తెలంగాణ

విద్యుత్ రంగంలో రారాజు తెలంగాణ (గుర్తుకొస్తున్నాయి 2017)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది విద్యుత్ రంగంలో పుంజుకుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. విద్యారంగంలోనూ ఈ ఏడాది రాష్ట్రం ముందడుగు వేసింది. పాఠశాలలు, కళాశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేసింది. వ్యవసాయ రంగానికి వస్తే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఒడిదుడుకుల మధ్య సాగింది. సకాలంలో వర్షాలు కురవక పోవడం వల్ల పంటల దిగుబడి తగ్గిపోయింది. నక్సలైట్ల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఈ ఏడాది కఠిన వైఖరినే అనుసరించాయి. డిసెంబర్ 14న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చండ్ర పుల్లారెడ్డి బాట వర్గానికి చెందిన తొమ్మిది మంది నక్సలైట్లు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ఇది.

విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగింది. మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ రంగం స్వరూపాన్ని మార్చి వేసిన ఘనత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం 2014జూన్ 2వ తేదీన ఆవిర్భవించే నాటికి విద్యుత్ సమస్యలతో సతమతమైంది. కాని మూడున్నర సంవత్సరాల్లో మిగులు విద్యుత్ దిశగా అడుగులు వేసింది. రాష్ట్రంలో పుష్కలమైన థర్మల్, సౌర విద్యుత్ లభిస్తోంది. 2792 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి దేశంలో అగ్ర స్థానంలో నిలిచిన ఖ్యాతి తెలంగాణకు దక్కింది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఉన్న 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు వ్యవసాయ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. నూతన సంవత్సరం 2018 జనవరి 1వ తేదీ నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. దేశచరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లో ఎక్కనుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన సమయంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పదని, పరిశ్రమలు తరలివెళుతాయని, చీకట్టు కమ్ముకుంటాయనే దుష్ప్రచారం విపరీతంగా జరిగింది. అన్ని అంచనాలను పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో విద్యుత్ రంగం మూడేళ్ల వ్యవధిలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 6574 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉంది. 2017 వచ్చేసరికి కొత్తగా 7981 మెగావాట్ల విద్యుత్ సమకూర్చుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లు. మరో 13752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణం సాగుతోంది. విద్యుత్ టారిఫ్‌ను 2015, 2016 సంవత్సరాల్లో పెంచారు. 2017లో విద్యుత్ చార్జీలను పెంచలేదు. ఇది కూడా ఒక రికార్డు. సామాన్యుడిపై భారం పడకుండా 2017లో కూడా దాదాపు రూ.5వేల కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించింది. సింగరేణి పవర్ ప్లాంట్ ద్వారా 1200 మెగావాట్లు, కెటిపిసిద ఆవరా 600 మెగావాట్లు, జూరాల ద్వారా 240 మెగావాట్లు, పులిచింతల ద్వారా 90 మెగావాట్లు, చత్తీస్‌గడ్ నుంచి వెయ్యి మెగావాట్లు, సిజిఎస్ ద్వారా రెండు వేల మెగావాట్లను అదనంగా సమకూర్చుకున్నారు. కొత్త సౌర విద్యుత్ పాలసీతో సౌర విద్యుత్ పారిశ్రామికవేత్తలు తెలంగాణకు క్యూ కట్టారు. కొత్తగా నిర్మించే ఎత్తిపోతల పథకాలకు 8500 మెగావాట్లు అవసరమవుతుంది. ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వేగవంతం చేశారు. 4వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1880 మెగావాట్ల విద్యుత్ వచ్చే ఏడాది అమలులోకి వస్తుంది. రామగుండం ఎన్టీపిసి ద్వారా మరో 1600 మెగావాట్ల విద్యుత్ లభ్యతలోకి రానుంది. 28వేల మెగావాట్లకు పైగా స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.12136 కోట్ల వ్యయంతో పంపిణీ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడే నాటికి 400 కెవి సబ్‌స్టేషన్లు ఆరు ఉంటే, కొత్తగా మరో ఐదు నిర్మించి వాటి సంఖ్యను 11కు చేర్చారు. 400 కెవి సబ్‌స్టేషన్లను మరో 5 నిర్మించేందుకు ప్రణాళికను ఖరారు చేశారు. 220 కెవి సబ్‌స్టేషన్లు 51 ఉంటే, కొత్తగా మరో 19 నిర్మించి వాటి సంఖ్యను 70కు పెంచారు. 132 కెవి సబ్‌స్టేషన్లు 51 ఉంటే, కొత్తగా మరో 19 నిర్మించి వాటి సంఖ్యను 211కు పెంచారు. 33 కెవి సబ్‌స్టేషన్లు 2181 ఉంటే కొత్తగా 515 నిర్మించి, వాటి సంఖ్యను 2696కు పెంచారు. రాష్ట్రంలో సబ్‌స్టేషన్ల సంఖ్యను 2414 నుంచి 2988కు పెంచారు. రాబోయే మూడు నాలుగేళ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు 42 వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా 18 వరకు 400 కెవి సబ్‌స్టేషన్లు, 220 కెవి సబ్‌స్టేషన్లను 34, 132 కెవి సబ్‌స్టేషన్లు 90, 33/11 కెవి సబ్‌స్టేషన్లు 937 నిర్మించేందుకు ప్రణాళికను ఖరారుచేశారు. హైటెన్షన్ సామర్థ్యాన్ని 12,653 మెగావాట్ల నుంచి 20,660 మెగావాట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్రం చూపించిన చొరవ కారణంగా ఉత్తర, దక్షిణ గ్రిడ్‌ల మధ్య కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం జరిగింది. వార్దా-మహేశ్వరం వయా డిచ్‌పల్లి మధ్య 765 డబుల్ సర్క్యూట్ లైన్ నిర్మాణం పూర్తయింది. వరంగల్-వరోరా లైను మరో మూడేళ్లలో పూర్తవుతుంది. ఈ లైన్ల ద్వారా తెలంగాణ రాష్ట్రం మరో రెండు వేల మెగావాట్ల విద్యుత్ పొందేందుకు వీలుగా పిజిసిఐఎల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ లైన్ల ద్వారా దేశంలో ఎక్కడినుంచైనా కావాల్సినంత విద్యుత్‌ను పొందే వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేందుకు వీలుగా జిహెచ్‌ఎంసి చుట్టూ 142 కి.మీ మేర 400 కెవి రింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక క్రమశిక్షణకు మెరుగైన పనితీరును ఆర్‌ఇసి, పిఎఫ్‌సి సంస్థలు మెచ్చుకున్నాయి. ఈ సంస్థలు ఇచ్చే రుణాలపై వడ్డీని 12 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గించాయి. దీని వల్ల విద్యుత్ సంస్థలకు 200 కోట్ల రూపాయల మేర వడ్డీ భారం తగ్గింది. తెలంగాణ విద్యుత్ వినియోగం గత మూడున్నరేళ్లలో 26 శాతం పెరిగింది. 2016-17లో జాతీయ సగటు విద్యుత్ వినిమయం 1122 యూనిట్లు ఉంటే, తెలంగాణ సగటు అంతకన్నా 383 అదనంగా నమోదైంది. ఈ పెరుగుదల తెలంగాణ అభివృద్ధికి తార్కాణంగా భావించవచ్చు.

-శైలేంద్ర