తెలంగాణ

కేసీఆర్‌ను గద్దె దింపాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ‘కెసిఆర్‌కు హఠావో...తెలంగాణకో బచావో’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం గాంధీ భవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. సోనియా జన్మదినంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాడు ఆమె ప్రకటన చేసినందున కృతజ్ఞతలు తెలియజేస్తూ సభను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై నుంచి నాయకులు తమ ప్రసంగాల్లో 2019 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జైపాల్‌రెడ్డి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దుష్పరిపాలకుడని ఆయన విమర్శించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించాలని, కేంద్రంలో కూడా గెలిపించి ఎర్రకోటపై జెండా ఎగుర వేయాలన్నారు. ఇది నాంది ప్రస్థావన కావాలన్నారు.
మీ సంగతి చూస్తాం..: ఉత్తమ్
టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ తమ పార్టీ కార్యకర్తలను ఎక్కడైనా ఇబ్బంది పెడితే సంగతి చూస్తామని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాకు జన్మదిన బహుమతిగా ఇవ్వాలన్నారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామన్నారు. రుణ మాఫీ జరగడం లేదని ఆయన విమర్శించారు. ఖాళీలన్నీ భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకుంటున్నదని టిఆర్‌ఎస్ నేతలు విమర్శించడంలో అర్థం లేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, దోపిడీకి వ్యతిరేకమని ఆయన తెలిపారు.
జానా-రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్: సర్వే
కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రసంగిస్తూ సిఎల్‌పి నేత కె. జానారెడ్డి చాలా రోజుల క్రితమే కాంగ్రెస్‌లోకి బాహుబలి వస్తున్నారని, కేసీఆర్ అంతు చూస్తారని అన్నారని గుర్తు చేశారు. దీనిని బట్టి జానారెడ్డి, రేవంత్ ముందుగానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని అర్థం అవుతున్నదని అన్నారు. జానారెడ్డి అమాయకుడని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ముందు కెసిఆర్ జానాను కలిసి జెఎసి ఏర్పాటు చేద్దామని అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో అందరూ బాహుబలిలేనని ఎవరో ఒకరు కాదని సర్వే తెలిపారు. ఇంకా ఈ సభలో టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రులు శ్రీ్ధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్ కుమార్, బోడ జనార్ధన్, మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వేం నరేందర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.