తెలంగాణ

వచ్చేది ఎన్నికల లెక్కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: వచ్చే ఎన్నికల బడ్జెట్ కెసిఆర్ కలలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ఆర్థిక శాఖ రూపొందిస్తోంది. వచ్చే బడ్జెట్‌లో వ్యవసాయం, సంబంధించిన రంగాలు, సాగునీటిపారుదల, విద్యుత్ రంగం కలిపి మొత్తం రూ.50 వేల కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటాయించాలనేప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరుకున్నాయి. దీని వల్ల వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల సబ్సిడీతో పాటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇతోధికంగా ప్రాధాన్యత ఇవ్వాలనే వత్తిడి పెరుగుతోంది. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మార్చి 12వ తేదీ నుంచి జరుగుతాయని ఇప్పటికే ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా పేర్కొన్నారు. బడ్జెట్‌ను మార్చి 15 లేదా 16వ తేదీన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో కేంద్ర బడ్జెట్ వచ్చిన వెంటనే, రాష్ట్రంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కసరత్తు ప్రారంభించనున్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకుని కెసిఆర్ అభిమతానికి అనుగుణగా బడ్జెట్ కేటాయింపుల పత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లో అగ్ర కులాల్లో పేదలను కూడా తాయిలాలు ఇవ్వనున్నారు. ఇంతకాలం ఎస్సీ, ఎస్టీ, బిసిలకే పరిమితమైన తాయిలాలు అగ్రకుల పేదలకు కూడా విస్తరించాలనే యోచనతో ప్రభుత్వం ఉండడం విశేషం. 2017-18 బడ్జెట్ రూ.1.49 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. 2018-19 బడ్జెట్‌ను రూ. 1.75 లక్షల కోట్ల నుంచి రూ.1.80 లక్షల కోట్ల మధ్య రూపొందించి ప్రవశపెట్టవచ్చనే అంచనాలు ఉన్నాయి. గత ఏడాదిపైన 18 శాతం అంచనాలు పెంచనున్నారు. జిఎస్‌టి తర్వాత రెవెన్యూ వృద్ధిరేటును పరిగణనలోకి తీసుకుని, వచ్చే ఏడాది జిఎస్‌టి రెవెన్యూను అంచనా వేసి బడ్జెట్ సైజును పెంచుతున్నట్లు తెలిసింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు సంబంధించి రూ. 6వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. నీటిపారుదల, వ్యవసాయ శాఖ ఉద్యోగుల వేతనాల బడ్జెట్‌ను కూడా ఇందులోనే కలుపుతారని తెలుస్తోంది.
24గంటల ఉచిత విద్యుత్‌కు రూ.600 కోట్లు, రైతులకు పెట్టుబడుల సాయానికి రూ. 12వేల కోట్లు, రైతుల పంటలకు గిట్టుబాటు ధర నిమిత్తం రూ.500 కోట్లు, రైతు సమితులకు రూ.2నుంచి 3వేల కోట్లు, ఎత్తిపోతల పథకాలకు కరెంటు బిల్లునిమిత్తం రూ. 5నుంచి 6వేల కోట్లను కేటాయించనున్నట్లు సమాచారం. కోటి ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం కాళేశ్వరంతో సహా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులను, చెరువుల మరమ్మత్తు కోసం మిషన్ కాకతీయ, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, రైతుల సమితుల ఏర్పాటు తదితర కార్యక్రమాల అమలుకు నిధుల కొరత లేకుండా బృహత్తర ప్రణాళికను ఖరారు చేసింది. బిసి సంక్షేమం, మహిళా సాధికారతకు కూడా ప్రత్యేక బడ్జెట్ ఉంటే బాగుంటుందనే సలహాలు వచ్చాయి. హైదరాబాద్‌లో ప్రధాన ఆసుపత్రులు గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌కు భారీ ఎత్తున నిధులను సమకూర్చనున్నారు. ఉప్పల్, బోయినపల్లి, శంషాబాద్‌లో కూడా మూడు పెద్ద ఆసుపత్రుల నిర్మాణానికి నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించనున్నారు.
అగ్రకులాల పేదలకు తాయిలాలు
వచ్చే బడ్జెట్‌లో అగ్రకులాల పేదలకు కూడా సంక్షేమం నిమిత్తం నిధులు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కులాలకు చెందిన విద్యార్థులకు ఉపకారవేతనాలు, వివాహం సమయంలో అలవెన్సులు, ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. గత ఏడాది రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఇంతవరకు రూ.96వేల కోట్లను ఖర్చుపెట్టారు. మిగిలిన నిధులను వచ్చే రెండున్నర నెలల్లో ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఈ దిశగా పనులను వేగవంతం చేయాలని రాష్ట్రప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.