విజయనగరం

ఎండిపోతున్న పొలాలు... ఆందోళనలో అన్నదాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెర్లాం, ఏప్రిల్ 9: ఎండలు తీవ్రంగా కాయడంతో చెరువులు, బావుల్లో ఉన్న నీరు ఎండిపోవడంతో చెరకు, వరిచేలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో తెర్లాం, గంగన్నపాడు, నందిగాం, చిన్నయ్యపేట, లింగాపురం, అంట్లవార, నందబలగ, కుసుమూరు తదితర గ్రామాల్లో వేసిన రబి వరిచేలు ఎండిపోతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టామని, తీరా మరో 15 రోజుల్లో చేతికందాల్సిన పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయని రైతులు తెలిపారు. చెరువుల్లో నీరు ఉన్నంతవరకు కిరోసిన్, ఆయిల్ ఇంజన్లు సహాయంతో ఇంతవరకు పంటలు రక్షించుకోగలిగామని, ఈ మధ్యకాలం తీవ్రంగా ఎండలు కాయడంతో ఈ పంటలు ఎండిపోతున్నాయని వారు తెలిపారు. పంటపై పెట్టిన పెట్టుబడులు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదని ఆయా గ్రామాలకు చెందిన రైతులు లబోదిబోమంటున్నారు.

పిజి విద్యార్థి ఆత్మహత్య
విజయనగరం(టౌన్), ఏప్రిల్ 9: ప్రేమ విఫలమైందనే కారణంతో ఓ విద్యార్థి పట్టణ శివారు ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పోతాయవలస గ్రామానికి చెందిన వేళ్ల అశోక్(22) పట్టణంలోని ఎస్‌కె డిగ్రీ కళాశాలలో పిజి చదువుతున్నాడు. ఒక పక్క చదువు సాగిస్తూ ప్రేమలో పడ్డాడు. అయితే అతని ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో శుక్రవారం అర్థరాత్రి సమయంలో కాలేజీకి సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవంతిలో స్లాబ్‌కు కేబులు వైరుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఐమిస్‌యు అనే మెసేజ్ పంపి ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం స్థానికుల సమాచారంతో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రాధమిక దర్యాప్తులో ప్రేమ విఫలం కావడమే కారణంగా అనుమానిస్తున్నారు. వన్‌టౌన్ ఎస్సై రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

‘కొత్తవలస టిడిపి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం’
కొత్తవలస, ఏప్రిల్ 9: మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఎంపిటిసి సభ్యుడుర ఎల్లపు సూరిబాబు అసంతృప్తి వ్యక్తంచేసారు. శనివారం కొత్తవలస టిడిపి కార్యాలయంలో అర్బన్‌పార్టీ అధ్యక్షులు కొరుపోలు అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేవంలో వాడివేడి చర్చలు జరిగాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండగా ఇక్కడ కార్యకర్తలకు అన్యాయం జరగడమేమిటని సూరిబాబు పార్టీ పెద్దలను ప్రశ్నించారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ కాంగ్రెస్, వైసిపి పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలకు లబ్దిచేకూరుతోందని చెప్పారు. పెద్దల మనస్సు మారకపోతే మండలంలో పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. వైస్ ఎంపిపి రాజన్న మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీ బలోపేతం చేయాలని చెప్పారు. ప్రజా సమస్యలు కార్యకర్తల ద్వారా పార్టీకి చేరాలని అన్నారు. కార్యకర్తలకు శిక్షణ ఉంటుందని చెప్పారు. కొత్తవలసలో పార్టీ కార్యాలయానికి ఒక శాస్వత భవనం కావాలని తీర్మానం చేసారు. ప్రభుత్వం చేస్తున్న సేవలను సంక్షేమ పథకాలను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకెళ్లాలని కోరారు. కోళ్ల శ్రీను, కొరుపోలు అప్పారువులు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోపాటు నేతలు పాల్గొన్నారు.

మాలమహానాడుచే
11న ముఖ్యమంత్రికి సన్మానం
విజయనగరం(టౌన్), ఏప్రిల్ 9: ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్ అమలుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషిని మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి లోగిశ రామకృష్ణ అభినందించారు. శనివారం అంబేద్కర్ కూడలిలోని అంబేద్కర్ భవనంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రిని ఆయన ప్రశంసించారు. రాష్టక్రమిటీ నిర్ణయం మేరకు విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిని సన్మానించే కార్యక్రమానికి ఎస్సీలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈసమవేశంలో జిల్లా కమిటీ నాయకులు గురుమూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బకు వృద్ధురాలి మృతి
మెరకముడిదాం, ఏప్రిల్ 9: మండలంలో గల మేజర్ పంచాయతీ గర్భాంలో శనివారం ముగవాపు దాలెమ్మ (70) అనే వృద్ధురాలు వడదెబ్బకు మృతి చెందింది. మృతురాలి కుమారుడు ముగవాపు తాతారావు అందించిన వివరాలు ప్రకారం శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయిందని, శనివారం ఉదయం ఎప్పిటిలాగే లేచి తన కాలకృత్యాలు తీర్చుకున్న ఆమె ఎండ వేడికి తాళలేక కుప్పకూలి అక్కడికి అక్కడే మృతి చెందిందని తెలిపాడు. తాతారావు ఫిర్యాదు మేరకు గర్భాం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది శవ పరీక్ష నిర్వహించారు. అనంతరం బుదరాయవలస ఎస్‌ఐ వి లక్ష్మణరావు గ్రామ పెద్దల సమక్షంలో శవ పంచనామ జరిపి అంత్యక్రియలు నిమిత్తం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ కేసును ఎస్‌ఐ అప్పలనాయుడు నమోదు చేసి దర్యాప్తు

సీతారాముల కల్యాణానికి
సర్వం సిద్ధం
నెల్లిమర్ల, ఏప్రిల్ 9:పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీరామ నవమి మహోత్సవాలు ఉగాది రోజున ప్రారంభించారు. ఉదయం ఆరు గంటలకు విష్వక్సేనారాధనము, అంకురారోపణం చేసారు. 7.30గంటలకు యాగశాలలో అగ్ని ప్రతిష్టాపనం చేసి ఐదు గంటలకు పంచాంగ శ్రవణం చేశారు. శనివారం 6.30గంటలకు మంగళశాసనం తీర్థగోష్టి ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు శ్రీమద్రామయాణ పారాయణాలు, సుందరకాండ పారాయణములు జరిపించారు. అలాగే లక్షతులసి, కుంకుమర్చానలు, యాగశాలలో గాయత్రీ రామాయణం జరిపారు. 15వ తేదీ శ్రీరామనవమి రోజున ఉదయం మూడు గంటలకు ఆరాధన, బాలభోగం, తీర్థగోష్టి, జరిపించిన అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు అత్యంత వైభవంగా పాలు, పెరుగు, తేనె, పళ్ల రసాలతో, సముద్ర జలాలతో అష్టకలశ స్నపన మహోత్సవం (అభిషేకం) చేస్తారు. ఉదయం 10.30గంటలకు స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిపిస్తారు.
స్వామివారి కల్యాణానికి దేవాదాయ శాఖమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు హాజరై పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ సహాయ కమిషనర్ పి.బాబూరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

తూకంలో తేడాలకు చెక్
విజయనగరం(టౌన్), ఏప్రిల్ 9: వినియోగదారులకుమెరుగైన సేవలు అమలులో భాగంగా ఆర్‌అండ్‌బి రైతుబజారులో ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను ప్రవేశపెట్టారు. రైతుబజారులో సుమారు 100 మంది గుర్తింపు కార్డు కలిగిన రైతులు రోజు వారి కూరగాయాలు, ఇతర ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముతుంటారు. నిత్యావసరాలు అమ్మే షాపుల్లో ఇప్పటికే ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను అమలులోకి తెచ్చిన మార్కెటింగ్ శాఖ తాజాగా రైతుల భాగస్వామ్యంతో ఎలక్రానిక్ తూనిక యంత్రాలను ప్రవేశపెట్టారు. ఆకుకూరలు అమ్మే రైతులు మినహాయించి మిగిలిన కూరగాయలు, పండ్లు అమ్మకాలు సాగించే వారు ఖచ్చింతంగా ఎలక్ట్రానిక్ తూనికలు ద్వారానే కూరగాయలు అమ్మాలి. ఈనేపధ్యంలో సుమారు 75 మంది రైతులకు ఎలక్ట్రానిక్ తూనికలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. మందుకు వచ్చిన రైతులు సుమారు 35 మంది మూడువేల రూపాయల వరకు వెచ్చించి ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు కొనుగోలు చేసారు. ఎస్టేట్ అధికారి ఉమామహేశ్వరరావు ఆంధ్రభూమితో మాట్లాడుతూ ముందుగా ఎలక్రానిక్ తూనికలు కొనుగోలు చేసినవారికి రైతు బజారులోనే ఛార్జింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. త్వరలో పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వినియోగదారులకు తూకంలో ఎటువంటి తేడాలు రాకుండా సక్రమమైన తూకంతో వారికి వినిమయ వస్తువులు అందించాలనే ఉద్దేశంతోనే అమలులోకి రైతుల సహకారంలో తీసుకువచ్చామని వివరించారు. నిర్ధేశిత ధరలకు నిర్ణీత తూకం లభిస్తుందని ఎటువంటి మోసాలకు తావుండదని ఆయన తెలిపారు.

మార్కెట్ యార్డు స్థలంలో ఆసుపత్రి నిర్మాణం

చీపురుపల్లి, ఏప్రిల్ 9: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలన్న పాలకుల ప్రయత్నం త్వరలో కార్యరూపం దాల్చనుంది. చీపురుపల్లిలోగల వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేందుకు పాలక మండలి తీర్మానం చేసింది. స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించేందుకు బదులుగా ఎఎంసికి 15 ఎకరాల స్థలాన్ని గోదాములు, కార్యాలయ నిర్మాణానికి 50 కోట్లు ఎ ఎంసి అభివృద్ధి నిధులలో అధిక శాతం కేటాయించాలని తీర్మానం చేసారు. పట్టణంలోగల పాత గవిడ వీధిలో నడుస్తున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మార్కెట్ యార్డుకు తరలించి, మార్కెట్ యార్డుకోసం గరివిడి రోడ్డులోని 15 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవాలని తీర్మానం చేసారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో చర్చలు జరిపి వచ్చిన ఎ ఎంసి చైర్మన్ సీతారామరాజు ఇటీవల పాలక వర్గాన్ని అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం కూడా ఆమోదింపచేసారు. ప్రస్తుతం తమ ఆధీనంలో ఉన్న ఎఎంసి కార్యాలయ భవన నిర్మాణాల కోసం 15 ఎకరాల స్థలం కావాలని తీర్మానించారు. దీనిలో భవనాలు, వసతులు కల్పించిన అనంతరం ఇక్కడ స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి విడిచిపెట్టాలని తీర్మానించారు. మంత్రి కిమిడి మృణాళిని భర్త మాజీ ఎమ్మెల్యే గణపతిరావు తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చీపురుపల్లి సామాజిక ఆసుపత్రిని ఎఎంసికి (మిగతా 2వ పేజలో)

తరలించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ ఆసుపత్రి అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలోనే నాలుగు కోట్లు మంజూరు చేయడమే కాకుండా అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ 2014 ఫిబ్రవరి 2న శంఖుస్థాపన చేసారు. ఈ నిధులతో అదనపు భవనాలు ఎక్కడ నిర్మించాలన్న అంశంపై గత రెండేళ్లుగా తర్జబర్జన పడుతున్నారు. గణపతిరావు అప్పట్లోనే ఈ ప్రతిపాదన చేసి పాలక వర్గంచేత ఆమోదింప చేసారు. ఇక్కడ సౌకర్యాలు లేవన్న కారణంతో ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆయన సూచించడంతో పాలక వర్గం యదాతదంగా తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎఎంసిలో సౌకర్యాలు లేనందున కమిటీ తీర్మానం చేసింది. ఈ మేరకు మార్కెట్ యార్డును వేరే ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అగ్నిమాపక కేంద్రానికి సమీపంలో 15 ఎకరాల ప్రభుత్వ స్థలం కావాలని తీర్మానం చేసారు. జిల్లాకు రానున్న 50కోట్లలో ఎఎంసి అభివృద్ధికి సగభాగానికిపైగా తరలించడానికి కొత్త భవనాలు నిర్మించడానికి మంత్రి కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ స్థలానికి ఆనుకుని మంగపల్లిపేట గ్రామం ఉండడంతో ఎఎంసి స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలన్న ప్రతిపాదనకు ఆ గ్రామస్థులు అంగీకరిస్తారా లేద అన్నది ప్రశ్నార్థకం. చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న స్థలంలో అదనపు భవనాలు నిర్మించి ఆసుపత్రి ప్రస్తుత భవనాలను ఉపయోగిస్తే ఇటు ప్రభుత్వ ఆసుపత్రి అటు మార్కెట్ యార్డు యదావిధిగా కొనసాగేవి. కానీ పాలకుల ప్రతిపాదనతో ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్థలంలో ఐసిడిఎస్ నిర్మాణం చేపట్టి ఆస్థలం ఆసుపత్రికి ఉపయోగపడకుండా చేసారు. ఎఎంసి స్థలంలో ఆసుపత్రి నిర్మాణం జరగకపోతే ఆసుపత్రి అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది.