తెలంగాణ

అద్వితీయ ఘట్టం ఆరంభం గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం, జనవరి 31: ఆశేష భక్తజనావళి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అపురూప ఘట్టాలు బుధవారం రాత్రి చోటుచేసుకున్నాయి. సారక్క తల్లే దండాలో అంటూ లక్షలాది మంది భక్తులు చేసిన సారలమ్మ నామస్మరణతో బుధవారం కనె్నపల్లి నుండి మేడారం వరకు మేడారం జాతర ప్రాంగణం మారుమోగిపోయింది. కనె్నపల్లిలో కొలువున్న సారలమ్మ బుధవారం మేడారం గద్దెకు చేరడంతో నాలుగు రోజులపాటు జరగనున్న మహా ఘట్టానికి తెరలేచింది. సారలమ్మ దర్శనం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తజనం సారలమ్మ గద్దెపైకి చేరగానే భక్తి భావంతో ఊప్పొంగిపోయారు. కనె్నపల్లి ఆలయం నుండి బుధవారం రాత్రి 8-14 గంటలకు బయలుదేరిన సారలమ్మ మొదట జంపన్నవాగు వద్దకు, అక్కడ నుండి మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గుడికి చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు కూడా మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 11గంటల ప్రాంతంలో సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి చేర్చారు. హనుమాన్ జెండా నీడన సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్యతోపాటు ఇతర పూజారులు సారలమ్మను గద్దెపైకి చేర్చారు.
కనె్నపల్లిలో ప్రత్యేక పూజలు
సారలమ్మ గద్దెపైకి చేరనున్న సందర్భంగా బుధవారం ఉదయం నుంచే కనె్నపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాకా సారయ్య ఆధ్వర్యంలో పూజారులు గిరిజన సంప్రదాయ పద్ధతిలో సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం నుండి పూజలు మరింత జోరందుకున్నాయి. ప్రత్యేక పూజలు అనంతరం సాయంత్రం కనె్నపల్లి నుండి బయలెళ్లిన సారలమ్మ భారీ పోలీసు బందోబస్తు నడుమ మేడారం గద్దెపైకి చేరింది. కనె్నపల్లి ఆలయంలో సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న క్రమంలో అనేక మంది భక్తులు సారలమ్మ గుడికి తరలివచ్చారు. తమ ఊరి ఆడపడుచును తల్లి ఒడికి చేర్చేందుకు కనె్నపల్లి గ్రామస్థులందరూ సారలమ్మ గుడికి చేరుకున్నారు.
సారక్క తల్లో దండాలు
మేడారంలోని గద్దెపై కొలువుతీరడానికి కనె్నపల్లి నుండి బయలుదేరిన సారలమ్మకు దారి పొడవునా జాతరకు విచ్చేసిన భక్తులు దండాలు పెడుతూ భక్త్భివంతో ఉప్పొంగిపోయారు. సారలమ్మ తల్లికి జై అంటూ నినాదాలిచ్చారు. గుడి నుండి బయలుదేరిన సారలమ్మకు కనె్నపల్లి వాసులందరూ మంగళ హారతులతో స్వాగతం పలికారు. దారి పొడవునా నీళ్ళు పోస్తూ కొబ్బరి కాయలు కొడుతూ తమ ఊరి ఆడబిడ్డను తల్లి సమ్మక్క ఉన్న మేడారానికి సాగనంపారు. కనె్నపల్లి నుండి మేడారం బైలెళ్ళిన సారలమ్మ దారిలో తన తమ్ముడు జంపన్న వద్ద కొంత సమయం ఆగింది. సంపెంగ (జంపన్న) వాగులో కొలువైన తమ్ముడు జంపన్నను క్షేమ సమాచారాలు తెలుసుకుని అక్కడ నుండి మేడారం చేరుకుని తల్లి ఒడికి చేరింది. సారలమ్మ తన తమ్ముడు జంపన్నను పలకరిస్తుండగా జంపన్నవాగులో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. కనె్నపల్లి నుండి మేడారం గద్దెలపైకి చేరడానికి సారలమ్మ వెళ్తుండగా లక్షలాదిమంది భక్తులు రోడ్డుపైకి రావడంతో కనె్నపల్లి, ఊరట్టం క్రాస్, వంతెన వద్ద, రెడ్డిగూడెం, మేడారం పరిసరాలు కిటకిటలాడాయి.
వరం పట్టిన మహిళలు
సంతానం లేని పలువురు మహిళలు కనె్నపల్లి గుడి వద్ద బుధవారం వరం పట్టారు. మొదట జంపన్న వాగులో స్నానాలు చేసి తడి బట్టలతో సారలమ్మ గుడికి చేరుకుని గుడి ముందు పొర్లుదండాలు పెట్టారు. అమ్మవారి ప్రతిరూపమైన పసుపు - కుంకుమలను మొంటె (వెదురు బుట్ట)లో పెట్టుకుని సారలమ్మను గద్దెపైకి చేర్చే క్రమంలో పూజారులు వీరి పైనుండి దాటి వెళ్ళారు. ఇలా చేస్తే సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుందని, తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
వంతెన ఉన్నా జంపన్నను స్పర్శిస్తూ..
కనె్నపల్లి- మేడారం గ్రామాల నడుమ జంపన్నవాగుపై వంతెన ఉన్నప్పటికీ ఆనవాయితీ ప్రకారం కనె్నపల్లి నుండి బైలెళ్ళిన సారలమ్మను జంపన్నవాగులో నుండే తీసుకువచ్చారు. అక్క సారక్క రాకను తమ్ముడు జంపన్న కాళ్ళు కడిగి ఆహ్వానిస్తాడనే ఆదివాసీల నమ్మకం. అందుకే జంపన్నవాగు మధ్యలో నుండి సారక్కను తీసుకువచ్చేది. ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతున్న ఆచారంగా ఆదివాసీలు భావిస్తారు. సారలమ్మను కనె్నపల్లి నుండి మేడారం గద్దెపైకి తీసుకువచ్చే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అమేయ్‌కుమార్, మేడారం జాతర ట్రస్టీ చైర్మన్ కాక లింగయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు.