తెలంగాణ

మావోయస్టులపై ఉక్కుపాదం (గుర్తుకొస్తున్నాయి 2017)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వామపక్ష తీవ్రవాదానికి ఒకప్పుడు కోటగా ఉన్న తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టగా, దేశ వ్యాప్తంగా కూడా ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే 22.5 శాతం తగ్గినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వామపక్ష తీవ్రవాదం పశ్చిమబెంగాల్ నక్సల్బరి గ్రామంలో ఆవిర్భవించినా, దాని ప్రభావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌పై 2005 వరకు తీవ్రంగా ఉండేది. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నక్సలైట్లతో చర్చలు జరపడం,విఫలం కావడంతో నక్సలైట్లు మళ్లీ హింసకు దిగడంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. పొరుగునే ఉన్న చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు తమ కార్యకలాపాలను చేపట్టి జార్కాండ్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, బీహార్‌కు విస్తరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో విభజన జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నామమాత్రమే. దండకారణ్యం సరిహద్దున ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, తూర్పు, పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మావోయిస్టు పార్టీ బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మావోయిస్టుల ఏరివేతలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు కీలకపాత్ర వహించి దేశ వ్యాప్తంగా నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి.
తెలంగాణ.. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ 14వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది చంద్రపుల్లారెడ్డి బాట వర్గానికి చెందిన కార్యకర్తలు హతమయ్యారు. రాష్ట్రం అవతరించిన తర్వాత ఇది తొలి భారీ ఎన్‌కౌంటర్. కాగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఉనికిని చాటుకునే విధంగా మాత్రమే ఉన్నాయి. దీనికి గణాంక వివరాలే సాక్షి. 2017లో తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల హింసకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. కాగా 11 మందినక్సలైట్లు హతమయ్యారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతలందరూ తెలంగాణకు చెందిన వారే. కాని రాష్ట్రం అవతరించిన తర్వాత అభివృద్ధి పుంజుకోవడం, సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టడం, సంక్షేమ ఫలాలను సామాన్యులకు అందే విధంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టడం వల్ల నక్సలైట్లలో చేరేందుకు యువకులు విముఖత కనపరుస్తున్నారు. పైగా ఆధునిక టెక్నాలజీ వల్ల మావోయిస్టు పార్టీలో చేరిన యువకులు పోలీసులకు దొరికిపోతున్నారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లాలన్న నాలుగైదు గంటల వ్యవధి చాలు. పోలీసు శాఖలో నిఘా, గ్రేహౌండ్స్ పోలీసు బలగాల మధ్య సమన్వయం ఉండడం వల్ల మావోయిస్టు పార్టీ విస్తరించలేకపోతోంది.
ఆంధ్రప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు పార్టీ ఉనికి అంతంతమాత్రమే. దండకారణ్యంతో సరిహద్దు ఉన్న గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల ఏజన్సీ మైదానంలో అప్పుడప్పుడు మావోయిస్టులు ప్రవేశించి తమ ఉనికిని చాటుకుంటున్నారు. 2017లో వివిధ ఘటనల్లో ఐదుగురు పౌరులు, ఒక పోలీసు, ముగ్గురు నక్సలైట్లు మరణించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నక్సలైట్ల అణచివేయడంలో ఏ మాత్రం రాజీపడకుండా భారీ ఎత్తున గ్రేహౌండ్స్‌బలగాలను రంగంలో దింపి నిరంతరం గాలింపు చర్యలను పర్యవేక్షిస్తోంది. నక్సలైట్లను అణచివేయడంలో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మంచి సమన్వయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది.
దేశ వ్యాప్తంగా విశే్లషిస్తే 2016లో మావోయిస్టులహింసకు సంబంధించి 807 ఘటనలు నమోదైతే, ఈ ఏడాది ఇంతవరకు 625 ఘటనలు జరిగాయి. 2010 నుంచి 2017 వరకు విశే్లషిస్తే 2016లో మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఎదురుదెబ్బలు తగలడం ప్రారంభమైంది. 2010తో పోలిస్తే 2016,2017లో 440 శాతం మేర నక్సలైట్ల లొంగుబాట్లు పెరిగాయి. పోలీసు స్టేషన్లపై 2010లో 230 ఘటనలు, 2017 58 ఘటనలు జరిగాయి. మావోయిస్టు పార్టీలో నాలుగు రీజనల్‌బ్యూరోలు ఉన్నాయి. ఉత్తర, తూర్పు, కేంద్ర, సౌత్ వెస్ట్ జోన్లు ఉన్నాయి. స్పెషల్ జనల్ కమిటీలు, స్పెషల్ ఏరియా కమిటీలు, స్టేట్ కమిటీలు వీటి పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, ఓడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీలు బలహీనపడ్డాయని పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మావోయిస్టు పార్టీ సమావేశంలో సీనియర్లు, వృద్ధులను పార్టీలో నుంచి తప్పించి యువతరానికి బాధ్యత అప్పగించాలని తీర్మానించినట్లు పోలీసులకు లభించిన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.

-కేవీఎస్