విజయనగరం

కార్యకర్తల సంక్షేమే టీడీపీ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, మే 26: కార్యకర్తల సంక్షేమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తుందని జెడ్పీటీసీ బండారు బాలాజీ అన్నారు. మండలంలోని గరుడబిల్లి గ్రామానికి చెందిన పిసిని రామారావు 2016లో మృతి చెందగా భార్య పిసిని నాగమణికి తెలుగు దేశం పార్టీ సంక్షేమ నిధి నుంచి ఆర్దికసాయం అందజేశారు. శనివారం గరుడబిల్లి గ్రామంలో రూ.25వేల రూపాయల చెక్కురూపేనా ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాడ్డి అప్పలనాయుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శనపతి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్దుల్లో సామర్ద్యం పెంపుకే వేసవి శిక్షణా తరగతులు
బొండపల్లి,మే 26: విదార్దులలో సామర్ద్యం పెంపుకే వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ప్రధం సంస్ద జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఆర్.సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలో దేవుపల్లి ప్రాధమిక పాఠశాలలో మూడు నుంచి ఐదు తరగతి విద్యార్దులకు కమాల్ పద్దతిలో బోధన ప్రారంభించారు. పిల్లలకు విద్యపై ఆసక్తి కల్పించేందుకు ఆట పాటల ద్వారా విద్యా బోధన చేపడుతున్నామని అన్నారు. జిల్లాలో 2396 ప్రాధమిక పాఠశాలలో గతంలో తర్ల్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని, వేసవి సెలవుల్లో మండలంలో దేవుపల్లి, బి.రాజేరు ప్రాధమిక పాఠశాలలో ప్రధమ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 11వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విద్యార్దులు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎ.అప్పలనాయుడు, మండల సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సరికొత్త ఓటరు జాబితాకు సమాయత్తం
గజపతినగరం, మే 26: సరికొత్త ఓటరు జాబితా తయారు చేయడానికి బి ఎల్ వోలు సమాయత్తం కావాలని విజయనగరం ఆర్డీవో జె.వి.మురళి ఆదేశించారు. శనివారం మండలంలోని మరుపల్లి గ్రామం పరిధిలో గల బాలాజీ పాలి టెక్నికల్ కళాశాలలో ఐదు మండలాలకు చెందిన బి ఎల్‌వోలు కు ఓటరు జాబితాపై ఒక రోజు శిక్షాణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఓటర్ల జాబితా తాజాగా రూపొందించాలని ఆదేశించారని చెప్పారు. 2019 జనవరి 4వతేదీనాటికి తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. అందులో బాగంగా ఈనెల 21వతేదీ నుంచి జూన్ 30వరకు ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. అయితే ఇటీవల ప్రకటించిన తుది జాబితా పత్రాలు ప్రింటింగ్ చేయడంలో ఆలశ్యానికి కారణమని చెప్పారు. ప్రతీ ఇంటికివెళ్లి కొత్త ధరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌లో పొందు పరిస్తే చెక్‌లిస్ట్ వస్తుందన్నారు. తరువాత మరల చెక్‌లిస్టుపై సంతకాలు స్వీకరించాలని చెప్పారు. ఎవరైనా మృతి చెందిన వారి పేర్లను కుటుంబ సభ్యులు, పంచాయతీ సిబ్బంది ధృవపత్రాలు చూపిస్తే జాబితాలో నుండి పేర్లు తొలగించాలని అన్నారు. అదేవిధంగా శాశ్వతంగా వలసలు ఎవరైనా వెళ్లినా వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశామని అన్నారు. తహశీల్దార్లు తరచు సమీక్షలు జరిపి బి ఎల్ వొలకు తగు సూచనలు, సలహాలు అందించాలని అన్నారు. గతంలో పట్టణ పరిధిలో పోలింగ్ కేంద్రానికి 1400 మంది, గ్రామీణ ప్రాంతంలో 1200 మంది ఓటర్లకు పోలింగ్ కేంద్రాలు ఉండేవని, భవిష్యత్తులో 1100 మందికి ఒకో పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు శిథిలావస్థలో ఉంటే మార్పు చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. సర్వే అనంతరం ముసాయిదా జాబితా పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచాలని ఆదేశించారు. ఏమైనా అభ్యంతరాలు వస్తే విచారణ జరిపిన అనంతరం తుది జాబితా ప్రకటిస్తామని అన్నారు. కార్యక్రమంలో గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, జామి తహశీల్దార్లు శేషగిరిరావు, కల్పవల్లి, బాపిరాజు, నీలకంఠరావు, ఎన్నికల ఉప తహశీల్దార్ వెంకటరావు, బిఎల్‌వొలు పాల్గొన్నారు.

నిరుపేదలకు ఆపన్నహస్తం
* ఓ హెడ్‌కానిస్టేబుల్ ఉధారత
గజపతినగరం, మే 26: గజపతినగరం పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పెదమజ్జిశ్రీను తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తన స్వగ్రామమైన బొండపల్లి మండలం కొండకిండాంలో ప్రభుత్వ పింఛన్ రాని ఇద్దరు వృద్ధులకు తానే నెలకు ఐదు వందల రూపాయల వంతున పింఛన్ అందజేస్తున్నారు. తొలిసారిగా ఇద్దరు వృద్ధులు పెదమజ్జి సూరి, మొయిద పైడితల్లికి శనివారం తొలినెల పింఛన్ ఐదు వందల రూపాయల వంతున అందజేశారు. ఈ విషయాన్ని హెడ్ కానిస్టేబుల్ శ్రీను శనివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఇక నుండి ప్రతి నెల ఐదవ తేదీ నాటికి ఇద్దరు వృద్ధులకు పింఛన్ మొత్తం అందజేస్తామని అన్నారు. అలాగే ఇటీవల తమ గ్రామంలో దేవుళ్ళు పేరిట ఒక కమ్యూనిటీ హాలు నిర్మించామని చెప్పారు. ఈ నిర్మాణాన్ని గ్రామంలో గల పెదమజ్జి బాబూలాల్,పెదమజ్జి తాతినాయుడులతో కలసి నిర్మించామని అన్నారు. అలాగే ఈ కమ్యూనిటీ హాలులో 40 మంది విద్యార్థులకు ఉచితంగా ఇద్దరు ఉపాధ్యాయులతో ట్యూషన్ చెప్పిస్తున్నామని చెప్పారు. ఈ ఇద్దరు టీచర్లకు ఏడాదికి 24వేల రూపాయలు చెల్లిస్తున్నామని అన్నారు. అలాగే హాలులో గ్రంథాలయ సదుపాయం కల్పించే ఆలోచన ఉందని అన్నారు.

విజన్ సెంటర్‌ను కొనసాగించాలి:సిఐటియు
నెల్లిమర్ల, మే 26: నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు అందించిన విజన్ సెంటర్‌ను పునరుద్ధరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ. జగన్మోహన్ రాజు డిమాండ్ చేశారు. శనివారం నేత్ర వైద్యశాలను తరలించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన శిబిరం నిర్వహించారు. ముందుగా జగన్మోహన్‌రావు నల్లరిబ్బన్లు అందించి నిరసన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా నేత్ర వైద్య సేవలు అందించిన విజన్ సెంటర్‌ను భోగాపురం తరలించడం అన్యాయమని అన్నారు. నెల్లిమర్ల, గుర్ల మండలాలకు చెందిన పేదలు, కార్మికులు, రైతులు వేలాది మంది నేత్ర వైద్యసేవలు పొందేవారని చెప్పారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విజన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, ఆ సెంటర్‌న ప్రభుత్వం నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న విజన్ సెంటర్‌ను తొలగించి ఇంకొక కేంద్రంలో ఏర్పాటు చేయడం దుర్మార్గమని అన్నారు. గత నాలుగు నెలలుగా నేత్ర వైద్యసేవలు నెల్లిమర్ల, గుర్ల మండలాలకు చెందిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విజన్ సెంటర్‌ను పునరుద్దరించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు స్పందించి విజన్ సెంటర్‌ను పునరుద్ధరించాలని కోరారు. అలా కాని పక్షంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కిల్లంపల్లి రామారావు, కనకల రాము, కిల్లంపల్లి రామకృష్ణ, వై ఎస్సార్ స్టేట్ యూనియన్ నాయకులు కంది శ్రీరాములు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్. చింతయ్య, మిమ్స్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎ.మధుసూధనరావు, థమరసింగి సర్పంచ్ బలిగట్టి వెంకటరమణ, గుర్ల, నెల్లిమర్ల మండలాలకు చెందిన నేత్ర రోగులు పాల్గొన్నారు.