వివాహాల నిమిత్తం ప్రభుత్వం నియమించిన ఖాజీలను కాకుండా, తమకు యోగ్యమైన ఖాజీని పెళ్లి నిమిత్తం ఎంపిక చేసుకునే అధికారం ముస్లింలకు ఉందని హైకోర్టు తీర్పులో పేర్కొన్నారని హైకోర్టు తెలిపింది. ఈ కేసుపై కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు తమ అభిప్రాయాలు తెలియచేయాలని హైకోర్టు పేర్కొంది. మహిళా శిశు సంక్షేమ శాఖలు కూడా తమ అభిప్రాయాన్ని తెలియచేయాలని కోర్టు పేర్కొంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని ముస్లింల వివాహాలను రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ కేసును ఈ నెల 30కి హైకోర్టు వాయిదావేసింది.

రసాయన పురుగు మందులు వద్దు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: వ్యవసాయంలో రసాయన పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌లో (ఎన్‌ఐపిహెచ్‌ఎం) పిజి డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ కోర్సు ఏడో బ్యాచ్ తరగతులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయం, ఉద్యాన పంటలకు తెగుళ్లబాధను నివారించేందుకు రైతులు అవసరాన్ని మించి పురుగుమందులు వాడుతున్నారని, విచక్షణారహితంగా రసాయన పురుగు మందుల వాడకం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా రైతుల ఆరోగ్యం కూడా దెబ్బతింటోందన్నారు. పురుగు మందులు వాడిన పంటలను తినడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా చెడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పులు రావలసి ఉందని, రసాయన పురుగు మందుల స్థానంలో బయోపెస్టిసైడ్స్ వాడాలని పిలుపు ఇచ్చారు. బయోపెస్టిసైడ్స్‌పై ఎన్‌ఐపిహెచ్‌ఎం ప్రయోగాలు చేసిందని, తెగుళ్లను నివారించే సేంద్రీయ పురుగు మందులను రూపొందించారని తెలిపారు. సేంద్రీయ పురుగు మందులను ఏ విధంగా వాడాలో రైతులకు తెలియచేస్తున్నారన్నారు. ఎన్‌ఐపిహెచ్‌ఎంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఎన్‌ఐపిహెచ్‌ఎం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నేతృత్వంలో నడుస్తోంది. ఈ సంస్థ రైతులు, వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, విద్యార్థులకు సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఎన్‌ఐపిహెచ్‌ఎం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ జి. జయలక్ష్మి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆరోగ్యశ్రీలో 15 పోస్టులు మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో 15 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పోస్టులు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేశారు. నెలకు రెండు లక్షల రూపాయల వేతనం మించకుండా ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. భర్తీ చేసే ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.