విజయనగరం

ఎన్నికల్లో బూత్ కమిటీలది కీలకపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 15: రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో బూత్ కమిటీలదే కీలకపాత్ర అని ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఆయన తన నివాసంలో 6, 28, 29, 30 వార్డుల బూత్ కమిటీ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు కలసి సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. బూత్ కమిటీ విధి విధానాల కోసం ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాటిస్తూ అటు పార్టీకి, ఇటు ప్రజలకు వారధిగా నిలవాలన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడంతోపాటు పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో నియోజకవర్గ బూత్ కమిటీల కన్వీనర్ ఎస్‌వివి రాజేష్, వార్డు బూత్ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు.

ఫసల్ బీమాకు డిసెంబర్ వరకు గడువు
* వరికి జనవరి 15 ఆఖరి గడువు

విజయనగరం, నవంబర్ 15: రబీ సీజన్‌కు సంబంధించి ఫసల్ బీమా ప్రీమియం చెల్లించేందుకు వచ్చే నెలాఖరు వరకు గడువు ఉంది. రబీ సీజన్‌లో వేసే పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో రైతులకు మేలు జరగనుంది. రబీలో వేసే పంటలకు కరవు, తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఈ బీమా ద్వారా రైతులకు రక్షణ కలగనుంది. మొక్కజొన్న పంటకు గ్రామం యూనిట్‌గా లెక్కిస్తారు. ఇతర పంటలకు మండలం యూనిట్‌గా పరిగణిస్తారు. బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకున్న రైతు తప్పనిసరిగా ఈ బీమాను చెల్లించాల్సి ఉంటుంది. రుణంలో పంటల ప్రీమియం మినహాయించి మిగిలిన మొత్తాన్ని రైతులకు అందజేస్తారు. బ్యాంకుల నుంచి రుణం పొందని రైతులు కూడా ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. అయితే అది నిర్భందం కాదు. రైతుకు ఇష్టం ఉంటే ప్రీమియం చెల్లించవచ్చు. లేదా మానుకోవచ్చు. పెసలు, మినుములు పంటలకు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు ప్రీమియం చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే మొక్కజోన్న, వేరుశనగ, మిరప పంటలకు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రీమియం చెల్లించుకునే సదుపాయం ఉంది. ఇక వరి పంటకు అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 లోగా ప్రీమియం చెల్లించాలని స్పష్టం చేశారు. కాగా, ఈ దఫా జిల్లాలో ఫసల్ బీమాను బజాజ్ ఎలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించారు.
ఇక వరికి హెక్టారుకు రూ.1080 చెల్లిస్తే రూ.72500 బీమా కల్పిస్తారు. అలాగే మొక్కజొన్న పంటకు హెక్టారుకు రూ.825 ప్రీమియం చెల్లిస్తే రూ.55 వేల బీమా కల్పిస్తారు. మిరపకు హెక్టారుకు రూ.7500 ప్రీమియం చెల్లిస్తే రూ.1.50లక్షల బీమా వర్తిస్తుంది. వేరుశనగ పంటకు హెక్టారుకు రూ.712.50 ప్రీమియం చెల్లిస్తే రూ.47500 బీమా కల్పిస్తారు. మినుములు హెక్టారుకు రూ.375 చెల్లిస్తే రూ.25వేలు బీమా లభిస్తుంది. బ్యాంకుల ద్వారా రుణాలు పొందని రైతులు తాము స్వంతంగా ప్రీమియం చెల్లించుకునే వెసులుబాటు ఉంది. దీనివల్ల రబీలో రైతులకు ప్రయోజనం కలగనుంది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రకాల బీమాలు అమలు చేసిన రైతులకు సక్రమంగా పరిహారం అందేది కాదు. దీనివల్ల రైతుల్లో నిరాశ ఎక్కువగా కన్పించేది. గతంలో బీమా ప్రీమియం చెల్లించేటపుడు ఆయా కంపెనీ ఏజంట్లు సకాలంలో ప్రీమియం చెల్లించక రైతులు ఎక్కువగా నష్టపోయేవారు. ఆపద సమయంలో రుణాలు ఆదుకోకపోవడంతో రుణాలు పొందని రైతులు ప్రీమియం చెల్లించడానికి ముందుకు రాలేదు. ఈసారి ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకంలో కొన్ని మెరుగైన ప్రయోజనాలు కల్పించనుండటంతో రైతుల్లో ఆసక్తి పెరిగింది. వాతావరణ పరిస్థితులు సహకరించకపోయి పంటలు వేయకపోయినా బీమా పొందే సౌకర్యం కల్పించారు.

న్యాయ సేవా విభాగం ఇంటింటి ప్రచారం
గజపతినగరం, నవంబర్ 15: గజపతినగరం జూనియర్ సివిల్ న్యాయమూర్తి పల్లి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం పురిటిపెంట కాలనీలో మండల లీగల్‌సెల్ అధారిటీవారు ఇంటింటి న్యాయ సేవా ప్రచారం నిర్వహించారు. పురిటిపెంట కాలనీ సమీపంలో ఆర్టీసీ కాంపెక్స్ పరిధిలోని వారిని కలిసి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. పురిటిపెంట న్యూకాలనీ, ఎంపిడివొ ఆఫీసురోడ్డు, కాంపెక్స్ ప్రహరిదరిలో కాలువలు లేక, వీధిలైట్లు వెలగక నానా అవస్ధలు పడుతున్నామని కోర్టు మండల న్యాయసేవా విభాగం పరిశీలకులకు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది దేవర ఈశ్వరరావు, స్వచ్చంద సంస్ధ సభ్యులు గెద్ద సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు.

ఆరోగ్య పరిరక్షణకు అందరు సహకరించాలి
బొండపల్లి, నవంబర్ 15: ప్రజా ఆరోగ్య పరిరక్షణకు అందరు సహకరించాలని మండల ప్రత్యేక అధికారి ఎస్.వెంకటరావు కోరారు. గురువారం మండలంలోని బిల్లలవలస గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం ఎంపిడివొ ప్రకాశరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిశాఖల అధికారులు సమస్యలపై దృష్టి కేంద్రీకరించి పరిష్కరించాలని ఆదేశించారు. ఎంపిడివొ ప్రకాశరావు మాట్లాడుతూ గ్రామంలో సిసి రోడ్లు, కాలువలు నిర్మించడం జరిగిందని కొత్తగా శ్మశానవాటికకు సిసి రోడ్డు తమటాడ గ్రామానికి లింకురోడ్డు మరమ్మతుకు నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తొలుత అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి వంటలు పరిశీలించారు.
మధ్యాహ్న భోజన నిర్వాహకులు కట్టెలతో వంట చేయడంతో ఎంపిడివొ ప్రకాశరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రక్షిత మంచినీరు సరఫరా చేసే సంపులలో మురుగు పేరుకుపోయి మంచినీరు కలుషితం అవుతున్నదని దీని నివారణకు చర్యలు చేపట్టాలని ఆర్ డబ్ల్యు ఎస్ ఎ ఇ నవీన్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఎవరూ హాజరు కాకపోవడంతో గ్రామస్ధులు నిరుత్సాహం చెందారు. కార్యక్రమంలో ఇవొపి ఆర్‌డి వి.వి.రవికుమార్, పంచాయతీరాజ్ జె ఇ అప్పలనాయుడు, మండల విద్యాశాఖ అధికారి కూనిబిల్లి సింహాచలం, ఎపి ఎం పెంటంనాయుడు, పశువైద్యాధికారి లక్ష్మీదీపిక, మండల వ్యవసాయ అధికారి కె.రవీంద్ర తదితరలు పాల్గొన్నారు.

అన్ని శాఖలపై అవగాహన కలగాలి
బొండపల్లి, నవంబర్ 15: మండలంలో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై శిక్షణాకాలంలో అన్నిశాఖలపై అవగాహన కలగాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కె.హేమలత అన్నారు. గురువారం స్ధానికి ఎంపిడివొ కార్యాలయంలో పశుసంవర్ధశాఖ విధులు, బాధ్యతలు, గ్రామస్ధాయి పశువైద్యశాలల సిబ్బంది పనితీరు, పదోన్నతులు, పధకాలు తదితర అంశాలు చర్చించారు. అదే విధంగా మండల పరిషత్ విధులు, పరిపాలన చట్టాలు, పంచాయతీ చట్టాలు, తదితర అంశాలపై సిబ్బందితో చర్చించారు. ఈ కార్యక్రమంలో బొండపల్లి పశువైద్యాధికారి లక్ష్బీదీపిక, జూనియర్ అసిస్టెంట్ తిరుపతిరావు, సీనియర్ అసిస్టెంట్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 390 కేంద్రాలలో ప్రతిభా పరీక్షలు
గజపతినగరం, నవంబర్ 15: రాష్ట్రంలోని 390 కేంద్రాలలో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తామని గ్రామోదయ రాష్ట్ర సమన్వయకర్త రుద్ర శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మరుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మరుపల్లి హైస్కూల్, కస్తూరిభాగాంధీ విద్యాలయం, ఆదర్శ పాఠశాలకు చెందిన 200మంది విద్యార్ధులకు టాటా బిల్డింగ్ సహకారంతో స్వీట్ స్వచ్చంద సంస్ధ కార్యదర్శి ఉప్పల ఈశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులలో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికి తీసేందుకు ఇటువంటి పోటీ పరీక్షలు దోహదపడతాయన్నారు. గ్రామీణ విద్యార్ధులలోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు టాటా బిల్డింగ్ సంస్ధను అభినందించారు.
ఎబిలిటీ పౌండేషన్ డైరక్టర్ సూర్యభాస్కర్ మాట్లాడుతూ ఈ పోటీలలో విజేతలకు జిల్లా, రాష్ట్ర స్ధాయి పోటీలలో పాల్గొని విజేతలగా నిలిచిన వారిని దత్తత తీసుకొని వారికి సహకారం అందిస్తామని అన్నారు. స్వీట్ సంస్ధ కార్యదర్శి ఉప్పల ఈశ్వరరావు మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాలలో బాగస్వామ్యం కావడానికి తమ సంస్ధ ఎపుడూ ముందు ఉంటుందని తెలిపారు. అనంతరం వ్యాసరచన పోటీలలోని 24మంది విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలతోపాటు దృవీకరణ పత్రాలు అతిధులు అందజేశారు. కార్యక్రమంలో సిడబ్లుసి జిల్లా చైర్మన్ లక్ష్మణ, ప్రధానోపాధ్యాయురాలు యశోధ, ప్రిన్సిపాల్ ఇందిరాస్వాతి, దివ్య, నీలిమ, సిహెచ్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.