Others

తిక్క శంకరయ్య( ఫ్లాష్‌బ్యాక్@50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాట్ల వెంకట సూర్యనారాయణరాజు (డి.వి.ఎస్.రాజు) తూ.గో జిల్లా అల్లవరంలో జన్మించారు (1928లో). 1950 ప్రాంతంలో మద్రాస్ వచ్చి లిధోవర్క్ ప్రారంభించి, సినిమా పబ్లిసిటీ విభాగం నడిపారు. ‘పిచ్చిపుల్లయ్య’ నిర్మాణంలో ఎన్.టి.ఆర్‌తో ఏర్పడిన పరిచయంతో వారి ఎన్.ఏ.టిలో భాగస్వామిగా తోడుదొంగలు నుండి గులేబకావళి వరకూ కొనసాగారు. ఎన్‌టిఆర్ నటించిన ‘పెంకిపెళ్లాం’ చిత్రాన్ని తమిళంలో డబ్ చేశారు. ప్రగతి ఆర్ట్స్‌పై ఎఎన్‌ఆర్ హీరోగా ‘మా బాబు’ చిత్రం నిర్మించారు. 1963లో డి.వి.ఎస్ ప్రొడక్షన్స్ నెలకొల్పి తొలిసారిగా ‘మంగమ్మ శపథం’ (1965), పిడుగురాముడు (1966) జానపద చిత్రాలు ఎన్.టి.ఆర్ హీరోగా నిర్మించారు. 1968లో ఎన్.టి.ఆర్, కృష్ణకుమారి, జయలలితల కాంబినేషన్‌లో వీరు రూపొందించిన సాంఘిక చిత్రం ‘తిక్కశంకరయ్య’. దర్శకులు యోగానంద్. వీరు మద్రాసులో జన్మించి, కొంతకాలం బందరులో నివశించారు. తిరిగి మద్రాస్ వచ్చి రేడియో టెక్నాలజీ నేర్చుకొని, మరికొంతకాలం ఎడిటర్ మాణిక్యం వద్ద ఎడిటింగ్‌ను, దర్శకులు ఎల్.వి.ప్రసాద్ వద్ద దర్శకత్వపు మెళకువలు నేర్చుకొన్నారు. 1963లో తొలిసారి ‘అమ్మలక్కలు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. 20కిపైగా తెలుగు, 15 చిత్రాలకు దర్శకత్వం నిర్వహించారు. ఎన్‌టిఆర్‌తో తోడుదొంగలు మొదలుపెట్టి జయసింహ వంటి మహత్తర జానపద చిత్రాన్ని, వేములవాడ భీమకవి చారిత్రక చిత్రాన్ని, ఎఎన్‌ఆర్‌తో ‘పెళ్ళిసందడి, ఇలవేల్పు, మూగనోము’ వంటి హాస్య సాంఘిక చిత్రాలను సమర్థవంతంగా తీర్చిదిద్దిన దర్శకులు యోగానంద్.
తిక్క శంకరయ్య చిత్రానికి రచన: డి.వి.నరసరాజు, ఫొటోగ్రఫీ: జి.కె.రాము, ఎడిటింగ్: జి.డి.జోషి, శివమూర్తి, స్టంట్స్: స్వామినాధన్ అండ్ పార్టీ, కళ: తోట, నృత్యం: వెంపటి సత్యం, సంగీతం: టి.వి.రాజు, దర్శకత్వం: డి.యోగానంద్, నిర్మాత: డి.వి.ఎస్.రాజు.
రాఘవయ్య (నాగయ్య) మొదటి భార్య కూతురు సుశీల (కృష్ణకుమారి), రెండవ భార్య కాంతమ్మ (సూర్యకాంతం) కూతురు రాణి (జయలలిత). కాంతమ్మ పట్నంలో కోదండరామయ్య (డా.శివరామకృష్ణయ్య) కుమారుడు మోహన్ (ఎన్‌టిఆర్)తో రాణికి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది. మోహన్ వచ్చే దారిలో కారు ఆగిపోవటం వలన అనుకోకుండా సుశీలను చూసి ఇష్టపడతాడు. రాణిని చూసినా ఆమె గారాబం, అతిశయం నచ్చదు. ఆ ఊరి వడ్డీ వ్యాపారి, 3వ పెండ్లివాడు అయిన లింగరాజు (నాగభూషణం), రాఘవయ్యతో తనకు సుశీలను ఇచ్చి పెళ్లిచేయమని లేకుంటే వారి బాకీ కోసం ఇల్లు స్వాధీనం చేసుకుంటానంటాడు. కాంతమ్మ ఆ పెళ్లికి అంగీకరిస్తుంది. మోహన్ సుశీలకు ధైర్యం చెప్పి పట్నం వెళ్లి తన తల్లిదండ్రులకు విషయం తెలియజేసి, తాను సుశీలను ప్రేమించానని, ఆమెనే పెళ్లిచేసుకుంటానంటాడు. తండ్రి వ్యతిరేకించినా, తల్లి హేమలత తన నగలిచ్చి పంపుతుంది. మోహన్ వచ్చేసరికి సుశీల పెళ్లిపీటలమీదకి రాకుండా తప్పించుకుపారిపోతుంది. దేవయ్య (పద్మనాభం) అల్లురామలింగ్య (పురోహితుడు) కలిసి పనిమనిషితో లింగరాజు పెళ్లి మాయ చేసి జరిపిస్తారు. మోహన్, సుశీల పెళ్లి జరిగిపోయిందని విరక్తితో తిరిగి వెళుతూ హాస్పిటల్ పాలవుతాడు. కోలుకున్నాక అతన్ని కలిసిన సుశీల నిజం చెప్పినా నమ్మడు. సుశీల మోహన్ వదిలివెళ్లిన డబ్బు అతని తల్లిదండ్రులకిచ్చి, వారి ప్రేమను, ఆశ్రయాన్ని పొందుతుంది. పిచ్చి ఆసుపత్రి నుంచి తన పోలికలతో వున్న శంకరయ్య తప్పించుకోవటం, మోహన్ పిచ్చాసుపత్రికి చేరటం, శంకరయ్య రాణి వాళ్ళింటికి దేవయ్య ద్వారా వెళ్ళటం జరిగి, కథ అనేక మార్పులకు లోనై చివరకు శంకరయ్య పిచ్చి కుదరటం, మోహన్ లింగరాజుకు బుద్ధి చెప్పటం, సుశీల-మోహన్, రాణి-శంకరయ్యల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో మెంటల్ హాస్పిటల్‌లో పేషెంట్లుగా రేలంగి, రాజబాబు, రావికొండలరావు, డా.రామచంద్రరావు నటించారు.
ఎన్.టి.రామారావు మోహన్‌గా నెమ్మది, నిండుతనం ఎంతో హుందాగా ప్రదర్శిచటం, దానికి విరుద్ధంగా శంకరయ్యగా అగ్గిపుల్లను చేతిపై గీసుకోవటం, నూతిలో మూడుసార్లు పైకి క్రిందకి ప్రాకటం, హాస్పిటల్‌లో నాటకంలో రావణాసురునిగా, సుయోధనునిగా సన్నివేశానుగుణమైన సరదాను, తమాషాలను అటు రాణితో నృత్యంతో, ఇటు నటనతో ఆకట్టుకున్నారు. సుశీలగా కృష్ణకుమారి ఆ పాత్రకు తగ్గ సౌమ్యతను, అణకువను ఒప్పించేలా నటించగా, రాణిగా జయలలిత చురుకుదనాన్ని, గారాబాన్ని, అభిమానాన్ని, చలాకీతనంలోనూ మెప్పించింది. పాత్రోచితంగా మెప్పించే నటన అల్లు రామలింగయ్య, నాగభూషణానికి ధీటుగా ప్రదర్శించారు.
ఇక దర్శకులు యోగానంద్ అర్థవంతమైన కథకు చక్కని కామెడీని జతకూర్చి, సన్నివేశాలను తీర్చిదిద్దటం, శంకరయ్య పాత్ర ప్రవేశం తరువాత చిత్రం జోరు పెరగటం, మెంటల్ హాస్పిటల్‌లో రామాయణంలో, భారతాన్ని కలపటం, శంకరయ్య ఎంతో సీరియస్‌గా రాణి వెంట పరుగెత్తి బుగ్గమీద మసిని తుడవటం, ఇక హీరో మోహన్ విలన్ నాగభూషణంతో కాక బలమైన అతని అనుచరునితో యుద్ధం చేయటం, ఎంతో అమాయకురాలైన సుశీల, లింగరాజు నుండి తప్పించుకునే యత్నంలో బండి వేగంగా నడపటం, ఇక ముఖ్యమైన సన్నివేశం లింగరాజుతో సుశీలకు పెళ్లి ఖాయం కాగానే సుశీల మదిలో ఒక కల. లింగరాజు చేతిలో తాళితో ఏడు ద్వారాలు, ఆమె పరుగెత్తటం, తాళి పాములా మారిపోవటం, సుశీల భయంతో పరుగు ఎంత వెరైటీగా చిత్రీకరించారు. అదే విధంగా చిత్రగీతాలను తొలుత ఎన్‌టిఆర్, కృష్ణకుమారిలపై యుగళగీతం ‘కోవెల ఎరుగని దేవుడు కలడని’ రాత్రి వెలుగులో తోటలో చక్కని కంపోజింగ్‌తో సాగుతుంది. (గానం- పి.సుశీల, ఘంటసాల, రచన- సినారె), జయలలిత, మోహన్ ముందు పాడే గీతం ‘ముచ్చట గొలిపే పెళ్లిచూపులకు’ (గానం పి.సుశీల), శంకరయ్య, రాణిలపై గీతాలు ‘ఐసరబజ్జా పిల్లమ్మా అరెరే బుల్లెమ్మా’, రెండవది ఇంటి పెరటిలో ‘యాస్కాడి తస్సాగొయ్యా, ఎలకేవో పిలదానా(ఘంటసాల, పి.సుశీల), జయలలితపై చిత్రీకరించిన జావళి నృత్య గీతం వగకాడ బిగువేలరా (పి.సుశీల) కృష్ణకుమారిపై చిత్రీకరించిన తొలి గీతం ‘తొలి కోడి కూసింది తెల తెలవారింది’ (పి.సుశీల)- పై గీతాలన్నిటి రచన సి.నారాయణరెడ్డి కాగా, మెంటల్ ఆసుపత్రిలో నాటకం ‘తారక మంత్రము కోరిన దొరికెను) (రచన కొసనాజు, గానం ఘణటసాల, కె.ఎన్.రాఘవన్, డి.రఘురాం, మాధవపెద్ది) టి.వి.రాజు సంగీతంతో తిక్క శంకరయ్య గీతాలు నేటికీ అలరించేలా సాగుతున్నాయి. ముఖ్యంగా ‘కోవెల ఎరుగని’ సాత్విక ప్రణయగీతం ముచ్చటగా సాగటం విశేషం.
‘తిక్క శంకరయ్య’ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడి సక్సెస్ సాధించింది. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ ప్రతిష్ఠకు ఇంకొంత వనె్నతెచ్చింది.

-సి.వి.ఆర్ మాణిక్యేశ్వరి