విజయనగరం

భారీవర్షాల కోసం రైతుల ఎదురుచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 22: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 45 రోజులు కావస్తున్నా భారీ వర్షాల జాడ లేకపోవడంతో జిల్లా రైతులు దిగాలు పడుతున్నారు. జూన్‌లో కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు ప్రారంభించిన జిల్లా రైతాంగం తరువాత వర్షాలు కురియకపోవడంతో పంటలు వేసే పనులను పక్కకు పెట్టవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కురిసిన వర్షాలను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవంగా కురవవల్సిన వర్షానికన్నా ఎక్కువ వర్షం నమోదైనట్లు అధికారుల రికార్డులు చెబుతున్నా, వర్షానికి.. వర్షానికి మధ్య వ్యవధి ఎక్కువ(డ్రైస్పెల్)గా ఉండడంతో రైతులు పంటలు వేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
జూన్‌లో కురిసిన వర్షాలు రైతులకు ఒకింత సంతృప్తిని ఇచ్చాయి. జూన్‌లో 128.4 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 182.7 వర్షం నమోదైంది. కానీ జూలై నెలకు వస్తే 100 మిల్లీమీటర్ల వర్షం కురియవల్సి ఉండగా, ఇప్పటివరకు 86.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే నమోదైంది. జూన్‌లో 16 రోజులు వర్షం కురియగా, జూలైలో ఏడురోజులకే పరిమితమైంది. ఇప్పటివరకు కురిసిన వర్షాల ఆధారంగా అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం జిల్లాలోని సాలూరు, పాచిపెంట, గంట్యాడ మండలాలలో ఇప్పటికీ తక్కువ వర్షం కురిసింది. సాలూరు మండలంలో 272.9 మిల్లీమీటర్ల వర్షం కురియవల్సి ఉండగా 184 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే నమోదైంది. పాచిపెంట మండలంలో 251.4 మిలీమీటర్ల వర్షం కురియవల్సిఉండగా 195 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే నమోదైంది. గంట్యాడలో 274.6మిల్లీమీటర్ల వర్షానికి 181 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 14 మండలాలలో సాధారణ వర్షపాతం నమోదుకాగా, మిగతా 17 మండలాలలో ఎక్కువ వర్షాలు కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. సీజన్‌లో ఇప్పటి వరకు వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ వ్యవధి (డ్రైస్పెల్) ఉండడంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరంగా చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది.
ఫలితంగా జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 24శాతం పంట భూములలో రైతులు ఆయా పంటలు వేయగలిగారు. ఖరీఫ్‌లో జిల్లాలో 1.19 లక్షల హెక్టార్లలో వరిపంట వేయవలసి ఉండగా, ఇప్పటివరకు ఈ పంట విస్తీర్ణం రెండున్నర వేలకు దాటలేదని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో వరిపంట ఎక్కువగా చెరువులు, కుంటల కింద సేద్యం అవుతుండగా వర్షాలు సంతృప్తికరంగా కురవకపోవడంతో చాలా చెరువులకు నీరందని పరిస్థితి ఏర్పడింది. వరి పంట వేసేందుకు రైతులు దుక్కులు దున్నుకుని, వరినార్లు వేసుకుని భారీ వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. చెరకు పంట విస్తీర్ణం మాత్రం సంతృప్తికరంగా ఉందని చెప్పవచ్చు. 15,451 హెక్టార్లలో ఈ పంట వేయవల్సి ఉండగా 11,582హెక్టార్లలో వేశారు. పత్తిపంట 14,597 హెక్టార్లలో వేయవల్సి ఉండగా 9463 హెక్టార్లలో వేశారు. వేరుశెనగ సాధారణ విస్తీర్ణం 9625హెక్టార్లుగా నిర్ధారించగా ఇప్పటి వరకు 1718హెక్టార్లలో ఈ పంటను రైతులు వేశారు. జిల్లావ్యాప్తంగా 8910 హెక్టార్లలో గోగుపంట వేయవల్సి ఉండగా 2507 హెక్టార్లలో మాత్రమే వేయగలిగారు. రాగి పంట 1863హెక్టార్లకు 168 హెక్టార్లలో మాత్రమే ఇప్పటికి వేశారు. 4219హెక్టార్లలో పప్పు ధాన్యాలు పండించాలని లక్ష్యంగా తీసుకోగా, ఇప్పటికి 746 హెక్టార్లలో మాత్రమే ఈ పంట వేశారు. 143హెక్టార్లలో వేసే మిరపపంట ఈ సీజన్‌లో ఇప్పటికి 43హెక్టార్లకే పరిమితమయింది. జూలై, ఆగస్టు నెలల్లో భారీవర్షాలు కురిస్తేనే లక్ష్యం మేరకు పంటలు పండించేందుకు అవకాశాలు ఉంటాయని రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.