కృష్ణ

విద్యల నిలయంగా నవ్యాంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 15: రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఏడు జాతీయ స్థాయి విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఆయన స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ళ నారాయణరావులతో కలిసి కృష్ణా విశ్వ విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ విశ్వ విద్యాలయాల ఏర్పాటుతో రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థకు జవసత్వాలు తీసుకువచ్చామన్నారు. బడ్జెట్‌లో విద్యా రంగానికి కోట్లాది రూపాయలు కేటాయింపులు చేశామన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయాన్ని దేశంలోని గొప్ప విశ్వ విద్యాలయాల్లో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే విద్యా రంగంలో అపారమైన అనుభవం కలిగిన ఆచార్య ఎస్ రామకృష్ణారావును ఉపకులపతిగా నియమించినట్లు తెలిపారు. రామకృష్ణారావు సారథ్యంలో విశ్వ విద్యాలయం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వ విద్యాలయంలో నెలకొన్న ఫ్యాకల్టీ కొరత తన దృష్టికి వచ్చిందని త్వరలోనే నిష్ణాతులైన వారిని ఫ్యాకల్టీలుగా నియమించనున్నట్లు చెప్పారు. వచ్చే యేడాది నుండి డిమాండ్ ఉన్న కోర్సును ప్రవేశ పెట్టనున్నట్లు వివరించారు. రుద్రవరం గ్రామంలోని 102 ఎకరాల్లో యూనివర్శిటీ భవన నిర్మాణ పనులకు అతి త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామన్నారు. తొలుత అకడమిక్, అడ్మ్రినిస్ట్రేటీవ్ బ్లాక్‌లను నిర్మించడం జరుగుతుందన్నారు. తొలుత విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ వాలీబాల్ ఉమెన్ టోర్నమెంట్ పోటీలను మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, ఎంపి నారాయణరావులు తిలకించారు. క్రీడాకారుణులను పరిచయం చేసుకుని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు, రిజిస్ట్రార్ ఆచార్య డి సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్ వైకె సుందర కృష్ణ, పిఆర్‌ఓ వినయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

21, 22 తేదీల్లో కలెక్టర్ల సమావేశం
* రెండు రోజుల్లో ప్రభుత్వ శాఖల లక్ష్యాలు, పురోగతిపై నివేదికలు ఇవ్వాలి
* ‘మీకోసం’లో జిల్లా కలెక్టర్ బాబు.ఎ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 15: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 21, 22తేదీల్లో విజయవాడలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మీకోసం’లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ కోర్ డాష్ బోర్డు ఆధారంగా ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో వివిధ శాఖలు పురోగతి డాష్ బోర్డులో ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తమ తమ శాఖలకు సంబంధించి సాధించిన ఫలితాలను అప్‌లోడ్ చేస్తే సిఎం డాష్ బోర్డులో నమోదవుతుందన్నారు. నాలుగైదు రోజుల్లో అప్‌లోడింగ్ పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అవసరమయ్యే శాఖల వారీగా లక్ష్యాలు, పురోగతిపై, రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాలు, వాటికి బడ్జెట్ వివరాలను రెండు రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శాఖాధికారులంతా తమ శాఖ డబుల్ డిజిట్ గ్రోల్ లక్ష్యంగా నివేదికలు రూపొందించాలన్నారు. అలాగే తమ తమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల వివరాలు కూడా తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డిఆర్‌ఓ చెరుకూరి రంగయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలందించండి
* ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జెడ్‌పి చైర్‌పర్సన్
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 15: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్యాజువాలిటి, అత్యవసర చికిత్సా విభాగం, మెడికల్ వార్డుతో పాటు పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 1 నుండి ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటి వరకు 50 శాతం మంది మాత్రమే వినియోగించుకోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కుక్క కాటు మందు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. విధిగా ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్క కాటు మందు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఆస్పత్రిలో నిర్వహిస్తున్న మరమ్మతు పనులను ఆమె పరిశీలించారు. వంటశాలను పరిశీలించిన ఆమె రోగుల కోసం తయారు చేస్తున్న ఆహార పదార్థాల రుచి చూశారు. రోగులకు రుచికరమైన, పౌష్టికాహారం అందించాలని సూచించారు. నర్సింగ్ కళాశాలను సందర్శించి విద్యార్థులను వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ కళాశాల తరగతులు, హాస్టల్ ఎంసిహెచ్ బ్లాక్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారని, కనీస సౌకర్యాలు కొరవడ్డాయని, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్ట్ఫా కూడా లేరని, డిప్యుటేషన్‌పై ప్యాకల్టీని వేశారని పలువురు విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్, జడ్‌పిటిసి లంకే నారాయణ ప్రసాద్, ఆర్‌ఎంఓ డా. అల్లాడి శ్రీనివాసరావు, డిఇ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో ట్రైనీ కలెక్టర్ల బృందం
* 4 రోజుల పాటు జిల్లాలో శిక్షణ పొందనున్న బృందం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 15: ప్రభుత్వ పాలనా విధానాన్ని తెలుసుకునేందుకు 18 మందితో కూడిన ట్రైనీ కలెక్టర్ల బృందం సోమవారం కలెక్టరేట్‌ను సందర్శించారు. నాలుగు రోజుల పాటు ఈ బృందం జిల్లాలో పర్యటించి వివిధ శాఖల్లో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై శిక్షణ పొందనున్నారు. తొలుత కలెక్టరేట్‌కు చేరుకున్న ట్రైనీ కలెక్టర్ల బృందానికి జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య స్వాగతం పలికారు. కలెక్టరేట్‌లోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బాబు.ఎను కలిశారు. ‘మీకోసం’లో ప్రజల అర్జీల స్వీకరణ, వాటి పరిష్కారాలపై జాయింట్ కలెక్టర్ చంద్రుడు, జిల్లా ట్రైనీ కలెక్టర్ సలోని శిక్షణ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసిని సందర్శించి కృష్ణాజిల్లా వెబ్‌సైట్‌ను పరిశీలించారు. 16వతేదీన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పుర పరిపాలనపై శిక్షణ పొందనున్నారు. 17వతేదీన ఎస్‌హెచ్‌జి పెన్షన్‌ల పంపిణీ, ఇక్రాప్ బుకింగ్ సబ్ సెంటర్, పిహెచ్‌సి, ఇ-పోస్, ఎఫ్‌సిఐ గోడౌన్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, రేషన్ షాపుల పనితీరును ఈ బృందం పరిశీలించనుంది. 18వతేదీన సాలీడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్, స్మార్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ అంశాలపై శిక్షణ పొందుతారు.

సౌత్ జోన్ వాలీబాల్ టోర్నీ విజేత ‘కాలికట్ యూనివర్శిటీ’
* విజేతలకు ట్రోఫీలు అందజేసిన జడ్‌పి చైర్‌పర్సన్ అనూరాధ, ఎంపి కొనకళ్ళ
మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 15: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ వాలీబాల్ ఉమెన్ టోర్నీ విజేతగా యూనివర్శిటీ ఆఫ్ కాలికట్ నిలిచింది. స్థానిక ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా మైదానంలో గత ఐదు రోజులుగా కృష్ణా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన సోమవారం జరిగిన లీగ్ పోటీల్లో కాలికట్ యూనివర్శిటీ జట్టు ప్రథమ స్థానం, మహాత్మ గాంధి యూనివర్శిటీ (కొట్టాయం) ద్వితీయ స్థానం, హిందుస్థాన్ యూనివర్శిటీ (చెన్నై) తృతీయ స్థానం, యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ (చెన్నై) నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. సాయంత్రం జరిగిన ముగింపు సభలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, శాసనమండలి సభ్యులు ఎఎస్ రామకృష్ణ చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలను అందజేశారు. టోర్నీ ప్లేయర్‌గా కాలికట్ యూనివర్శిటీ జట్టు కెప్టెన్ శృతి, బెస్ట్ స్పైకర్‌గా ఎంజి యూనివర్శిటీ జట్టుకు చెందిన శరణ్య, బెస్ట్ సెట్టర్‌గా హిందుస్థాన్ యూనివర్శిటీకి చెందిన దీనా పైలోచన్, బెస్ట్ లీబ్రోగా హిందుస్థాన్ యూనివర్శిటీకి చెందిన పి శరణ్య బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు, రిజిస్ట్రార్ ఆచార్య డి సూర్యచంద్రరావు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. వైకె సుందర కృష్ణ, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. ఎన్ శ్రీనివాసరావు, కన్వీనర్ బిఆర్ విజయారావు, డా. జయశంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ప్రతాప్‌ను పరామర్శించిన జగన్
నూజివీడు, ఫిబ్రవరి 15: నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతమ్మ పార్ధివ దేహాన్ని వైకాప అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి సోమవారం ఉదయం సందర్శించి, నివాళులు అర్పించారు. ప్రతాప్ సతీమణి సుజాతమ్మ సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్నం 11.30 గంటలకు సుజాతమ్మ భౌతికకాయాన్ని వైకాప అధినేత జగన్‌మోహనరెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, ఆయన కుమారుడు వేణుగోపాల అప్పారావు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుంటూరు 1 శాసనసభ్యుడు షేక్ మహ్మద్ ముస్త్ఫా అలీ, తిరువూరు శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, బొబ్బిలి శాసనసభ్యుడు సుజన కృష్ణ రంగారావు, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి, మాజీ శాసనసభ్యుడు డివై దాసు, జోగి రమేష్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తదితరులు సుజాతమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
* సబ్ కలెక్టర్ లక్ష్మీశ
నూజివీడు, ఫిబ్రవరి 15: ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నూజివీడు సబ్ కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మీకోసం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని కంప్యూటరీకరణ చేస్తున్నామని, అనంతరం ఆ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అర్జీదారుని సమస్య పరిష్కార దశలను కూడా అర్జీదారునికి తెలిసే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని సూచించారు. మీకోసం కార్యక్రమంలో 20 అర్జీలు వచ్చాయని లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

21న రెండవ విడత పల్స్ పోలియో:కలెక్టర్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 15: రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 21న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. పల్స్ విజయవంతానికి అధికారులు పట్టుదలతో పని చేయాలన్నారు. మొదటి విడతలో 4లక్షల 10వేల మందికి పోలియో చుక్కలు వేయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే ప్రథమంగా కృష్ణాజిల్లాలో తల్లి ఆధార్ కార్డు అనుసంధానం చేస్తూ పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వాక్సిన్ నిల్వ ఉంచడానికి కోల్డ్‌చైన్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి పాఠశాలలో ముందుగానే విద్యార్థులకు పల్స్ పోలియో గురించి తెలియచేయాలని కలెక్టర్ బాబు.ఎ సూచించారు.

వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
జి.కొండూరు, ఫిబ్రవరి 15: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి జి.కొండూరులో వైసిపి శ్రేణులు సోమవారం ఘన స్వాగతం పలికాయి. నూజివీడులో ఒక కార్యక్రమానికి హాజరైన వైఎస్ జగన్ అక్కడి నుంచి మైలవరం మీదుగా జి.కొండూరుకు చేరుకున్నారు. జగన్ వస్తున్నారనే ప్రచారంతో వైసిపి శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు జి.కొండూరు ప్రధాన సెంటర్‌లో జగన్ కోసం వేచి నిలిచారు. జగన్ బయటకు వచ్చి అందరికి నమస్కరిస్తూ ముందుకు సాగారు. జోగి రమేష్, కాజ రాజ్‌కుమార్, జిల్లా ముఖ్య నేతలు జగన్‌తో పాటు ఉన్నారు.

విద్యుదాఘాతానికి యువకుడు మృతి
బంటుమిల్లి, ఫిబ్రవరి 15: కృత్తివెన్ను మండలం సీతారామపురం గ్రామానికి చెందిన చిగురుపల్లి భరత్‌కుమార్(18) స్థానికంగా ఉన్న ఒక ఇంట్లో వివాహానికి సంబంధించి విద్యుత్ దీపాలంకరణకు పనులు చేపట్టాడు. విద్యుత్ సెట్టింగ్ చేస్తుండగా వైర్లు పక్కనే ఉన్న 11కెవి వైరు తగలటంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే భరత్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి.
వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన సిఎం చంద్రబాబు
నందిగామ, ఫిబ్రవరి 14: మండలంలోని గోళ్లమూడిలో సోమవారం జరిగిన దేవభక్తుని నిత్యానంద ప్రసాద్ (డిఎన్) కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హెలికాప్టర్‌లో గ్రామానికి చేరుకున్న సిఎం చంద్రబాబును చూసేందుకు పరిసర గ్రామాలకు చెందిన పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా కార్యకర్తలు, స్థానిక నేతలు, గ్రామస్థులను పోలీసులు దూరంగా ఉంచారు. అభిమానులకు సిఎం చంద్రబాబు కారు నుండి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సిఎం చంద్రబాబు, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామాహేశ్వరరావు, ఎంపి కేశినేని నాని, జగ్గయ్యపేట, నందిగామ ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాం తదితర నేతలు వధూవరులు భరత్, తేజశ్విని ఆశీర్వదించారు. ఏలూరు రేంజ్ డిఐజి హరికుమార్, ఎస్‌పి విజయకుమార్‌ల పర్యవేక్షణలో డిఎస్‌పి రాధేష్ మురళి అదనపు పోలీస్ బలగాలతో గ్రామంలో బందోబస్తు పర్యవేక్షించారు. వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వధూవరుల బంధువులు, సన్నిహితులను సైతం ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం అయ్యే వరకూ భద్రతా కారణాల దృష్యా పోలీసులు అడ్డుకున్నారు.

నగరంలో ఆహార తనిఖీ అధికారులు
మెరుపు దాడులు
* కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్‌తోపాటు స్వీట్ షాపుల్లో తనిఖీలు
* నమూనాల సేకరణతోపాటు 5వేల కేజీల బొప్పాయిల ధ్వంసం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: ఆహార పదార్థాల్లో నానాటికీ అధికమవుతున్న కల్తీలను నిరోధించేందుకు ఎట్టకేలకు ఆహార తనిఖీ అధికారులు స్పందించారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ జిల్లాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పలువురు ఫుడ్ సేఫ్టీ అధికారులు బృందంగా ఏర్పడి నగరంలో కేదరేశ్వరపేట పండ్ల దుకాణంతోపాటు నగరంలోని పలు స్వీట్ షాపులపై జరిపిన దాడులు సంచనలనం సృష్టించాయి. ఈ దాడులలో గుర్తించిన ఆహార కల్తీ పదార్థాలను గుర్తించి పరీక్షల నిమిత్తం నమూనాలను సేకరించారు. అంతేకాకుండా మనిషి ఆరోగ్యాన్ని హరించే కార్బైడ్‌తో మగ్గపెడుతున్న బొప్పాయి పండ్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసిన ఘటనలు వ్యాపారులలో కలకలం రేపాయి. ఇప్పటివరకూ తమను పట్టించుకునే వారు లేరన్న నెపంతో తమ ఇష్టానుసారంగా వ్యవహరించిన వ్యాపారులు ఊహించని విధంగా జరిగిన మెరుపుదాడులతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా వివిధ రకాల పండ్ల ఎగుమతులు, దిగుమతుల వ్యాపారంతో ప్రఖ్యాతి గాంచిన నగరంలోని కేదరేశ్వరపేట పండ్ల మార్కెట్‌లో వివిధ రకాల పండ్ల నమూనాలను సేకరించారు. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే కార్బైడ్ లేకుండా మగ్గపెట్టిన పండ్లను విక్రయిస్తామంటూ బోర్డు పెట్టిన దుకాణంలోనే కార్బైడ్‌తో మగ్గపెట్టిన ఐదు వేల కేజీల బొప్పాయిలు అధికారుల తనిఖీలలో దొరికాయంటే వ్యాపారులు పాల్పడుతున్న మోసపూరిత చర్యలను అంచనా వేయవచ్చు. కార్బైడ్‌తో మగ్గపెట్టిన బొప్పాయిలను గుర్తించి ధ్వంసం చేసిన ఘటన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారని చెప్పవచ్చు. అలాగే ఆకర్షణీయమైన రంగులతో మిఠాయిలను తయారు చేసి విక్రయిస్తున్న ప్రముఖ స్వీట్ షాపులపై కూడా ఆహార తనిఖీ అధికారులు దాడులు నిర్వహించి నమూనాలను సేకరించారు. ఈ తనిఖీలలో స్వీట్ మ్యాజిక్, స్వగృహ, ఆంధ్ర, చెర్రి, అలంకార్ వంటి మొత్తం 9 దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జోనల్ ఆఫీసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆహార పదార్థాలను కల్తీ చేయడమే కాకుండా అనారోగ్యకారకమైన రంగులు, ఇతర పదార్థాలను వినియోగించి ప్రజారోగ్యానికి చేటు కలిగించే ఎటువంటి దుకాణాలపైన అయినా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే జిల్లాలో ఆహార తనిఖీ అధికారుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులు ముమ్మరం చేసి ఆహార కల్తీ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెటీవ్ మెడిసిన్ డెప్యూటీ డైరెక్టర్ మంజరి, జోనల్ అధికారి పూర్ణచంద్రరావుతోపాటు కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు పలువురు పాల్గొన్నారు.

ఉసురు తీసిన నిర్లక్ష్యం
ప్రహరీ గోడ కూలి
తల్లీకూతురు మృతి
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 15: కాలంచెల్లిన ఓ ఇంటి ప్రహరీ గోడను పట్టించుకోని యజమాని నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలు తీసింది. గోడ కూలటంతో పొరుగు ఇంట్లో నివాసముంటున్న తల్లీకుమార్తె బలయ్యారు. శిథిలాల కింద ఇరుక్కున్న తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కుమార్తె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపగా స్థానికులను తీవ్ర వేదనకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమానూరు వద్ద నివాసముంటున్న ముదిగొండ రాంబాబు(45)కు భార్య రాధ(35), కుమార్తె శిరీష(14), కొడుకు గణేష్ ఉన్నారు. పెయింటింగ్ పనిచేస్తూ రాంబాబు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఉదయం భార్య రాధ, కుమార్తె శిరీష కలిసి ఇంటి వెలుపల పంపు వద్ద పాత్రలు కడుకుతున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న శిరీష తల్లికి చేదోడుగా పనిచేస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న మద్దాల ప్రసాదరావు అనే వ్యక్తికి చెందిన ఇంటి ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపడింది. ఎప్పటి నుంచో నెర్రలున్న ఈ గోడను తొలగించి పునర్నిర్మించడంలో ఇంటి యజమాని నిర్లక్ష్యం కనపరుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కూలి పడిన గోడ శిథిలాల కింద చిక్కుకుపోయిన రాధ అక్కడికక్కడే మృతి చెందగా శిరీష తీవ్ర గాయాలపాలైంది. కూలిన పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న రాంబాబు పరుగున బయటకు వచ్చాడు. శిథిలాలను తొలగించి చూడగా రాధ విగతజీవిగా కనిపించింది. గాయపడిన కుమార్తెను వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆమె కూడా మృతి చెందింది. సమాచారం అందుకున్న పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దుర్ఘటన కుటుంబ సభ్యులను శోకసముద్రంలోకి నెట్టింది. మృతదేహాలను మార్చురీకి తరలించి రాంబాబు ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్ని మంచినీటి చెరువులను తక్షణం నింపాలి
* చేపల చెరువులకు మళ్లిస్తే కఠినచర్యలు
* కలెక్టర్ బాబు.ఎ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 15: జిల్లాలోని అన్ని మంచినీటి చెరువులను నింపి తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి సోమవారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపిడివోలు, అన్ని శాఖల అధికారులతో అటవీ భూముల గుర్తింపు, తాగునీరు, జాతీయ ఉపాధి హామీ పథకం, ఎన్‌టిఆర్ వైద్య పరీక్షల నిర్వహణ వంటి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో వుంచుకొని జిల్లాలో 370 చెరువులను నీటితో నింపి తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. కాలువలకు నీరు విడుదల చేసినందున మొదటి ప్రాధాన్యతగా మంచినీటి చెరువులను నింపుకోవాలని ఇందుకు అవసరమైతే ఆయిల్ ఇంజన్లు, 500 హాల్స్ పవర్ ఇంజన్లతో యుద్ధప్రాతిపదికన నింపుకోవాలన్నారు. కాలువలకు విడుదల చేసిన నీరు చేపల చెరువులకు వినియోగించినట్లయితే సంబంధిత చెరువులను ధ్వంసం చేయటం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. నింపవలసిన చెరువుల్లో ఎటుంవటి చెత్త లేకుండా శుభ్రం చేసుకోవాలని పంచాయతీ శాఖ అధికారులకు సూచించారు. 14వ ఆర్ధిక సంఘం నిధులు తాగునీటి నిలుపుదల వినియోగించాలన్నారు. తాగునీటి అవసరాలకు ఖర్చుచేసిన నిధులకు సంబంధించిన బిల్లులు నిలుపుదల చేయకుండా తక్షణమే విడుదల చేయాలని జిల్లా ఖజానా శాఖ అధికారిని ఆదేశించారు. కాలువ చివరి గ్రామాల్లోని చెరువులు కూడా నీటిని నింపే విధంగా కాలువలపై తహశీల్దార్లు, ఎంపిడివోలు, స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ, పోలీస్ అధికారులు పహారా నిర్వహించాలని ఆదేశించారు.
పల్స్‌పోలియో రెండోదశ ఫిబ్రవరి 21వ తేదీ ఆదివారం నిర్వహించనున్నందున వైద్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్‌టిఆర్ వైద్య పరీక్షలు జిల్లాలో సరిగా నిర్వహించకపోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకు వైద్య పరీక్షలపై ప్రగతి లేకపోవటం పట్ల వైద్య అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని తల్లిబిడ్డ, 102, ఇ-ఔషధి, బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఎన్‌టిఆర్ కాంప్లెక్సుకు మహర్దశ
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: నగరంలోని ఎన్‌టిఆర్ షాపింగ్ కాంప్లెక్సు అభివృద్ధితోపాటు తూర్పు పరిధిలోని 14రోడ్లతోపాటు హైటెన్షన్ వైర్ రోడ్డుగా ఉన్న ఆయూష్ హాస్పటల్ రోడ్డు అభివృద్ధికి మరో రూ.22 కోట్ల రూపాయల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఆర్ కరికల్ వలవేణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయనను కలిసిన నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ నగరాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సమీక్షించారు. ఎంతో కాలంగా పరిష్కృతంగా ఉన్న ఎన్‌టిఆర్ షాపింగ్ కాంప్లెక్సుపై రెండో అంతస్థు నిర్మాణం చేపట్టి షాపులను లీజుకివ్వడం ద్వారా గణనీయమైన ఆదాయం పొందాలని చూస్తున్న నగర పాలకులకు నిధుల లేమితో ఎప్పటికప్పుడు వెనకడుగు వేస్తున్న వైనం అందరికీ తెలిసిందే. కాగా ఈవిషయంపై ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్‌తో చర్చించిన మేయర్ శ్రీ్ధర్ రెండో అంతస్తు నిర్మాణానికి అవసరమైన అనుమతులకు సంబంధించిన జీవోను మరో రెండు రోజుల్లో విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని, ఇందులో నిర్మాణ వ్యయానికి సంబంధించిన నిధుల మంజూరుపై కూడా స్పష్టమైన హామీ ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే తూర్పు నియోజకవర్గం పరిధిలోని 14 ప్రధాన రహదారుల అభివృద్ధికి గాను 7 కోట్ల రూపాయలు, దీనితోపాటు ఎంతోకాలంగా అసంపూర్తిగా ఉన్న ఆయూష్‌హాస్పటల్ రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధిపరచేందుకు మరో 22 కోట్లను కూడా మంజూరు చేసామని, త్వరలోనే వీటిని విఎంసి ఖజానాకు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరికల్‌ను కలిసిన వారిలో ఇఇ ధనుంజయ పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఎన్నికల్లో టిడిపి, వైకాపా జోక్యం తగదు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 15: ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైకాపాల జోక్యం తగదని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖరరెడ్డి హితవు పలికారు. ఈ గుర్తింపు ఎన్నికలను అధికార, ప్రతిపక్ష హోదాలో ఉన్న ఈ రెండు పార్టీలు రాజకీయ వేదికలుగా మార్చుతున్నాయని, దీనివల్ల కార్మికుల ఐక్యతకు భంగం కలిగి స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటువేసే అధికారాన్ని కోల్పోతారని ఆయనన్నారు. సోమవారం స్థానిక పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్ ఆవరణలోని ఇయు కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గుర్తింపు యూనియన్ ఎన్నికలనేవి ఓ సంస్థకు చెందినవని, ఇక్కడ పోటీచేసే యూనియన్ల వెనుక రాజకీయ పార్టీలు, బలమైన కార్మిక సంఘాలున్నప్పటికీ వాటి జోక్యం ఉండదన్నారు. సాధారణ ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓట్లువేసే స్వేచ్ఛ ఇక్కడ ఉందని, అయితే ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల విషయానికొస్తే కార్మికుల సంక్షేమానికి ఏ యూనియన్ అయితే పాటుపడిందో దానికి స్వేచ్ఛగా ఓటువేసే అధికారం కార్మికుడికుందన్నారు. ఈ సమావేశంలో ఇయు రాష్ట్ర డెప్యూటీ జనరల్ సెక్రటరీ వైవి రావు, ఉపాధ్యక్షులు బర్మా ప్రభాకర్, కోశాధికారి టివి భవాని, జోనల్ కార్యదర్శి ఎండి ప్రసాద్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే వంశీపై అక్రమ కేసులు
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 15: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆయన తరపు న్యాయవాది తానికొండ చిరంజీవి ఆరోపించారు. రామవరప్పాడు వద్ద ఇళ్ల తొలగింపు వ్యవహారంలో రాస్తారోకో సందర్భంగా ఎమ్మెల్యే వంశీతో పాటు మరో 200 మందిపై పటమట పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెవెన్యూ అధికారుల విధులకు అడ్డుతగిలిన ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం ఇటు అధికార పార్టీలో ప్రభుత్వపరంగానూ వివాదంగా మారుతోంది. అయితే ఈ కేసులో పటమట పోలీస్టేషన్‌లో వంశీ లొంగిపోతారనే ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో ఆయన వ్యక్తిగత న్యాయవాది చిరంజీవి సోమవారం పటమట పోలీస్టేషన్‌కు వచ్చి కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ కాపీలు తీసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే పలుమార్లు ఆయన్ను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడం సరికాదన్నారు. పైగా ఎమ్మెల్యే పేదల పక్షాన నిలబడితే దాన్ని తప్పుగా చూపుతూ పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. వెంటనే ఈ వ్యవహారంలో కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. అదేవిధంగా కలెక్టర్ వైఖరిపై హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు చిరంజీవి వివరించారు.
ఎమ్మెల్యే వంశీ వ్యవహారంపై సిఎం సమీక్ష
విజయవాడ : శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌పై కేసు నమోదు వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయాలు చూపకుండా ఆక్రమణలను తొలగించవద్దని అధికారులను ఆదేశించారు. వంశీ వివాదంపై స్పందిస్తూ కలెక్టర్ బాబు.ఎ, ఎంపి కేశినేని నాని, వంశీ ముగ్గురూ ఒకచోట కూర్చుని చర్చించుకుని వివాదాన్ని వెంటనే పరిష్కరించుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 15: నవ్యాంధ్రప్రదేశ్‌లో 2019 జాతీయ క్రీడలు నిర్వహించేందుకు జాతీయ ఒలంపిక్స్ అసోసియేషన్ అంగీకరించిన విషయం విదితమే. ఈ క్రీడోత్సవ నిర్వహణ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపడంతో ఆటు నిర్వహణ ఏర్పాట్లపై చర్చించడానికి కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్‌తో శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ సోమవారం సమావేశం కావడం జరిగింది. క్రీడల నిర్వహణకు అ వసరమైన సహాయ సహకారాలు అందించడంతోపాటు కార్యక్రమం విజయవంతానికి అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తామని మంత్రి సోనోవాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార 2003లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఇప్పుడు అదే స్ఫూర్తితో ఏపిలో 2019లో జాతీయ క్రీడలను విజయవంతం చేస్తామని తెలిపారు.

అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధికి
రూ. 379 కోట్లు కేటాయింపు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 15: నవ్యాంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 379 కోట్ల రూపాయల నిధులను అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి కేటాయించారని ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్ తెలిపారు. స్థానిక ముఖ్యమంత్రి కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థుల ఉపకార వేతనాలకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రానున్న కాలంలో మసీదులు, షాదీఖానాల నిర్మాణానికి, సమాధి స్థలాల్ని మెరుగుపరచడానికి తగిన నిధులు సమకూరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఎపి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.125కోట్లు మంజూరు చేశారన్నారు. ఉర్దూ అకాడమీలో సిబ్బందికి జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందనే సమస్యను సిఎం దృష్టికి తెచ్చామని, దానికి ఆయన సానుకూలంగా స్పందించి ఉర్దూ అకాడమీని ఆర్థికంగా పరిపుష్టం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
త్వరలో 4శాతం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో వాదనలకు రానుందని, కనుక అనుభవజ్ఞులైన, న్యాయనిపుణులైన న్యాయవాదులను నియమించాలని ముఖ్యమంత్రిని కోరామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని షరీఫ్ తెలిపారు. హజ్ కమిటీ భవనాలను కడప, హైదరాబాద్‌లో కట్టడానికి సిఎం సుముఖత వ్యక్తం చేశారని షరీఫ్ తెలిపారు. ఈ నెల 11న రాష్ట్ర ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో మైనార్టీ పెద్దలు హైదరాబాద్‌లో సమావేశమై వివిధ సమస్యలపై చర్చించినట్లు షరీఫ్ వివరించారు.