అక్షర

శైలి, శాస్తర్రీతులపై విశిష్ఠ అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలుగు వచన శైలి’
-డా.యు.ఎ.నరసింహమూర్తి
వెల: రు.400.. పే: 818
ఆం.ప్ర. ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ

ఒక రచయిత తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పే రీతిని ‘శైలి’ అంటారు. రచయిత తన వ్యక్తిగతానుభూతులను తనదైన రీతిలో వ్యక్తీకరించడాన్ని శైలిగా చెప్పుకోవచ్చు. కొందరు యువ రచయితలు ప్రయత్నపూర్వకంగా ఇతర రచయితలకంటె భిన్నంగా కనిపించాలనే కోరికతో ప్రత్యేక ఆకర్షణతో కూడిన విపరీత శైలిని సృష్టిస్తారు. వీరే కాదు అనుభవజ్ఞులైన రచయితలు, సీనియర్ రచయితలు కూడా తమ ప్రత్యేకతను చాటుకునే వ్యామోహంలో పడి కొత్త శైలీ భేదాలను సృష్టిస్తూ ఉంటారు. వీరి ప్రయత్నాలు ఫలించి నవ్యధోరణులతో కూడిన శైలీ ధోరణులు సృజనాత్మక సాహిత్యంలో ప్రవేశించి కొత్త ధోరణులకు నాంది పలుకుతాయి.
మన పూర్వీకులు శైలిని హృదయంగమంగా, రమణీయంగా, సులభతరంగా ఉండాలని భావించారు. నన్నయనుండి నేటివరకు వివిధ ప్రక్రియలలో వచ్చిన సాహిత్యాన్ని కూలంకషంగా విశే్లషిస్తే సాహిత్య భాషలోను, శైలిలోను వచ్చిన అంతర్గత పరిణామాలు మనకు తెలిసి వస్తాయి. కావ్యభాష పద్యంనుండి వచనానికి తరలినా, వచనాన్ని గ్రాంథిక భాషనుండి వాచక భాషకు మళ్లించడానికి గిడుగు అవిశ్రాంత పోరాటం చేయాల్సి వచ్చింది. గ్రాంథిక శైలిని అనుసరించిన పండితులు కూడా లోకరీతిని మన్నించి, సరళ గ్రాంథికం నుండి వ్యావహారానికి మళ్లారు. తర్వాత కాలంలో మాండలిక భాష సాహిత్య భాషగా మలపడంతో ఇరవైయవ శతాబ్ది నాల్గవ పాదంనుండి తెలుగు భాషలో-శైలిలో పెనుమార్పులు వచ్చాయి. చదువరులు పెరిగిన కొలదీ భాష-శైలి మెరుగవుతూ ఉంటాయి.
రచయిత అభ్యాసం కొలదీ, అనగా రాసుకుంటూ పోతూ ఉంటే అతని రచనా విధానం మెరుగుపడుతుంది. ఆ ప్రయత్నంలోనే తనదైన శైలిని రూపొందించుకుంటారు. ఎన్నో ఏళ్లుగా రాస్తూ ఉన్నా తనదైన ప్రత్యేక శైలిని రూపొందించుకోలేకపోయిన రచయితలు ఉన్నారు. అలాంటివారి శైలిని నిరాడంబర శైలిగానో, నిరాలంకార శైలిగానో, సామాన్య శైలిగానో వ్యవహరిస్తుంటారు. ఒక ప్రతిభావంతుడైన రచయిత పుడతాడు. ఆయనతో ఒక కొత్త శైలి పుడుతుంది. కొద్దికాలమో, ఎక్కువకాలమో అది పాఠక లోకాన్ని ఆకర్షిస్తుంది. కొంతకాలానికి అది నలుగురు నడిచే దారిలో నలిగే దాకా, అదీ తన వైభవాన్ని చాటుకుంటునే వుంటుంది. ఇది ఒక పరంపర. ప్రతిభ ఉంటే పూర్వులను అధిగమించడమే.
విమర్శకులు వస్తువు, శిల్పము అని విభజించి విశే్లషించేటప్పుడు శిల్పంలో భాగంగా శైలిని విమర్శిస్తారు. శైలి అంటే రాసే విధానమా, ప్రత్యేకమైన భాషారీతియా అని తికమకపడే రచయితలు కూడా ఉన్నారు. అలాంటప్పుడు సృజనాత్మక రచయితలకు, ఇతర రచయితలకు శైలి అంటే ఏమిటి? దాని స్వరూప స్వభావాలు ఎటువంటివి? శైలిని గురించి తెలుసుకోవడంవల్ల ప్రయోజనం ఏమిటి? మంచి శైలిని అలవాటు చేసుకోవడమెలా? దానిని రూపొందించే లక్షణాలేమిటి? శైలీ దోషాలు ఎలా ఏర్పడతాయి? మొదలైన విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. సాహిత్య విద్యార్థులకు, సాహిత్యేతర రంగాలలో రచనలు చేసేవారికి శైలీ శిక్షణ ఇవ్వవలసిన అవసరాన్ని మనవాళ్లు ఇంకా గుర్తించలేదు. అందుకే తెలుగులో శైలిని గురించి, శైలీ శాస్త్రాన్ని గురించీ తెలియజేసే పుస్తకాలు లేవు. ఈ విషయమై సమగ్రమైన కృషి జరగవలసిన అవసరం ఉంది.
తెలుగులో శైలిని గురించిన వ్యాసాలు, శైలీ పాఠాలు రాసినవారు ఉన్నారు. పద్య శైలిని గురించి విశే్లషించిన ఆచార్యులు ఉన్నారు. ప్రత్యేకించి తెలుగు వచన శైలిని గురించి ఒక గ్రంథరూపంలో రాసిన వారు లేరు. తెలుగు విద్యార్థులకు వచన రచనలో తగిన శిక్షణను ఇవ్వడానికి, విస్తృతమైన అవగాహన కల్పించడానికి ఎంతో కృషి జరగవలసిన అవసరాన్ని గుర్తించి డా.యు.ఎ.నరసింహమూర్తి గ్రంథ రచనకు పూనుకున్నారు.
ఇందులో ‘శైలి-స్వరూప స్వభావాల’ను మొదటి అధ్యాయంలో, ‘శైలి-ప్రాచ్య పాశ్చాత్య భావనల‘ను రెండవ అధ్యాయంలో, ‘ప్రాచీన, అర్వాచీన శైలులు’ను మూడవ అధ్యాయంలో తెలియజేసారు. నాల్గవ అధ్యాయంలో ‘శైలి-ఆధునిక వచన రచయితలు’గా విశ్వనాధ, శ్రీపాద, కొ.కు, నామినిలను గుర్తించి వారి వచనా రీతులను వివరించిన విధానం బాగుంది. రచనాపరంగా కానీ, శైలిపరంగాకాని ఎలాంటి ప్రత్యేకతలు లేని నోరి నరసింహశాస్ర్తీ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీలను ఈ విభాగంలో కలపడం విడ్డూరం. పోరంకి దక్షిణామూర్తి, కేతు, చేకూరి, పి.సి.నరసింహారెడ్డిల సృజనాత్మక సాహిత్యాన్ని పక్కనపెట్టి వారిని భాషా శాస్తవ్రేత్తలుగా, వారు శైలీ శాస్త్రానికిచ్చిన ప్రతిపాదనలను వివరించడం కంటె, వారికి వేరే విభాగాన్ని ఏర్పరిచి వుంటే బాగుండేది. అయిదవ అధ్యాయంలో పరిశోధన పూర్వకంగా తెలుగు వచన శైలిలో 24 రకాల ‘శైలీ భేదాల’ను గుర్తించి ఉదాహరణ పూర్వకంగా వివరించడంలో రచయిత చూపిన సునిశిత పరిశీలన, పాండిత్య ప్రతిభ పాఠకులకు ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. అధివాస్తవిక శైలి, చైతన్య స్రవంతి శైలి, అస్తిత్వవాద శైలి, ఇంద్రజాల వాస్తవిక రాత శైలి, అసంగత శైలి, వినిల్మాణ శైలి అంటూ వాటిని ‘ప్రయోగవాద శైలి’ అనే ఆరవ అధ్యాయంలో విశే్లషించారు. తన వచనంతో తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన ఆరుగురు రచయితలను ‘ఆధునిక వచనా శైలీ నిర్మాతలు’గా గుర్తించి, వారి ప్రతిభా పాటవాలను ఏడవ అధ్యాయంలో తెలియజేసారు. ఎనిమిదవ అధ్యాయంలో ఏడుగురు పండిత కవుల వచన శైలిని విశే్లషిస్తూ వారిది ‘పండిత శైలి’గా పేర్కొన్నారు. తొమ్మిదవ అధ్యాయంలో, సంపాదకులుగా పాఠకుల అభిమానాన్ని చూరగొన్న నలుగురి వచనాన్ని ‘సంపాదకీయ శైలి’గా వివరించారు. పదవ అధ్యాయంలో గురజాడ నుండి పతంజలి వరకు ఏడుగురు హాస్య రచయితల శైలిని వివరిస్తూ దానికి ‘హాస్య శైలి’గా పేరుపెట్టారు. పదకొండవ అధ్యాయంలో మాండలిక రచయితలుగా గుర్తింపు పొందిన అయిదుగురు రచయితల వచన విన్యాసాన్ని ‘మాండలిక శైలి’లో చూడవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు. ‘శైలీ దోషాల’ను వివరించిన పధ్నాలుగవ అధ్యాయం మరో ఎత్తు.
గొప్ప రచయితలందరూ గొప్ప శైలీ నిర్మాతలు కారు. గొప్ప శైలీ నిర్మాతలందరూ గొప్ప రచయితలు కాలేరు. ఈ రెండు శక్తులకు తుల్య గౌరవాన్ని సాధించగలిగిన రచయితలు గొప్పవారు. అటువంటి గొప్ప రచయితలలో కొందరిని మాత్రమే ఎంపిక చేసుకుని వారి శైలీ లక్షణాలను, ఈ గ్రంథంలో నిరూపించదలుచుకున్నానని రచయిత వినయంగా చెప్పుకున్నారు. కాబట్టి ఇందులో లేనివారి గురించి తర్కించడం అనవసరం. పండిత విమర్శకుడిగా, పరిశోధకుడిగా యు.ఎ.నరసింహమూర్తి ప్రతిభకు, కృషికి గొప్ప ఉదాహరణగా ఈ గ్రంథం నిలిచిపోతుంది. శైలీ శాస్త్ర అధ్యయనంలో వచ్చిన ఏకైక గ్రంథంగా రెఫరెన్స్‌గా విద్యార్థులకే కాదు, రచయితలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

-కె.పి.అశోక్‌కుమార్