తెలంగాణ

వారివి రాజకీయ డ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 30: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని అనుచరుడి హత్యను అడ్డం పెట్టుకుని కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ లబ్ధికోసం తనపైన, ప్రభుత్వంపైన అసత్య ఆరోపణలతో రాజకీయ డ్రామాలు వేస్తున్నారని నకిరేకల్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నల్లగొండ, సాగర్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జిలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల నర్సింహాయ్యలతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీనివాస్ హత్యలో తన ప్రమేయం ఉందం టూ టి. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను వీరేశం తీవ్రంగా ఖండించారు. శ్రీనివాస్‌తో తనకు ఎలాంటి వైరమూ లేదని, తనతో పాటు జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి సైతం హత్య సమాచారం తెలుసుకున్న పిదప శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సిద్ధమయ్యామన్నారు.
అయితే హత్య జరిగిన రాత్రి నుంచి ఉదయం దాకా వెంట ఉండే అను చరులే తన భర్తను హత్య చేశారన్న లక్ష్మి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వచ్చాక ఆయన ప్రోద్బలంతో మాటమార్చి భర్త హత్య వెనుక టిఆర్‌ఎస్ నాయకుల కుట్ర ఉందని ఆరోపించడంతో తాము ఆశ్చర్యానికి గురయ్యామన్నారు. శ్రీనివాస్ హత్య కేసులో నిందితులు గతంలో తనతో ఫొటోలు దిగారని అంతమాత్రాన హత్యకు తనకు సంబంధం ఉందంటూ ఆరోపించడం అర్ధరహితమన్నారు. నిందితులంతా టిఆర్‌ఎస్ వారు కాదని, వారంతా కోమటిరెడ్డికి అనుచరులేనని, ఆయనతో కూడా వారు ఫొటోలు దిగిన విషయం మరువరాదన్నారు. శ్రీనివాస్ హత్య ద్వారా రాజకీయ లబ్ధి సాధించి వచ్చే ఎన్నికల్లో తన గెలుపునకు పునాదులు వేసుకునేందుకు వెంకట్‌రెడ్డి చేస్తున్న రాజకీయ డ్రామాలు, నటన కమల్‌హాసన్ నటనను మించిపోయిందన్నారు. అనుచరులను రాజకీయంగా ఎదుగనివ్వని చరిత్ర వెంకట్‌రెడ్డికే చెల్లిందన్నారు. గతంలో తాను నార్కట్‌పల్లి కాఫీడే వద్ద ఆగిన సందర్భంలో శ్రీనివాస్ అటుగా వెళుతూ తన వద్దకు వచ్చాడని ఈ సందర్భంగా భవిష్యత్ రాజకీయాలపై తనతో చర్చించాడన్నారు. అంతకు మించి తాము శ్రీనివాస్‌తో ఏమీ మాట్లాడలేదని మూడున్నర ఏళ్లలో శ్రీనివాస్‌తనతో ఆయన తండ్రి చనిపోయినప్పుడు తప్ప మరెప్పుడు మాట్లాడలేదన్నారు. శ్రీనివాస్ హత్య కేసు విచారణలో నిందితుల కాల్‌డేలా విశే్లషించి జిల్లా పోలీసులు దర్యా ప్తు చేశారన్నారు. ఐనప్పటికీ డిజిపికి వెళ్లి వెంకట్‌రెడ్డి ఫిర్యాదు చేయగా సదరు లేఖలో శ్రీనివాస్ హత్య విచారణ అంశం లేకపోగా తనకు గన్‌మెన్లు కావాలని కోరడం అంతా గమనించాలన్నారు. కేసు విచారణకు మూడున్నర ఏళ్ల తన కాల్‌డేటా ఇవ్వడానికి తాను సిద్ధమని, అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ కాల్‌డేటా సైతం ఇవ్వాలన్నారు. అలాగే కేసు సిబిఐ విచారణకు, నార్కో టెస్టులకు సైతం తాను సిద్ధమని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. హత్యా రాజకీయాల చరిత్ర ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌దేనని నక్సలైట్ ఉద్య మం నుంచి బయటకు వచ్చి కేసీఆర్ నాయకత్వం లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తనపై ఒక్క కేసు కూడా లేదన్నారు. చిట్యాల ఎంపిపి ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ, వెంకట్‌రెడ్డి స్వగ్రామంలో ఆయన మాటను కాదని తాను పర్యటించడం, వెంకట్‌రెడ్డి అన్న శాశ్వత ధర్మకర్తగా ఉన్న వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో ప్రోటోకాల్ అమలుకు డిమాండ్ చేసినందునే కోమటిరెడ్డి బ్రదర్స్ తనను రాజకీయంగా టార్గెట్ చేశారన్నారు. గత ఎన్నికల్లో వెంకట్‌రెడ్డిని ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడించినంత పనిచేసిన కంచర్ల భూపాల్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి తీసుకరావడంతో, నకిరేకల్‌లో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగవుతుండటంతో ఆయన తమపై మరింత కక్ష పెం చుకున్నారన్నారు. తాను హత్యా రాజకీయాలు చేస్తున్నానన్న జానా, దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తమ నియోజకవర్గాల్లో దాడులు, హత్యలతో కూడిన రాజకీయాల చరిత్రను విస్మరించడం విడ్డూరమని, కాంగ్రెస్ నేతల రక్తచరిత్రను ప్రజల ముందుంచుతామని అన్నారు. గతం లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయన స్వగ్రామానికి చెందిన మాజీ నక్సలైట్‌కు రూ.10 కోట్ల సుపారీ ఇచ్చి తన హత్యకు కుట్ర చేశాడని, దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశానన్నారు. అణగారిన వర్గాల నుంచి రాజకీయాల్లో ఎదుగుతున్న తనను ప్రజల్లో ఎదుర్కోలేక ఎన్‌కౌంటర్ చేయాలంటూ మాజీ ఎంపి వి.హనుమంతరావు, క్రిమినల్‌గా తనపై ముద్ర వేస్తూ ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి నేతలు మాట్లాడిన మాటలు చూస్తే కాంగ్రెస్ నాయకులు తన హత్యకు కుట్ర చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నాన్నారు.
వారి మాటలపై చట్టపర చర్యలకు తాను న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను హత్య చేస్తారంటూ వెంకట్‌రెడ్డి చేస్తున్న ప్రచారం చూస్తే రేపు ఆయనకు ఏం జరిగినా అతనే బాధ్యత వహించాలన్నారు. నరుూం ముఠాను నల్లగొండ, భువనగిరిలలో పెంచి పోషించింది కోమటిరెడ్డి బ్రదర్సైతే టిఆర్‌ఎస్ నరుూం పీడను ప్రజలకు వదిలించిందన్నారు. నల్లగొండను రౌడీషీటర్ల అడ్డాగా మార్చిన చరిత్ర కోమటిరెడ్డికి ఉందన్నారు. కాంగ్రెస్ కుట్రలకు, దుష్ప్రచారాలకు తాను బెదిరిపోనని నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చిన తాను తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పనిచేస్తానన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ ఎంపిపి రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డితో పాటు నకిరేకల్, నల్లగొండ టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..నల్లగొండలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న నకిరేకల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వీరేశం ప్రభృతులు