విజయనగరం

అడవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 19: జిల్లాలో అడవుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సూచించారు. అటవీ సంరక్షణ, వనసంరక్షణపై అటవీశాఖ అధికారులతో కలెక్టర్ నాయక్ తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అటవీసంపద తరలిపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, బిట్ అధికారులతో పర్యవేక్షణ జరపాలని, చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. సామాజిక వనసంరక్షణ కార్యాక్రమం క్రింద ప్రతి పాఠశాలలో మొక్కలు పెంచేందుకు స్కూల్ నర్సరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏప్రిల్ నెలఖారు నాటికి నూతన నర్సరీల ద్వారా 80లక్షల మొక్కల పంపిణీ పూర్తిచేయాలని, ఈ మొక్కలను వర్షకాలంలో జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికోసం అవసరమైన కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని అటవీ శాఖాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టెరిటోరియల్ డిఎఫ్‌ఓ రమణమూర్తి, సామాజిక ఆటవీ విభాగం డిఎఫ్‌ఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇ-ఆఫీస్ విధానం అమలుకు చర్యలు
జిల్లాల్లో అన్ని కార్యాలయాల్లో ఇ- ఆఫీసు విధానం అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నూతన మీటింగ్ హాలులో అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ మొదటి దశలో జిల్లావ్యాప్తంగా తొమ్మిది శాఖల్లో జిల్లాస్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఇ- ఆఫీస్ విధానాన్ని అమలు చేయడానికి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తొమ్మిది శాఖలకు సంబంధించిన అధికారులకు అవగాహన కల్పిస్తు రెవెన్యూ, డిఆర్‌డిఎ, డ్వామా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సివిల్ సప్లయ్, జిల్లాపంచాయతీరాజ్, ట్రెజరీ అండ్ అకౌంట్స్, డిఎస్‌ఓ, జిల్లాపరిషత్‌లు ఇ-ఆఫీసు విధానం అమలు చేయాలని తెలిపారు. ఈ శాఖలు బల్క్ ఇ-మెయిల్‌ను పొందేందుకు ఎన్‌ఐసి అధికారులకు నివేధించాలని అన్నారు. ఎంప్లాంయిస్ మాస్టర్ డైరెక్టరీని రూపొందించాలని, డిజిటల్ ఫారం సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇ-ఆఫీసు విధానం విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న కారణంగా ఎంపిక చేసిన ఆయా శాఖలు ఈ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని, ప్రతిశాఖ ఇ-ఆఫీసు పర్యవేక్షణకు ఒక నోడల్ అధికారిని నియమించాలని తెలిపారు. ఆయా శాఖల్లో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన ఇద్దరు అభ్యర్థులను మాస్టర్ ట్రైనీ శిక్షణకు పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర, జిల్లాపరిషత్ సిఇఓ రాజకుమారి, డిఆర్‌డిఎ పిడి డిల్లీరావు, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ రాజు, పౌరసరపరాల అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు
సాంకేతిక పరిజ్ఞానం

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 19: జిల్లాలో నేరాల నియంత్రణ విషయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం విజయనగరంతోపాటు జిల్లాలోని వివిధ పట్టణాల శివారులలో గస్తీని ముమ్మరంచేసి దొంగతనాలు, మహిళలపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో ఆయన నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గ్రేవల్ మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించే వ్యక్తుల గురించి ముందస్తు సమాచారం సేకరించి బెట్టింగులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో కోడిపందెలు, పొట్టెల పందెలు, పేకాట శిబిరాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహించాలని, వాహనదారులవద్ద అవసరమైన లైసెన్స్, ఇతర కాగితాలు లేకుంటే కేసులు నమోదు చేయాలని, హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపితే లైసెన్స్ సీజ్ చేయాలని తెలిపారు. ప్రత్యేక తనిఖీల ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ జరగకుండా చూడాలని చెప్పారు. పట్టణ ప్రాంతాలలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాలలో ప్రధాన కూడళ్లలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తు అతివేగంగా వాహనాలు నడపకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కల్తీమద్యం తయారీ, రవాణా, అమ్మకాలపై నిఘాపెట్టి నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి సత్వరం స్పందించాలని అన్నారు. ఈనెల చివరి వారంలో జరిగే శంభర జాతర సందర్భంగా పటిష్టమైన బందోబస్తుకు చర్యలు తీసుకోవాలని సబ్ డివిజన్ పోలీసు అధికారులను అదేశించారు. జాతర సందర్భంగా వివిధ జిల్లాల నుంచి భారీసంఖ్యలో భక్తులు హాజరవుతారని చెబుతూ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, దీనికోసం ముందస్తు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆదనపు ఎస్పీ రమణ, డిఎస్పీలు త్రినాథ్, ప్రవీణ్‌కుమార్, రమణ, రమణమూర్తి, రాజేశ్వరరావు, కృష్ణప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

పినవేమలిలో ఉద్రిక్తత
విజయనగరం(టౌన్), జనవరి 19: విజయనగరం మండలం పినవేమలి గ్రామంలో సోమవారం రాత్రి ఇరువురు వ్యక్తులపై కత్తితో దాడిచేసి గాయపరచిన ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో అప్పలనారాయణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతని మామ ఆదినారాయణకు స్వల్పగాయాలయ్యాయి. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. పినవేమలిలో అప్పలనారాయణకు కిల్లీబడ్డీవ్యాపారం ఉంది. దీనితోపాటు చికెన్ వ్యాపారం కూడా అక్కడే నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి అప్పలనారాయణ, ఆదినారాయణలు పనులు ముగించుకుని కిల్లీబడ్డీలో నిద్రించారు. మరునాడు మనమరాలి రజస్వల కార్యక్రమం ఉండటంతో, చికెన్ తయారుచేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఆ గ్రామానికి చుట్టంచూపుగా పండుగకు విశాఖనుండి వచ్చిన నాగరాజు అనే వ్యక్తి కిళ్లీ బడ్డీ వద్దకు వచ్చి తలుపు తట్టాడు. ఎవరు అంటూ బయటకు వచ్చిన ఆదినారాయణపైకి హఠాత్తుగా చికెన్ కొట్టే కత్తితో దాడిచేసాడని అప్పలనారాయణ తమ్ముడు పెంటయ్య వివరించాడు. తేరుకున్న ఆదినారాయణ సమీపంలో ఉన్న ఇంటికి వెళ్లి బంధువులను పిలుచుకుని వద్దామనుకునే లోపు అదే కత్తితో అప్పలనారాయణపైకి దాడిచేయడంతో తల, నడుము, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తమోడుతున్న అతన్ని, గాయపడిన ఆదినారాయణలను హుఠాహుటిన జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పలనారాయణకు అత్యవసర చికిత్స అందించి గాయాలకు సుమారు 750 కుట్లు వేసారని బంధువులు తెలిపారు. ఒక తలకే 500 కుట్లు పడ్డాయని అంతగా గాయపరిచాడని తెలిపారు. అతను ఎవరో తమకు తెలియదని అతన్ని పట్టుకుని గ్రామసర్పంచు సైలాడ గోవింద్ ద్వారా పోలీసులకు అప్పగించామని పెంటయ్య తెలిపాడు. పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదుతో రూరల్ సి ఐ రవికుమార్ అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసారు. నాగరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతనిపై హత్యయత్నం కేసు నమోదు చేసారు. అయితే అసలు గొడవకు సోమవారం ఉదయం ఆదినారాయణకు నాగరాజుకు 50 రూపాయల విషయంలో చిన్న తగాదా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బంధువులు మాత్రం అతనితో ఎటువంటి కక్షలు లేవని పోలీసులు విచారించి చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

ఆర్టీసీకి కాసుల సంక్రాంతి
విజయనగరం (్ఫర్టు), జనవరి 19: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపడంతోపాటు అదనపుఛార్జీలను వసూలు చేయడం ద్వారా ఆర్టీసీ విజయనగరం రీజియన్‌కు 6.72 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత ఏడాది సంక్రాంతితో పోల్చితే ఈ ఏడాది అదనంగా 80 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. దీనికి ప్రధాన కారణంగా అదనపుఛార్జీలు వసూలు చేయడమేనని ప్రయాణికులు అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాది ప్రజలు రాకపోకలు సాగించడం ద్వారా ఈ ఆదాయం వచ్చింది. ఈ రీజియన్‌లో రికార్డుస్థాయిలో సోమవారం ఒక్కరోజే కోటి 38 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ కార్యాలయం పర్సనల్ అధికారి ముత్తిరెడ్డి సన్యాశిరావు విలేఖరులతో మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను నడిపామని తెలిపారు. రీజియన్ పరిధిలోని విజయనగరం, శృంగవరపుకోట, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం డిపో-1, శ్రీకాకుళం డిపో-2, పలాస, టెక్కలి డిపోల నుంచి విశాఖపట్టణానికి ప్రత్యేక బస్సులు నడిపామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌ఎం కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్ జె.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

రెండవ రోజూ దరఖాస్తుల పరిశీలన
* ఆర్టీసీలో అప్రెటింస్ శిక్షణకు బారులు తీరిన అభ్యర్థులు
విజయనగరం (్ఫర్టు), జనవరి 19: ఆర్టీసీలో అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన మంగళవారం కూడా చేపట్టారు. విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించారు. పట్టణానికి సమీపంలో విటి అగ్రహారంలో ఉన్న ఆర్టీసీ స్టాప్ ట్రైనింగ్ కళాశాలలో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి సోమవారం దరఖాస్తులను స్వీకరించి పరిశీలన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విశాఖపట్టణం, రాజమండ్రి రీజియన్‌ల పరిధిలో పలు డిపోలలో అప్రంటిస్ శిక్షణ కోసం ఐటిఐ చదవిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల స్వీకరించి పరిశీలించేందుకు మంగళవారం కూడా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. విజయనగరం జోన్ పరిధిలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలలో పలు డిపోలలో అప్రంటిస్ శిక్షణ పొందేందుకు 309 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జోనల్ స్ట్ఫా ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జి.వరలక్ష్మి మాట్లాడుతూ ఐటిఐ మెరిట్‌కు 70 మార్కులు, సీనియారిటీకి 20 మార్కులు, ఎన్‌సిసి, స్పోర్ట్స్ కోటా కింద 10 మార్కులు వేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ముగ్గురు సభ్యులతో ఎంపిక కమిటీ ఉంటుందన్నారు. రోస్టర్ ప్రకారం అభ్యర్థుల జాబితాలను తయారు చేసి ఇంటర్వ్యూకు పిలుస్తామని అన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 19: విజయనగరం పట్టణంలోని పూల్‌బాగ్ కాలనీ ప్రాంతంలో పేకాట శిబిరంపై మంగళవారం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి జరిపి పేకాట ఆడుతున్న 10మంది వ్యక్తులను అరెస్టు చేసారు. ఈ సందర్భంగా వారినుండి 7625 రూపాయల నగదు, ఆరు సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను టూ టౌన్ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు.
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
* నగర పాలక సంస్థ కమిషనర్ జి.నాగరాజు
విజయనగరం (్ఫర్టు), జనవరి 19: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించామని నగర పాలక సంస్థ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా 26,28 వార్డులలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, పారిశుద్ధ్య నిర్వహణ బాగోలేదని, వీధిలైట్లు సక్రమంగా వెలగడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. ఆయా సమస్యలపై స్పందించిన కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఇంటింట చెత్త సేకరణకు శ్రీకారం చుట్టామని చెప్పారు. అదేవిధంగా సంవత్సరాల తరబడి ప్రధాన కాలువలలో పేరుకుపోయిన పూడిక తొలగించేందుకు సామూహిక తొలగింపుకార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. నగర ప్రజల సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి సారిస్తున్నామని, రోడ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్ ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్ వర్మ, 26వ వార్డు కౌన్సిలర్ బొబ్బాది త్రినాధరావు, 28వ వార్డు టిడిపి నాయకుడు పిన్నింటి సూర్యనారాయణ పాల్గొన్నారు.
లక్ష్యానికి మించి పోలియోచుక్కలు
శృంగవరపుకోట, జనవరి 19: మండలంలోని కొట్టాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో లక్ష్యానికి మించి పోలియో చుక్కలు వేసామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యధికారి వెంకటరావు తెలిపారు. పల్స్ పోలీయో మూడు రోజలు కార్యక్రమం అనంతరం మంగళవారం గిరిజన పిల్లలకు ఆయన వైద్య సేవలు అందించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ మండలంలో 6070 మంది పిల్లలను గుర్తించినప్పటికి ఇంకా ఎక్కువ మందికే చుక్కల మందులు వేసామని తెలిపారు. కార్యక్రమంలో సిహెచ్ ఓ వేణుగోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో చండీహోమం2
విజయనగరం (పూల్‌బాగ్), జనవరి 19: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి చదురుగుడిలో మంగళవారం చండీహోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ముందుగా గణపతిపూజ, పుణ్యాహవచనం, మండపారాధన కార్యక్రమాలను జరిపారు.అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో చండీహోమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి భానురాజా మాట్లాడుతు ప్రతి నెలా మూడవ మంగళవారం రోజున చదురుగుడి ప్రాంగణంలో చండీహోమాన్ని జరుపుతున్నామని చెప్పారు.హోమం నిర్వహించడం వల్ల ప్రజలకు సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. ఈకార్యక్రమంలో వేదపండితులు శంభర శంకరం, తాతారాజేష్ , ఆలయ అర్చకుడు దూసి కృష్ణమూర్తి పాల్గొన్నారు.
పైడితల్లి అమ్మవాకి చాక్లెట్ల అలంకరణ
విజయనగరం (పూల్‌బాగ్),జనవరి 19: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి చదురుగుడిలో మంగళవారం అమ్మవారిని చాక్లెట్లతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈసందర్భంగా వేకువజామున అమ్మవారికి విశేష కుంకుమపూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు పూజాదికాలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ పేరిట పూజలు జరిపించుకున్నారు.

జన్మభూమి కమిటీల రద్దుకు పోస్టుకార్డు ఉద్యమం

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 19: ప్రజాస్వామ్యానికి పునాదులైన స్థానిక సంస్థలను రక్షించాలని ఎపి పంచాయితీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు డిమాండ్ చేసారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎపి పంచాయితీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి కమిటీలను రద్దుచేయాలని, వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానిక సంస్థలకు ఉపఎన్నికలు వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియచేసేందుకు పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టామని తెలిపారు. నమ్మి ఓట్లువేసిన గ్రామీణ ప్రజల సంక్షేమానికి, గ్రామాల అభివృద్ది కోసం పంచాయితీరాజ్ ప్రతినిధులు ఈ పోస్టుకార్డు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామసభల ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేయాలని, కానీ జన్మభూమి కమిటీ పేరుతో సంక్షేమ పథకాల అమలు చేస్తున్న కారణంగా స్థానిక సంస్థల అస్థిత్వాన్ని దెబ్బతీయటమేనని విమర్శించారు. స్థానిక సంస్థల ఖాళీలకు నాలుగు నెలలకు మించకుండా ఎన్నికలు నిర్వహించాలని, కానీ గత 20నెలలుగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఖాళీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో స్థానిక పాలన కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి దుస్థితి లేదని విమర్శించారు. ప్రతి ఒక్క పంచాయితీరాజ్ ప్రతినిధులు ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా ప్రజాస్వామ్యన్ని కాపాడడానికి నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు సర్పంచ్‌లు, ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారు.

ఉత్తమ పోలీసులకు ప్రశంసాపత్రాలు

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 19: జిల్లాలో జరిగిన వివిధ సంఘటనల్లో సమయ స్ఫూర్తితో వ్యవహరించి కేసుల పరిష్కారంలో కీలకపాత్ర పోషించిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేసారు. బొండపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో వాహనాన్ని అతివేగంగా నడపటం ద్వారా ఒక వ్యక్తి మరణానికి కారణమైన నిందుతుడిని, ఆయన ఉపయోగించిన బొలేరో వాహనాన్ని విజయనగరం జిల్లా ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం.ప్రవీణ్ పట్టుకున్నారు. గడసాం గ్రామంలో లైసెన్స్‌లు లేకుండా మద్యం విక్రయిస్తున్న బెల్టుషాపులపై దాడిచేసి 1406 మద్యంసీసాలను పెదమానాపురం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కె.కేశవరావు గతనెలలో పిడబ్య్లూ మార్కెట్ వద్ద పడి ఉన్న ద్విచక్ర వాహనాన్ని గమనించి డిక్కీలో ఉన్న రికార్డుల ద్వారా వాహన యజమానిని గుర్తించి వాహనంతోపాటు డిక్కీలో ఉన్న డాక్యుమెంట్లు, డబ్బును యజమానికి అప్పగించారు. విధి నిర్వహణలో ప్రశంసనీయమైన పాత్ర పోషించిన వీరిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు, నగదు అందజేసారు.
మానసిక ఒత్తిడి నివారణకు
పోలీసులకు ప్రత్యేక శిక్షణ
పోలీసు సిబ్బందిలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాక్రమాన్ని చేపట్టింది. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జ్ఞాపకశక్తి, వ్యక్తిత్వ వికాస నిపుణులు షేక్‌అన్వర్‌తో పోలీసులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులను ఉద్ధేశించి షేక్ అన్వర్ మాట్లాడుతూ ఉదయం నిద్రనుంచి లేవగానే ధ్యానం చేయడం, వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం ద్వారా ప్రతి వ్యక్తి ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చెప్పారు. ప్రతిరోజు వాకింగ్, జాగింగ్ చేయడం, మంచి సంగీతం వినడం ద్వారా కూడా తనలోని ఒత్తిడిని తగ్గించుకోవచ్చని అన్నారు. ఆపిల్, బాదం, అరటిపండ్లు, నిమ్మరసం, గ్రీన్ టీ తదితర పదార్థాలు తీసుకోవడం, మంచి మేనేజ్‌మెంటు పాటించడం, నిద్రపోయే ముందు శరీరం మొత్తాన్ని బిగపట్టి ఊపిరి వదలడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. యోగా ద్వారా కూడా ఒత్తిడి తగ్గించుకోవచ్చని చెప్పారు. పోలీసు సిబ్బంది మానసిక ఒత్తిడికి దూరంగా ఉండగలిగితే విధి నిర్వహణ సక్రమంగా చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. కాగా ఆదాయపు పన్ను వ్యవహారాలపై జిల్లా పోలీసు అధికారులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చార్టర్డ్ అకౌంట్‌టెంట్ గోవిందరాజులు ఆదాయ పన్నుకు సంబంధించి వివిధ అంశాలు, నిబంధనలను పోలీసు అధికారులకు వివరించారు.