విజయనగరం

పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లల్లో పీవో ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, నవంబర్ 15: పార్వతీపురంలోని ఐటిడిఎ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలురు, బాలికలకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను గురువారం ఐటిడిఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలురు హాస్టల్‌ను సందర్శించిన పీవో హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తనను వచ్చి కలవాలని ఆదేశించారు. అదేవిధంగా బెలగాంలో గల బాలికల హాస్టల్‌ను సందర్శించి వంటకాలు పరిశీలించారు. హాస్టల్ విద్యార్థినులు బాగా చదువుకోవాలని పీవో సూచించారు. విద్యకు సంబంధించిన సూచనలతో పాటు వారి సమస్యలు గురించి పీవో విద్యార్థినుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ హాస్టల్‌పై ఫిర్యాదులు వస్తున్నందున హెచ్ డబ్ల్యువోకు పోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపారు. మెనూ సక్రమంగా పాటించాలని, హాస్టల్ విద్యార్థినుల విద్య, ఆరోగ్యం పట్ల ప్రత్యేక చూపాలని పీవో హెచ్ డబ్ల్యువోను ఆదేశించారు. అదేవిధంగా హాస్టల్ పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఎటిడబ్ల్యువో మారుతీబాయిని పీవో డాక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కార్యక్రమంలో సుబ్రమణ్యం, గురుకులం ఒయస్‌డి తదితరులు పాల్గొన్నారు.

షిర్డీసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు
పార్వతీపురం, నవంబర్ 15: కార్తీక మాసం సందర్భంగా స్థానిక వై కె ఎం కాలనీలోని గురువారం శ్రీ షిర్డీసాయి ధ్యాన మందిరంలో భక్తులు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా వారికి పాలాభిషేకం, పుష్పాభిషేకం తదితర పూజాధికాలు నిర్వహించారు.

జాతీయ స్థాయి తైక్వాండో
పోటీలకు గిరిజన విద్యార్థులు

పార్వతీపురం, నవంబర్ 15: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన గిరిజన విద్యార్థులకు గురువారం పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ అభినందించారు. ఈనెల 9నుండి 12 వరకు విశాఖలో జరిగిన ఎపి సిఎం కప్ రాష్టస్థ్రాయి తైక్వాండో పోటీల్లో పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారు. ఈమేరకు 9వ తరగతికి చెందిన ఎ.శివమణి, 7వ తరగతికి చెందిన హెచ్ ప్రకాష్‌కు బంగారు పతకాలు, 8వ తరగతికి చెందిన కొండగొర్రి లక్ష్మణరావుకు రజిత పతకం, 9వతరగతికి చెందిన పోలిరాజుకు క్యాంస పతకం సాధించారు. ఈమేరకు ఈనెల 25నుండి 30 వరకు మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో జరుగనున్న బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు ఎంపికయినట్లు పాఠశాల వ్యాయామ సంచాలకుడు మంతిని వాసుదేవరావు తెలిపారు. వీరికి పీవో డాక్టర్ లక్ష్మీశ అభినందిస్తూ క్రీడలకు అవసరమైన దుస్తులు కూడా వారికి అందించి ప్రోత్సహించారు. జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి ఐటిడిఎ పేరు నిలబెట్టాలని పీవో ఆకాంక్షించారు.

సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలి
*రాష్ట్ర ఫుడ్ కమిటీ సభ్యులు విజయకుమార్
బొబ్బిలి, నవంబర్ 15: సివిల్ సప్లయ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిటీ మెంబర్ విజయ్‌కుమార్ కోరారు. గురువారం మధ్యాహ్నం ఆయన స్థానిక సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌ను పరిశీలించారు. ఈ మేరకు స్టాక్ పాయింట్‌లో ఉన్న సరుకుల వివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బొబ్బిలి కోటను సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం సివిల్ సప్లై వ్యవస్థను సవాల్‌గా తీసుకుని సరుకులు సరఫరా చేస్తుందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సరుకులు అందజేయడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. డీలర్లకు కమిషన్ కూడా పెంచడం జరిగిందని, ఇంకా డీలర్లు ఏమైన సమస్యలను ఎదుర్కొంటే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈయన వెంట సీఎస్‌డీటీ బాలమురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

మద్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించాలి
బొబ్బిలి, నవంబర్ 15: మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలను నాశనం చేస్తున్న మద్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేసేందుకు మహిళలంతా సిద్ధంగా ఉన్నారని ఐద్వా జిల్లాకార్యదర్శి ఇందిర స్పష్టం చేశారు. మద్యం నియంత్రణ, మహిళలపై హింస, వేధింపులను అరికట్టాలని కోరుతూ స్థానిక తాండ్రపాపారాయ కళాశాలలో గురువారం సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యాన్ని నియంత్రించకపోవడంతో దీని వలన కుటుంబాలు చిన్నాబిన్నమవుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని, వాటి ద్వారా నిరుపేద ప్రజలు మద్యానికి బానిసలుగా మారుతూ కుటుంబ సభ్యులను హింసిస్తున్నారని ఆరోపించారు. దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు పుణ్యవతి, సురేష్, రాజేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.