విజయనగరం

పనులు జరగవు...అవస్థలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 6: పట్టణంలో అభివృద్ధి పనులు జరగకపోవడం వల్ల ప్రజలు అనేక అవస్ధలు పడుతున్నారు. కోట్లాది రూపాయలతో ప్రతిపాదించిన పనులు కూడా సక్రమంగా జరగడంలేదు. పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ దృష్టి సారించకపోగా, ఈ పట్టణానికి చెందిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఎమ్మెల్యే మీసాల గీత కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పట్టణంలో రెండేళ్ల క్రితం 57.96 కోట్ల రూపాయలతో 652 అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఇందులో అనేక వార్డులలో ఇంకా పనులు ప్రారంభం కాకపోగా, కొన్ని వార్డులలో ప్రారంభించిన పనులు నత్తనడకగా జరుగుతున్నాయి. గత రెండున్నరేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ సాధారణ నిధులు, వివిధ గ్రాంట్లద్వారా రోడ్లు, కాలువలు, కల్వర్టు నిర్మాణానికి 17.82 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన 439 పనులలో ఇంకా 350 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నా ఎటువంటి ప్రయోజనం కనిపించడంలేదు. 2015-2016లో జనరల్ ఫండ్స్ నుంచి 15.69 కోట్లతో ప్రతిపాదించిన 208 పనులలో సగం పనులు పూర్తికాలేదు. అలాగే 2016-2017లో జనరల్ ఫండ్స్ ద్వారా 2.12 కోట్లతో ప్రతిపాదించిన 18 అభివృద్ధి పనులకు అతీగతీ లేదు. బిఆర్‌జిఎఫ్‌ద్వారా 3.48 కోట్లతో నిర్ణయించిన 65 అభివృద్ధి పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. అదేవిధంగా 13వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 8.3 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధుల కింద 9.5 కోట్లు, నాన్‌ప్లాన్ గ్రాంట్లు ద్వారా 9.45 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన పనులు కూడా ముందుకు సాగడంలేదు.
ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన పనులు తీర్మానాలకే పరిమితం అవుతున్నాయి. పట్టణంలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారుచేసిన మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం 235 పనులను ఆన్‌లైన్ చేశారు. మిగతా పనులు ఏస్థాయిలో ఉన్నాయో ఎవరికీ తెలియడంలేదు. ఆన్‌లైన్ చేసిన పనులలో 35 పనులను నిర్ణీత గడువులోగా ప్రారంభించని కాంట్రాక్టర్లకు సంజాయిషీ నోటీసులను మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు జారీ చేశారు. మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా, కేవలం ఆరుగురు మాత్రమే కాంట్రాక్టర్లు ఉండటంతో అభివృద్ధి పనులలో ఏమాత్రం పురోగతి కనిపించడంలేదు. ప్రధానంగా రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేనివిధంగా విజయనగరం మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల నిధులు మూలుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కేటాయించిన నిధులే కాకుండా మున్సిపాలిటీకి పన్నులు, ఇతర మార్గాల ద్వారా ప్రతీయేటా 27 కోట్ల రూపాయల మేరకు ఆదాయం వస్తోంది. అయినప్పటికీ అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసిన పనులకు కూడా మోక్షం కలగడంలేదు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల మధ్య సమన్వయం లోపం వల్ల అభివృద్ధి పనులలో జాప్యం జరుగుతోంది. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించడంలో పాలకవర్గసభ్యులు కూడా తగిన శ్రద్ద చూపడంలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.