ఆంధ్రప్రదేశ్‌

ఇదేనా ప్రతిఫలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 19: రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల పనితీరుకు కేటాయించిన ర్యాంకులపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థంకావడం లేదని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించడం విశేషం. సీనియర్లను పక్కనబెట్టి జూనియర్లకు అగ్రతాంబూలం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.
తొలిసారిగా మంత్రి పదవులు పొందిన వారిని ప్రభుత్వ కార్యక్రమాల్లో మొదటి వరుసలో నిలిపి ప్రతిపక్ష ఆరోపణలను తిప్పికొడుతున్న తమను వెనక్కు నెట్టారని పలువురు మంత్రులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిని మంత్రివర్గ సహచరులు కొందరు తప్పుబడుతున్నారు.
తొలిసారిగా మంత్రిపదవి పొందిన పీతల సుజాతకు ఫస్ట్ ర్యాంక్, దేవినేని ఉమామహేశ్వరరావు,ప్రత్తిపాటి పుల్లారావులకు తర్వాతి స్థానాలు దక్కడం అధికారపార్టీలో చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తితో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి 15వ స్థానం కేటాయించడం అన్యాయమనే వాదనలు వినవస్తున్నాయి. పాలనాపరంగా పనితీరు, పార్టీ పటిష్ఠత, అంశాలపై ఈ ర్యాంకులు కేటాయించినట్లు చెప్తున్నా అందుకు తగ్గట్టు తమకు అవకాశం ఇవ్వలేదని కొందరు మంత్రులు లోలోపల ఆవేదన చెందుతున్నారు. అలాగే చీటికి మాటికి సమీక్షల పేరుతో తమను నియోజకవర్గాలకు దూరం చేస్తున్నారనే ఆరోపణలు మంత్రివర్గ సభ్యులనుంచి వినవచ్చాయి. తమకు ర్యాంకులు కేటాయించే ముందు ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి ఏ స్థానంలో ఉన్నారనేది గ్రహించాలనే వ్యాఖ్యానాలు కూడా వినవస్తున్నాయి. ముఖ్యమంత్రికి విధేయులుగా ఉన్నవారినే అంధలమెక్కించారని, పార్టీకి, ప్రభుత్వానికి సేవలందిస్తూ అంకితభావంతో పనిచేస్తున్న తమకు గుర్తింపు లేకుండా పోయిందని సీనియర్ మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఉండగా రాష్ట్ర రాజధాని భూ సమీకరణలో కీలకపాత్ర పోషిస్తున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ర్యాంకుల పట్టికలో అట్టడుగు స్థాయిలో ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తన కుమార్తె వివాహం మరో నాలుగు రోజుల్లో ఉన్న సమయంలో కూడా విదేశీ పర్యటనలు, రాజధాని వ్యవహారాల్లో నిమగ్నమై ముఖ్యమంత్రి ఆదేశాలను శిరసావహించినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదని ఓ మంత్రి తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలిసింది.
జల వనరుల ప్రాజెక్టుల నిర్మాణాలు సక్రమంగా జరగడం లేదని ఇటీవల పలుమార్లు జరిగిన సమీక్షల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆ శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నెంబర్ 2 స్థానాన్ని కేటాయించడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వినవస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమీక్ష జరిపినప్పుడల్లా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై మండిపడే ముఖ్యమంత్రి జాబితాలో ఆయనకు ప్రాధాన్యత ఎందుకిచ్చారనేది ఎవరికీ అంతుపట్టకుండా ఉందని అంటున్నారు. ఇలా ఉండగా బిజెపి తరపున మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కామినేని శ్రీనివాస్‌కు 14వ స్థానం, పైడికొండల మాణిక్యాలరావుకు 16వ స్థానం కేటాయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
రాష్ట్ర పరిస్థితిని బట్టి కేంద్రం ఇవ్వాల్సిన ర్యాంకులను ముఖ్యమంత్రి తమకు ఆపాదిస్తున్నారని బిజెపి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి వ్యాఖ్యానించారు. తాము ఈ ర్యాంకులను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఎన్నికలకు మరో మూడేళ్ల వ్యవధి ఉన్న నేపథ్యంలో ఈ సర్వేలు అప్రస్తుతమని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. మొత్తంగా ర్యాంకుల వ్యవహారం మంత్రివర్గంతో పాటు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.