వినదగు!

బ్రహ్మత్వం-ఆత్మయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్రహ్మ భూయాయ కల్పతే’ - అంటూ ముగుస్తుంది భగవద్గీతలోని పద్దెనిమిదో అధ్యాయ యాభై మూడో శ్లోకం. ఈ శ్లోకంలో గీతాచార్యుడు బ్రహ్మత్వం సిద్ధించడానికి మానవ తత్వం నుండి తొలగవలసిన ఎనిమిది లక్షణాలను మన ముందుంచుతాడు. నిజానికి ఈ అష్ట అంశలే మానవ అస్తిత్వాన్ని ఎరుకపరుస్తుంటాయి. ఇవి లేనిదే మానవ అవతారం మనలేదు - అని అనిపిస్తుంటుంది.
‘అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్
విముచ్య నిర్మమః శాన్తో బ్రహ్మ భూయాయ కల్పతే’
అహంకారాన్ని విడనాడాలి. బలప్రదర్శన కూడదు. గర్వాతిశయం పనికిరాదు.. కామం కానరాకూడదు.. కోపం కనుమరుగవ్వాలి.. భౌతిక సంపదల మక్కువ ఉండకూడదు.. మమకార శూన్యత అవసరం. శాంతివర్తనం అతి ముఖ్యం. ఈ అష్ట దిగ్బంధనంతో స్థిర వర్తనం సాధ్యమైతే బ్రహ్మత్వం సిద్ధించినట్లే. మనమూ బ్రహ్మలం అయినట్లే. ఈ ఆత్మజ్ఞానానికి నిలువెత్తు ఆచరణ వర్తనమే బ్రాహ్మణత్వం... ఈ వర్తన ఫలసిద్ధే బ్రహ్మత్వం.
ఇక ‘అసక్తబుద్ధి’ ‘జితాత్మ’ ‘విగత స్పృహ’ అన్నవి బ్రాహ్మణత్వానికి నేపథ్యాలు. మనసును గెలవటం, ఆశల నుండి తిరోగమించటం సర్వత్రా అసక్త బుద్ధితో వర్తించటం.. సన్యసించిన జీవన విధానానికి ప్రతీకలు.. నైష్కర్మ్య సిద్ధికి తొలి సోపానాలు. ఈ నైష్కర్మ్య సిద్ధే బ్రహ్మత్వ సిద్ధి.
ఈ బ్రాహ్మణీకానే్న మరి కొన్ని విశేషణాలతో గీతాచార్యుడు ఇలా వ్యవస్థీకరిస్తున్నాడు.
‘బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ
శబ్దాదీన్ విషయాం స్త్యక్త్వా రాగద్వేషా వ్యుదస్య చ’
పరిశుద్ధ జీవనంతోనే బ్రాహ్మణీకం సాధ్యవౌతుంది. బుద్ధి పరిశుద్ధంగా ఉండాలి. పిరికితనంతో కాకుండా ధైర్యంతో అంటే ఆత్మవిశ్వాసంతో వర్తనం సాగుతుండాలి. పరుషోక్తులను, రాగద్వేషాలను విడనాడాలి. ‘యతవాక్కాయ మానసః’ అంటే మాట నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, మానసిక నిగ్రహం కలిగి ఉండాలి - ఇవన్నీ బ్రాహ్మణీక లక్షణాలే! బ్రహ్మత్వ సిద్ధికి భౌతిక జీవన సోపానాలే!
ఇలా బ్రహ్మభూతులం కాగలగటం అంటే - ప్రసన్నాత్మా - ప్రశాంత అంతఃకరణులై ఉండటం; న శోచతి - దుఃఖానికి ఆమడ దూరంలో ఉండటం, న కాంక్షతి - కోరికలు లేకుండటం, పెంచుకోకుండటం: సమః సర్వేషు భూతేషు - సర్వ ప్రాణులను సమంగా చూడటం.
* * *
‘యదహంకార మాశ్రీత్య నయోత్స్య ఇతి మన్యసే’ అన్నది కృష్ణ ఉవాచ. కృష్ణుడి దృష్టిలో అర్జునుడు యుద్ధం చెయ్యనన్న నిర్ణయానికి రావటమూ అహంకార చర్యనే. ఆ చర్య అహంకార పూరితం కాబట్టి నిస్సారమైనదిగానే పరిగణించవలసి ఉంటుంది. ప్రకృతి స్వభావం మన చేత కర్మలు చేయించక మానవు. అంటే ప్రకృతి సిద్ధ, స్వభావసిద్ధ కర్మలు ఆచరణ రూపం ధరించే తీరతాయి. దీనే్న కృష్ణుడు-
‘నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి
యన్మోహాత్కరిష్యస్య వశోపి తత్’
అని అంటాడు. స్వభావ కర్మాచరణ నుండి మనం తప్పించుకొనలేం. తెలివితక్కువతనంతోనో, అహంకారంతోనో కార్యాచరణ విషయంలో ఇష్టం లేకున్నా చేయక తప్పదు. అంటే ఎంతటి బుద్ధిపూర్వక, అహంకార జనిత చేతలతోనైనా స్వభావ కర్మను చేయక తప్పదు.
ఇలా - మోహం మృతం కావటానికి, స్మృతి స్థితం కావటానికే కృష్ణుడు పద్దెనిమిది అధ్యాయాల గీతోపదేశం చేశాడు - అర్జునుడికి - మనకు. ఇంతకీ - ఈ గీతాజ్ఞానం ‘గుహ్యాద్గుహతరం’ - రహస్యమైన దానికంటే రహస్యమైంది; ‘సర్వగుహ్యతమం’ - అన్నిటికంటే అతి రహస్యమైంది.
ఆత్మ ప్రకృతిని గురించి విశే్లషణాత్మకంగా, వివరణాత్మకంగా చెప్పటం భగవద్గీత ప్రత్యేకత. అసలు ఆత్మ ప్రకృతి అంటే స్వభావజనిత జీవనాన్ని సాగించటం. కర్మాచరణ, సన్యాస తత్వం, మోక్షత్వం - అన్నవి ఆత్మ ప్రకృతిలో మూడు పాయలుగా సాగాల్సిందే. ప్రాపంచిక జీవనంలో ఉంటూ స్వభావ జనిత కర్మ ఆచరిస్తూ, పార లౌకిక ధర్మబద్ధ జీవిక సాగించటమే ఆత్మయోగం అంటుంది భగవద్గీత. ఇలా కృష్ణ గీత పదార్థ, పరార్థ సంయోగ గీతగా ఆవిష్కృతమవుతోంది.
అస్తిత్వం - సృష్టి - జీవితం - కర్మ... ఈ నాల్గింటి మధ్యనున్న రహస్య ఒప్పందాన్ని బట్టబయలు చేసేదే కృష్ణ ఉవాచ. మానవ జీవన విధానాన్ని కర్మయోగంతో ముడిపెట్టిన రహస్య ప్రబంధం కృష్ణ గీత. మానవ అవతార అస్తిత్వ రహస్యాన్ని వెల్లడి చేస్తుండటం వల్ల భగవద్గీత గుహ్యతమమైంది. రహస్యం కాదంటూ, ఆత్మోద్ధరణ కార్యక్రమమే కర్మాచరణ విలసనం అంటూ స్పష్టం చేస్తుంటుంది ప్రతీ అధ్యాయం. ‘పరం’ పరలోనిదే మానవ అవతారం అంటూ మానవ జన్మ రహస్యాన్ని వెల్లడి చేస్తుంటుంది.
నిజానికి ఆత్మానే్వషణలోని జీవన సంవిధానమే కర్మ ప్రమేయం. కర్మయోగంతోనే మానవ జీవితం పూర్ణయోగమవుతుంది. ఈ దిశగా కర్మాచరణ విషయంలోను, మోక్షత్వ విషయంలోను ప్రకృతి భాగస్వామ్యం ఎంతో ఉంది. ఆ ప్రకృతి నుండి పుట్టుకొచ్చిందే మన స్వభావం. కాబట్టి ఆత్మ ప్రమేయంతోనే మానవ జన్మకు పూర్ణత్వ సిద్ధి. స్వభావ జ్ఞానమే మానవ జ్ఞానం. స్వభావ సంఘర్షణకు లోనై ఉన్నంతకాలం పూర్వ ప్రకాశనం సాధ్యం కాదు. సంఘర్షణ తొలగాలంటే ప్రకృతిబద్ధం కావలసిందే. ఇక్కడ ప్రకృతిబద్ధం అంటే విశ్వధర్మాన్ని అనుసరించటం. సృష్టి ధర్మాన్ని ఔదలదాల్చటం.. స్వభావానికి స్థితత్వం కలిగించటం.
ఇంతకీ గీత చెప్పే కర్మాచరణ అంతా మానవ చైతన్య భూమికనే. మానవ చైతన్యం భ్రమాన్వితం కాకూడదనే చెప్తుంటుంది గీత. భ్రమించటం అంటే మరణ సదృశమే. అందుకే పూర్ణత్వానికి ‘స్మృతి’ అవసరం అనేది. ఇక్కడ స్మృతి అంటే నిత్య చైతన్యం. ఈ పరమ తత్వం మనలో నెలకొని ఉండటమే మన అంతరాత్మను అధిష్టించిన పరమాత్మ తత్వం.
పరమాత్మ తత్వాన్ని గిక పరిభాషలో పరవ పురుష తత్వం అంటాం. పురుష అన్న వెంటనే మరో స్ర్తి తత్వం ఉందని కాదు. పురుష తత్వానికి సహకరించేదే పోనీ పురుష తత్వాన్ని ప్రకాశింపచేసేదే ప్రకృతితత్వం. కాబట్టే ప్రకృతిని శక్తి లేదా ఫోర్స్ అంటుంటాం. ఈ శక్తి పురుష తత్వానికి ఆలంబనమైన ఆత్మ వశం కాక ఇంద్రియ వశం మనస్సు వశం అయినప్పుడు మన జీవనం సంఘర్షణకు నిలయ మవుతుంటుంది. ఈ ఇంద్రియాలు మనస్సు కూడబలుక్కుంటే పుట్టుకొచ్చే శక్తే ‘అహంకారం’. ఒక విధంగా అహంకారానికి ప్రతిరూపమే ‘కర్మ’ కూడా.
అహంకారం అనేది బుద్ధిమాంద్యతనే! తెలివి కప్పడిపోవటమే!! ఫలితం తప్పుత్రోవ పట్టడం... అపార్థానికి లోనుకావటం... కార్యనిర్వహణలో వెనకబడటం.. నిర్ణయ సామర్థ్యం లోపించటం - ఫలితం కర్మాచరణలో ‘్ఫల్స్ ఐడెంటిఫికేషన్’. ఈ కర్మ సిద్ధాంతం అర్థంకాక మనం పూర్వజన్మల నుండి పరజన్మల వరకు పేరుకుపోతాం.
ఇలా పేరుకుపోయినదంతా ఉపకరించే సంపద కాదు. నిజానికిది సంకుచిత వలయం. ఇదే మాయ. కర్మకు అడ్డు తగిలే మాయామేయ జగత్తు ఇదే! ఈ వలయం నుండి బయటపడటానికి బాహ్య, ప్రాపంచిక, పదార్థ ప్రేరణలు సరిపోవు. అంతఃప్రేరణ, ఆత్మస్పందన అవసరం. ప్రాపంచికాన్ని నమ్ముకున్నంత కాలం మనం వడలిపోతుంటాం.. అంతఃచైతన్యాన్ని విశ్వసిస్తేనే ఉన్నతి సాధ్యమయ్యేది. సిద్ధిని పొందగలిగేది.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946