తెలంగాణ

తెలంగాణకు ప్రతిష్ఠాత్మకం తెలుగు మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రప్రభుత్వాలు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచ తెలుగు మహాసభలను 2017 డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహిస్తోంది. ఈ సభలను ప్రభుత్వం ఒక సవాల్‌గా స్వీకరించి భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా ప్రతిష్టాత్మకమైన ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రత్యేకంగా ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సిఎం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహాసభలను భారత ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని, ముగింపు సభలకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతారని నిర్వహకులు ప్రకటించారు.
మహాసభల సందర్భంగా ప్రత్యేక సంచికలను ఆవిష్కరిస్తున్నారు. మహాసభల తరఫున ఒక సంచిక, తెలంగాణ మాసపత్రిక తరఫున మరొక సంచిక వెలువడుతున్నాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ తరఫున 100 పుస్తకాలను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభలకు హాజరయ్యే అతిథులు, ప్రతినిధులకు వసతి, రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సభలకోసం 50 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశాలను ఇప్పటికే అమెరికా తదితర దేశాలతో పాటు భారత్‌లోని చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో నిర్వహించారు. జిల్లాల్లో కూడా సన్నాహక సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సమావేశాల నిర్వహణ కోసం నాలుగు కమిటీలను వేశారు. కోర్‌కమిటీ, మినీ సచివాలయ కమిటీ, కార్యనిర్వహక కమిటీ, సాంస్కృతిక కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ కమిటీలు తమకు అప్పగించిన బాధ్యతను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నాయి.
‘తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం, తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుదాం’ అన్న నినాదంతో ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలు సాగుతున్నాయి. ఐదు రోజులు జరిగే ఈ సభలు తెలంగాణలో పండగ వాతావరణాన్ని తీసుకువస్తున్నాయి. పాఠశాలలు, కార్యాలయాల్లో ఇందుకోసం ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సభలకు ఐదువేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5 వరకు ప్రతినిధులుగా పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రవీంద్రభారతి ఆవరణలో ప్రపంచ తెలుగు మహాసభలకోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయం చాలారోజుల క్రితమే ప్రారంభించారు. ఈ కార్యాలయంలో నేరుగా ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకోచ్చు, లేదా ఆన్‌లైన్‌లో కూడా పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
ఐదు రోజుల సభలకు ప్రధాన వేదికగా ఎల్‌బి స్టేడియాన్ని ఉపయోగిస్తున్నారు. దీనితో పాటు రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు లలిత కళాతోరణం, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, పీపుల్స్ ప్లాజాలను ఉపయోగించాలని నిర్ణయించారు.
మహాసభ ఉద్దేశాలు
తెలంగాణ జాతి, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని, తెలంగాణ సాహితీమూర్తులకు తగిన గౌరవం ఇవ్వాలని, తెలుగు భాష, కళావైభవాలను సభల్లో సాక్షాత్కరించాలని నిర్ణయించారు. దేశ, విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారి మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేలా చేయడం, ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగు భాషను తీర్చిదిద్దేందుకు ఈ సభలను ఉపయోగించుకోవడం, సాహిత్య స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం ప్రధాన ఉద్దేశాలుగా నిర్ణయించారు.