తెలంగాణ

కేంద్రంపై గళం పెంచనున్న టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: నేటి నుంచి ప్రారంభం కానున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో గళాన్ని పెంచాలని టిఆర్‌ఎస్ భావిస్తుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి సమావేశాల్లో కాస్త కటువుగానే వ్యవహరించాలని నిర్ణయించినట్టు టిఆర్‌ఎస్ పార్టీ వర్గాల సమాచారం. అన్ని అంశాల్లో కేంద్రానికి స్నేహహస్తాన్ని అందించినా అటు నుంచి ఆశించిన మేరకు సహకారం కొరవడిందని టిఆర్‌ఎస్‌లో అసంతృప్తి నెలకొంది. ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నప్పటికీ ఆశించిన మేరకు కేంద్రం నుంచి సహకారం అందకపోవడం పట్ల టిఆర్‌ఎస్ పార్టీ అసంతృప్తితో ఉంది. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని టిఆర్‌ఎస్ భావిస్తుంది. విభజన తర్వాత తెలంగాణలో మారిన సామాజిక వర్గాల జనాభాకు అనుగుణంగా గిరిజనులకు, మైనార్టీలకు రిజర్వేషన్ల శాతం పెంచుతూ శాసనసభలో తీర్మానం చేసి పంపించినా కేంద్రం నుంచి ఇప్పటిదాకా స్పందన లేకపోవడాన్ని టిఆర్‌ఎస్ తీవ్రంగా పరిగణిస్తుంది. పక్క రాష్ట్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతుండగా అదే తరహాలో తెలంగాణలో ఎందుకు అనుమతించడం లేదని టిఆర్‌ఎస్ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. తాము ప్రతిపాదించిన మేరకు రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం అనుమతించకపోతే న్యాయ పోరాటానికైనా సిద్ధమేనని ఇప్పటికే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హెచ్చరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచుకునే అంశాన్ని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని కూడా సిఎం కెసిఆర్ గతంలో వెల్లడించారు. అయితే ఈ అంశంలో కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడాన్ని టిఆర్‌ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఆర్థిక సహాయం అందించాలని నీతి అయోగ్ కేంద్రానికి సిఫారసు చేసింది. అయినప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. దీంతో పాటు హైకోర్టు విభజన పట్ల కేంద్రం తీవ్ర జాప్యం చేయడం పట్ల కూడా టిఆర్‌ఎస్ ఆగ్రహంతో ఉంది.
ఆశించిన మేరకు సహాయ, సహకారం లభించకపోవడాన్ని బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని టిఆర్‌ఎస్ భావిస్తుంది. రిజర్వేషన్ల పెంపుతో పాటు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై బడ్జెట్ సమావేశాల్లో నిలదీయడానికి ఎంపీలను టిఆర్‌ఎస్ సమాయత్తం చేసింది.