తెలంగాణ

నెరవేరని లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 3: ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాల పాలన కొనసాగిస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. రాచరిక పాలనకు తెరలేపిన కేసీఆర్ ప్రజల బాగోగులు మరిచారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టో అటకెక్కించి తన సొంత అజెండా అమలు చేస్తూ, ప్రజల బతుకులు దుర్భరం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గత 60రోజులుగా కొనసాగిన పోరుబాట ముగింపు సభను కరీంనగర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సురవరం మాట్లాడుతూ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేక ఫలాలు అందకుండా చేస్తున్నారని దుమ్మెత్తారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు చేపడుతున్న పోరాటాలతో ముఖ్యమంత్రిలో వణుకు మొదలైందని, దీంతో రాజకీయ వ్యభిచారం చేస్తూ, నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించడంలో తెరాస ప్రభుత్వం వైఫల్యం చెందడంతో రైతుల ఆత్మహత్యల పరంపరం కొనసాగుతుండగా, బడుగు, బలహీన వర్గాల్లో నైరాశ్యం నెలకొనగా, ప్రశ్నించే సమయం ఆసన్నమైందన్నారు. దీనిని గమనించిన కేసీఆర్ సామాన్యుల హక్కులు హరిస్తూ, అణిచివేతకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు అప్పగించి, ఫిరాయింపు రాజకీయాలు ప్రోత్సహిస్తూ, విపక్షాల ఎంగిలి కూడు తింటున్నారని ఘాటైన విమర్శలు చేశారు. ప్రజాపోరాటాలపై నిత్యం ముందుండే కమ్యూనిస్టుల ఉద్యమాలపై అవహేళన చేయడం ప్రభుత్వ పతనానికి నాంది సూచకమన్నారు. అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు రాష్ట్ర పాలనకు తీసిపోలేదని, అవినీతి రహిత పాలన పేర అధికారం చేపట్టిన ఎన్డీఏ పెద్దలు నిరాటంకంగా అక్రమాలు చేస్తున్నారన్నారు. నల్లధనం వెలికితీత ఏమైందని, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో సామాన్య, మధ్య తరగతి నోట్లో మట్టికొట్టిందన్నారు. అమిత్‌షా కుమారుడు దేశాన్ని కొల్లగొడుతున్నా ఎందుకు పట్టించుకోవటంలేదని ప్రశ్నించారు. పాలకుల దురాగతాలు ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుండడం హేయనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై మరిన్ని బలమైన ఉద్యమాలు నిర్మించేందుకు పోరుబాట స్ఫూర్తిగా మారుతుందని సుధాకర్‌రెడ్డి అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలో అణగారిన వర్గాలకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని, నిధుల కొరత సాకుతో ప్రజా సంక్షేమం పక్కనబెడుతున్న ప్రభుత్వం, నిర్మాణాల కోసం లక్షల కోట్లు గుత్తేదారులకు ఎలా విడుదల చేస్తోందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాదు బతుకు తెలంగాణ కావాలని, సామాన్యుల బతుకులు మార్చలేని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ సామాజిక సమానత్వం, ఆర్థిక న్యాయం జరిగినపుడే తెలంగాణలో పేద, మద్య తరగతి ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ నేటి పాలకుల తీరు ఎమర్జెన్సీ చీకటి రోజులను తలపిస్తోందన్నారు. అణచివేత కొనసాగినంతకాలం పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ బహిరంగ సభలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు తరలిరాగా, సర్కస్ మైదానం కిక్కిరిసిపోయింది. పోరుబాట ముగింపు సభ సక్సెస్ కావటం తో కామ్రెడ్లలలో కదనోత్సాహం తొణికిసలాడింది. ఈ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, ఆం ధ్రప్రదేశ్ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, గద్దర్, రవి, పెద్దిరెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.

చిత్రం..కరీంనగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన సీపీఐ పోరుబాట ముగింపు సభ వేదికపై నుంచి
అభివాదం చేస్తున్న వివిధ పార్టీల నాయకులు