విజయనగరం

పచ్చ చొక్కాలకే సంక్షేమ పథకాలు పరిమితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 30: రెండేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పచ్చచొక్కాలకే పరిమితం అవుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో ప్రజలకు లెక్కకు మించి హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రజలను దగా చేశారని విమర్శించారు. విజయనగరం పట్టణంలోని తోటపాలెం బాలాజీనగర్‌లో నిర్మించే జిల్లా కాంగ్రెస్ కార్యాలయ భవనానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో రాష్టవ్య్రాప్తంగా అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ కమిటీల ద్వారా అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు దక్కాయని, కానీ టిడిపి అధికారంలోకి రాగానే పచ్చచొక్కాల వారితో జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేసి తమ వారికి మాత్రమే ప్రయోజనాలు కల్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన పాపమంతా కాంగ్రెస్ పార్టీదేనని టిడిపి, బిజెపిలు ఆరోపణలు చేస్తున్నాయని, కానీ విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు, ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అంటూ తీర్మానం చేయటంతోపాటు విభజన తీర్మానానికి మద్దతు పలికిన బిజెపికి కూడా విభజన వ్యవహారంలో భాగస్వాములేనని అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి న్యాయం చేసేందుకు తీసుకోవల్సిన చర్యల విషయంలో అప్పటి యుపిఏ ప్రభుత్వం టిడిపి, బిజెపి తదితర ప్రతిపక్షాలను చర్చలకు ఆహ్వానిస్తే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్చలకు డుమ్మా కొట్టాయని చెబుతూ, రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించింది టిడిపి, బిజెపిలేనని ఆరోపించారు. విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ఐదేళ్ల ప్రత్యేక హోదా ఇవ్వాలని యుపిఏ ప్రభుత్వం ప్రతిపాదిస్తే, పదేళ్లు ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసిందని, టిడిపి అధినేత చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి 15ఏళ్లు ఇవ్వవల్సిందేనని అన్నారని, తీరా అధికారంలోకి వచ్చాక టిడిపి, బిజెపిలు ప్రత్యేకహోదాను పక్కన పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా లభిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని కాదనే విధంగా వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని అన్నారు. ప్రత్యేక హోదా కోసం గడచిన రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టిందని, చివరకు ఇటీవల పార్లమెంటులో ప్రైవేటు బిల్లును కూడా ప్రవేశపెట్టిందని చెబుతూ, ఈ బిల్లుపై ఓటింగు జరగకుండా బిజెపి, టిడిపిలు కుట్రపూరితంగా వ్యవహరించి రాష్ట్రానికి హోదా దక్కకుండా చేశాయని ఆరోపించారు. విభజన సందర్భంలో టిడిపి, బిజెపిలు అనుసరించిన వైఖరి, ఇప్పుడు ప్రత్యేకహోదా దక్కకుండా చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.
భావోద్వేగంతో వెళ్లిన వారు పార్టీలోకి మళ్లీ వస్తారు
విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు భావోద్వేగంతో పార్టీని విడిచి ఇతర పార్టీల్లో చేరారని, కానీ వాస్తవాలను, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నాయకులు కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తారనే ధీమాను రఘువీరా వ్యక్తం చేశారు. పార్టీనుంచి ఎవరు వెళ్లిపోయినా బాధ పడేది లేదని, పార్టీలో చేరి సేవలు అందించేందుకు కొత్తరక్తం సిద్ధంగా ఉందని, వీరి సహాయంతో 2019నాటికి పార్టీని పూర్తిస్థాయిలో పటిష్టం చేస్తామని తెలిపారు. విభజన సమయంలో ప్రజలు ప్రతిపక్ష పార్టీల ప్రచారానికి నమ్మి కాంగ్రెస్‌ను ఓడించారని, తరువాత టిడిపి, బిజెపి ప్రభుత్వాలపై నమ్మకం కోల్పోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు మళ్లీ ఆదరిస్తున్నారని, ప్రత్యేకహోదా విష యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలు స్వచ్చంధంగా సంతకాలు చేయటం అందుకు నిదర్శనమన్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 30,40 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర సమస్యలపై చర్చించారని టిడిపి నేతలు గొప్పలు చెబుతున్నారని, కానీ సిఎం ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి ఒరిగింది ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రిని కూడా ఇన్నిసారు ఢిల్లీ చుట్టూ తిప్పించుకున్నది లేదని అన్నారు. ఎన్నికల సమయంలో తమకు అధికారం అప్పగిస్తే ఢిల్లీని మించిన రాజధానిని రాష్ట్రానికి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక హామీని పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జిలు విశ్వప్రసాద్, రాజేశ్వరరావు, ప్రభుత్వ మాజీ విప్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు పాల్గొన్నారు.