విజయనగరం

ఏడో వార్డులో టిడిపి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, ఏప్రిల్ 11: పార్వతీపురం మున్సిపాలిటీలోని ఏడో వార్డుకు జరిగిన ఎన్నికలో కౌన్సిలర్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన కోమటి వెంకటరావు(చిన్న) 187 ఓట్లు మెజారిటీతో గెలుపుపొందారు. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో ఈవార్డు ఎన్నికల లెక్కింపు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం 771 ఓట్లు పోలవగా ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి వెంకటరావుకు 403 ఓట్లు వచ్చాయి. వైకాపాకు చెందిన కొండపల్లి బాలకృష్ణకు 216 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యిర్థికి రెయ్యి గుంపస్వామికి రెండు ఓట్లు, సిపిఐకి చెందిన గొడబ మురళీకృష్ణకు 27 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ముప్పర్తి కనకరాజుకు 123 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందిన టిడిపి అభ్యర్థి కోమటి వెంకటరావుకు మున్సిపల్ కమిషనర్ సర్ట్ఫికెటు కూడా అందజేశారు. పార్వతీపురం మున్సిపాలిటీలోని ఏడోవార్డు తమ అభ్యర్థి కైవసం చేసుకోవడంతో ఆపార్టీ నేతలంతా సంబరాలు చేసుకుని స్వీట్లు పంచారు. ఇదే వార్డులో కౌన్సిలర్‌గా ఉన్న తెదేపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీశ్వరరావు తన ప్రతిష్టను నిలుపుకున్నట్టయింది. ఈ సందర్భంగా టిడిపి కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులనుద్ధేశించి జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీశ్వరరావు మాట్లాడుతూ వైకాపా నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టినా వారు దేనికి లొంగకుండా తమ అభ్యర్థికి గెలిపించడంపై హర్షం వ్యక్తం చేశారు.
టిడిపి అధ్యక్ష పీఠంపై
తర్జనభర్జన!
* కాపులకు కట్టబెట్టాలని డిమాండ్

విజయనగరం, ఏప్రిల్ 11: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం కసరత్తు మొదలుపెట్టారు. ఈ దఫా అధ్యక్ష పదవిని ఎవరికి కేటాయించాలనే విషయమై తర్జనభర్జనలు పడుతున్నారు. ప్రస్తుత టిడిపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈ దఫా ఈ పదవిని కాపులకు కట్టబెట్టాలని భావిస్తున్నారు. జిల్లాలో కాపు, వెలమలు మెజార్టీగా ఉండటంతో ఈ దఫా కాపులకు ఆ పదవి కట్టబెట్టాలని నిర్ణయించారు. దాంతోపాటు ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పార్వతీపురం డివిజన్‌కు చెందిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావుకు దక్కడంతో విజయనగరం డివిజన్‌లో అధిక సంఖ్యలో ఉన్న కాపులకు అన్యాయం జరిగిందని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పదవిని కాపులకు కట్టబెట్టాలని అధిష్ఠానంపై వత్తిడి తెచ్చిన విషయం విధితమే. దీంతో జిల్లా అధ్యక్ష పదవిని కాపులకు కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు పదవిపై ఆసక్తి చూపుతున్నారు. వీరిలో పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎ.నాయుడు, ఆయన సోదరుడు కొండపల్లి కొండలరావు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తదితరులు రేసులో ఉన్నారు. వీరిలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఆశీస్సులు ఎక్కువగా పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, ఎమ్మెల్యే మీసాల గీతకు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో వీరు నివాసం ఉండటం వల్ల వీరికి అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి జిల్లా అధ్యక్ష పదవి ఖరారయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
రోగులకు మెరుగైన సేవలే లక్ష్యం
* ఆరోగ్యమంత్రి కామినేని
జియ్యమ్మవలస/కురుపాం, ఏప్రిల్ 11: రాష్ట్రంలో రోగులకు మెరుగైన వైద్యసేవలందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం చినమేరంగిలో నూతనంగా నిర్మించిన 30 పడకల భవన నిర్మాణాన్ని మంత్రులు కామినేని శ్రీనివాసరావు, గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావులను ప్రారంభించారు. 227 లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన భవనాల్లోని పలువిభాగాలను మాజీమంత్రి శతృచర్లతో కలిసి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో రాష్ట్రంలో జరిగనన్ని అభివృద్ధి పనులు మరే రాష్ట్రంలో జరగలేదని కేంద్ర ప్రభుత్వమే పేర్కొందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నంతవరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రతీ ఆసుపత్రిలోను 40 రకాల ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అన్నివిభాగాల వైద్యాధికారులను నియమిస్తామని హామీ ఇచ్చారు. మందుల కొరత లేకుండా చూస్తామన్నారు. ప్రతీ ఆసుపత్రిలోను ప్రసవాలు జరిపించుకునేవారికి ఎన్‌టిఆర్. బేబీ కిట్లు, బసవతారకం తల్లి కిట్లు అందిస్తున్నామన్నారు. ఏజెన్సీలో పనిచేసే వైద్యులకు రెట్టింపు జీతాలు అందిస్తున్నామన్నారు. దీనదయాళ్ కోరినట్లుగా చివరి వ్యక్తికి ఫలాలు అందినప్పుడే అభివృద్ధి జరిగినట్లుగా చూస్తున్నామన్నారు. నీట్ ప్రవేశ పరీక్షలు కటాఫ్ మార్కుల విషయంపై పరిశీలనలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవసరమైన చోట్ల భవన నిర్మాణాలు చేపడుతున్నామని
డుతున్నామన్నారు. వీటిని నాణ్యతతో నిర్మించాలని, లేకుంటే బిల్లులను నిలిపివేసి విజిలెన్స్‌కు అప్పగిస్తామన్నారు. నూతనంగా నిర్మించిన భవనాల ప్రాంగణంలో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. 108వాహనాల స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెడతామని, ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు శతృచర్ల విజయరామరాజు, గుమ్మడి సంధ్యారాణి, జడ్పి ఛైర్‌పర్సన్ స్వాతిరాణి, తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, మాజీ ఎమ్మెల్యేలు జనార్థనథాట్రాజ్, నిమ్మక జయరాజులు, దేశం పార్టీ నాయకులు డొంకాడ మంగమ్మ, శెట్టి పావని, ఉషాసరస్వతి, దత్తి కామేశ్వరి, గులిపల్లి సుదర్శనరావు, ఐ.టి.డి.ఏ. పి.ఓ. లక్ష్మీషా, ఆర్డీ ఓ గోవిందరావు, ఆసుపత్రుల డి.డి. ఉషశ్రీ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జ్యోతిరావు పూలే ఆశయాలు ఆదర్శం
* మంత్రులు సుజయ్, కామినేని

విజయనగరం, ఏప్రిల్ 11: మహాత్మ జ్యోతిరావు పూలేను అందరు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రులు సుజయ్‌కృష్ణ రంగారావు, కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమీపంలో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ పూలే 191 జయంతిని జరుపుకోవం ఆనందదాయకమన్నారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం బిసిల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. బిసి సంక్షేమశాఖ, బిసి కార్పొరేషన్ ద్వారా ఉపకార వేతనాలు, రుణాలు మంజూరు, ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకాల ద్వారా బిసిల అభ్యున్నతికి కృషి చేస్తుందని వివరించారు. మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ స్ర్తి విద్యను ప్రోత్సహించారని, ఆయన సతీమణి సావిత్రి పూలేకు విద్య నేర్పించి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారన్నారు. ఆనాడు సాంఘీక దురాచారాలను రూపుమాపడానికి ఎంతో కృషి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఎమ్మెల్యే మీసాల గీత, జెసి యుసిజి నాగేశ్వరరావు, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, డ్వామా పిడి ప్రశాంతి, జిల్లా బిసి సంక్షేమాధికారి హరిప్రసాద్, మార్కెటింగ్ ఎడి శ్రీనివాసరావు, బిసి నాయకులు ముద్దాడ మధు పాల్గొన్నారు.
వీరిది జీవన్మరణ సమస్య!
కురుపాం, ఏప్రిల్ 11: వీరివి నిజంగా శాపగ్రస్త జీవితాలే. నిత్యం మలేరియా మహమ్మారితో నరకయాతన అనుభవించాల్సిందే. వేసవి, వర్షాకాలం వచ్చిదంటే చాలు ఇక్కడ గిరిజనులు హడలెత్తిపోతారు. ఒకవైపు నీటి ఎద్దడి, మరో వైపు జ్వరాల దాడితో నలిగిపోవల్సిందే. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ గిరిజన గ్రామాల్లో వైద్య సౌకర్యాలు లేవడానికి ఈ గ్రామమే నిదర్శనం. ప్రతీ ఇంట్లో ప్రతీ ఒక్కరి ఒంట్లో మలేరియా భూతం తిష్టవేసి ఉంటుంది. ఎప్పుడు అవకాశం వస్తుందో కాటేద్దామని విషసర్పంలా చుట్టుకుపోతుంది. చావు, బతుకుల మధ్య ఊగిసలాడే ఈ గిరిజన గ్రామం పేరు గుమ్మిడిగూడ. పంచాయతీ కేంద్రంగా ఉన్న ఈ గ్రామంలో పూరిపాకల స్థానంలో పక్కా ఇళ్లు వెలిసినప్పటికీ గ్రామంలో ఉన్న మలేరియా భూతాన్ని తరిమికొట్టలేకపోతున్నారు. ఇటీవల గ్రామంలో పలువురికి మలేరియా సోకి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జ్వరంతో బాధపడిన ప్రతీ ఒక్కరికీ మలేరియా పాజిటివ్ రావడం విశేషం. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా కనిస్తుంది. కాలువల్లో మురుగునీరు చేరి దానిపై దోమలు కనిపిస్తాయి. గ్రామంలో ఉండే బోరు నుంచి వచ్చే నీరు కలుషితమైనదని వాడవద్దని హెచ్చరించినా మరే దిక్కు లేక వాటినే వినియోగిస్తున్నారు. ఇక్కడ నీరు, గాలి కలుషితం అన్నట్లుగా తయారైంది. ఇక్కడ గిరిజనులకు వ్యవసాయమే ఆధారం. వాటి పనులు చేయాలంటే జ్వరాలు అడ్డంకిగా మారుతున్నాయి. నెలలో సగం మంచంపైనే గడపాల్సి వస్తుందని గ్రామస్థులు చెబుతున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తే గాని మా బ్రతుకులు మారవని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి
* ఎమ్మెల్సీ కోలగట్ల

విజయనగరం, ఏప్రిల్ 11: జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల లేకపోవడం దురదృష్టకరమని ఉత్తరాంధ్ర వైకాపా కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. బ్లడ్‌బ్యాంక్ పనితీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లల వార్డు, ఆర్ధోపేడిక్ వార్డును సందర్శించి రోగులకు సరైన చికిత్స అందుతుందా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్లేట్‌లెట్స్ యూనిట్ ఉన్న ఎందుకు రోగులను విశాఖకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. గుండె, కాలేయం, కిడ్నీ వ్యాధి పరీక్షలకు అధునాతన యంత్ర పరికరాలు ఉన్నా ఆ పరీక్షలను ప్రైవేటు సంస్థకు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. దీనివల్ల ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ వసతులు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ట్రామాకేర్ లేకపోవడం వల్ల రోగులను విశాఖకు పంపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి 150 కిలోమీటర్ల దూరం నుంచి కూడా రోగులు వస్తున్నారని, అలాంటి ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు స్థలం అందుబాటులో ఉందా అని ఆసుపత్రి సూపరింటెండెంట్ సీతారామరాజును ప్రశ్నించారు. ఆయన స్థలం అందుబాటులో ఉందని వివరించారు. వైద్యకళాశాలను ప్రైవేటుకు అప్పగించే ఆలోచన ప్రభుత్వం చేసినప్పటికీ ఆ సంస్ధ నిర్మాణానికి తాత్సారం చేస్తుందన్నారు. 18ఏళ్లుగా పనిచేస్తున్న అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు పదోన్నతులు కల్పించలేదన్నారు. ఈయన వెంట మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణ, నడిపేన శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్లు రాజేష్, రాంపండు, పార్టీ నేతలు బొద్దాన అప్పారావు, అల్లు చాణక్య తదితరులు పాల్గొన్నారు.

ఈ నెలలో ఆస్తిపన్ను చెల్లిస్తే
ఐదు శాతం రాయితీ
* మున్సిపల్ కమిషనర్ నాగరాజు

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 11: మున్సిపాలిటీలో ఈనెలాఖరులోగా ఆస్తిపన్ను చెల్లిస్తే ఐదుశాతం రాయితీ ఉంటుందని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. అందువల్ల ఎక్కువమంది ఈ అవకాశాన్ని వినియోగించుకునే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆస్తిపన్ను వసూలుపై మంగళవారం తన ఛాంబర్‌లో మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారులతో కమిషనర్ నాగరాజు సమీక్షించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రెండు అర్థసంవత్సరాలకు సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే ఐదుశాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో ఆస్తిపన్ను వసూలు జరిగిందని, ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో పన్ను వసూలు చేయాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 51,368 అసెస్‌మెంట్‌దారులకు వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి పన్ను చెల్లింపుడిమాండ్‌నోటీసులను జారీ చేసే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత అర్థ సంవత్సరంలో నిర్థేశించిన పన్ను వసూలులో తప్పనిసరిగా 90శాతం పన్ను వసూలు చేయాలన్నారు.
ఆర్థిక సంవత్సరం గడువువరకు కాలక్షేపం చేయకుండా నిర్థేశించిన పన్ను వసూళ్ల లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌మేనేజర్ ఆనందరావు, మున్సిపల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు అప్పలరాజు, వినోద్‌కుమార్, అప్పయ్యశెట్టి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.