విజయనగరం

ఇంత దారుణమైన అధికారులను ఎక్కడా చూడలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 21: విజయనగరం మున్సిపల్ అధికారుల పనితీరుపై డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కె.కన్నబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన అధికారులను ఎక్కడా చూడలేదని, ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ గోడలతో మాట్లాడుతున్నానంటూ అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో శనివారం పలువిభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధిలో ముందంజలో ఉండగా విజయనగరం మున్సిపాలిటీ వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి మున్సిపాలిటీల్లో జీవో నెంబర్ 279 అమలు చేస్తుంటే విజయనగరం మున్సిపాలిటీలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ జీవో అమలుపై సరైన ప్రణాళిక లేకపోవడం, అమలు గురించి సరైన సమాధానం చెప్పకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో ఈ జీవో అమలుపై పర్యావరణ ఇంజనీర్ సిహెచ్ వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో ఈ జీవోను అమలు చేయవలసిందేనని, ఈ జీవో ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు పూర్తిస్థాయిలో భద్రత ఉంటుందని, ప్రతీనెల అయిదవ తేదీలోగా వేతనాలు చెల్లించేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇటువంటి జీవోను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరమని అన్నారు. పారిశుద్ధ్య విభాగానికి చెందిన కార్మికులు మిగతా చోట్ల పని చేస్తే వెంటనే డిప్యుటేషన్ రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాల్‌ను ఆయన ఆదేశించారు. 42 మంది పారిశుద్ధ్య కార్మికులు పలువిభాగాల్లో పనిచేస్తున్నారని పర్యావరణ ఇంజనీర్ వెంకటరమణ చెప్పిన సమాధానంపై కన్నబాబు మాట్లాడుతూ వెంటనే వారందరినీ వారి స్థానాల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో జీవో 279 ప్రకారం కాంట్రాక్టు తీసుకున్న కృష్ణా కన్‌స్ట్రక్షన్ ప్రతినిధిని జీవో అమలుపై తీసుకుంటున్న చర్యలు ఏమిటి, ఇంతవరకు ఎంతమందికార్మికులను తీసుకున్నారు, జీవో అమలులో మీరు చేస్తున్న ప్రణాళిక ఏమిటి తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నబాబు ‘తమషా చేస్తున్నారా? యుజ్‌లెస్‌పెలో’ అంటూ మండిపడ్డారు. కృష్ణా కన్‌స్ట్రక్షన్ టెండర్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో అధికారులపై కూడా మండిపడ్డారు. మనస్సు పెట్టి పనిచేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అధికారులు, ఉద్యోగుల్లో జఢత్వం ఎక్కువగా ఉందని, పనిచేయాలనే తపన లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను సకాలంలో పూర్తిచేయకపోతే పబ్లిక్‌హెల్త్ విభాగానికి అప్పగిస్తామని ఆయన హెచ్చరించారు. మున్సిపాలిటీలో 89 కోట్ల రూపాయలతో 484 పనులను చేపట్టాలని ప్రతిపాదిస్తే 163 పనులు ప్రగతిలో ఉండగా, 150 పనులు ఇంకా ప్రారంభించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఇన్‌ఛార్జి మున్సిపల్ ఇంజనీర్ మత్స్యరాజును అడిగి తెలుసుకున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన విజయనగరం మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ లేకపోవడం దారుణమని చెప్పారు. అక్టోబర్ రెండవతేదీలోగా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మున్సిపల్ రెవెన్యూ వసూళ్లపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మీసాల గీత, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, మున్సిపల్‌కమిషనర్ టి.వేణుగోపాల్, అసిస్టెంట్‌కమిషనర్ కనకమహాలక్ష్మి, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శోభన్‌బాబు, హరిదాస్, డిప్యూటీ ఇంజనీర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక బాధ్యతగా మొక్కలు పెంపకం
* ఐసిడిఎస్ సిడిపివొ రమణమ్మ
గజపతినగరం, జూలై 21: సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కల పెంపకం చేపట్టాలని గజపతినగరం ఐసిడిఎస్ సిడిపివొ కె.రమణమ్మ కోరారు. శనివారం వనం-మనం కార్యక్రమంలో భాగంగా మండలంలోని మల్లునాయుడుపేట గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతున్నందుకు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నివారించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతోపాటు వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తలంతా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
ఆశాజనకంగా లేని ఖరీఫ్
గజపతినగరం, జూలై 21: ఈ ఏడాది రైతులకు ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా లేని పరిస్థితి నెలకొన్నది. సాధారణంగా ఈ ఏడాది వర్షాలు పడుతున్నప్పటికీ భారీ వర్షాలు పడిన సందర్భాలు లేవు. అలాగే వర్షం పడి కొన్నిరోజులు పాటు మళ్ళీ వర్షం జాడలేకపోవడంతో చెరువుల్లో నీరు చేరని పరిస్థితి నొలకొంటుంది. సాగునీటి కాలువ కింద సాగయ్యే గ్రామాల్లో మినహా మిగిలిన గ్రామాల్లో ఈ ఏడాది భారీ వర్షాలు పడి చెరువులు నిండితే తప్పా ఉభాలు జరిగే అవకాశం లేదు. గజపతినగరం సబ్ డివిజన్‌లో గజపతినగరం మండలంలోని వరి సాధారణ విస్తీరణం 3,500 హెక్టార్లు కాగా ఇంతవరకు బోర్లుకింద 50 ఎకరాల మినహా ఎక్కడా వరినాట్లు వేయలేదు. బొండపల్లి మండలంలో 3,600 హెక్టార్లు, దత్తిరాజేరు మండలంలో 2,800 హెక్టార్లు, మెంటాడ మండలంలో 3,200 హెక్టార్లలో వరిని సాగు చేయడానికి వరినార్లువేయడం జరిగింది. వరినాట్లు వేసి దాదాపు 20 రోజులు కావస్తున్నది. వరినార్లు వేయడం పూర్తయైనందున ఇక ఉభాలకు రైతులు సిద్దమవ్వాల్సి ఉన్నప్పటికీ మండలాల్లో ఏ ఒక్క చెరువు నిండని పరిస్థితి ఏర్పడింది. నాలుగు మండలాల్లో దాదాపు 1,200 చెరువులు ఉండగా వెయ్యి చెరువులకుపైగానే నీరులేని పరిస్థితి మరో పక్కా, ఉభాలకు సమయం దగ్గర పడడంతోపాటు వర్షం కూడా అరకొరగా పడడం,తుఫాన్లు వచ్చినా భారీ వర్షాలు పడకపోవడంతో ఉభాలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. వర్షాలు సకాలంలో పడకపోవడంతో పత్తిపంటతోపాటు మొక్కజొన్న పంటల సాగు సైతం ఈ ఏడాది సగానికి పైగానే తగ్గిపోయింది.